మహా' రాజకీయాల్లో మలుపులు

By Ramana.Damara Singh Jun. 15, 2021, 04:30 pm IST
మహా' రాజకీయాల్లో మలుపులు

రెండేళ్లు కూడా నిండని మహారాష్ట్ర అధికార కూటమి అప్పుడే బీటలు వారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పటి నుంచి ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగదని మొదలైన ఊహాగానాలు.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న అధికార కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలా వ్యాఖ్యలతో మరింత జోరందుకున్నాయి.

మహావికాస్ అఘాడీ మనుగడ మూణ్ణాళ్ళే

2019 ఆక్టోబరులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమిగా పోటీ చేసి మెజారిటీ సీట్లు దక్కించుకున్నాయి. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య పేచీ ఏర్పడింది. ఆ పదవి తమకే కావాలని ఎవరికివారు పట్టుదలకు పోయారు. దీన్ని అవకాశంగా ఉపయోగించుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) అధినేత శరద్ పవార్ చొరవతో అనూహ్యంగా మహా వికాస్ అఘాడీ పేరుతో కొత్త కూటమి పురుడుపోసుకుంది. బీజేపీకి కటీఫ్ చెప్పిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెసులతో ఏర్పాటైన ఈ కూటమి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం అయిన తర్వాత తొలిసారి థాక్రే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. వారిద్దరూ చాలాసేపు ఏకాంతంగా మంతనాలు జరిపారు. అప్పట్లోనే ఈ భేటీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శివసేన, బీజేపీలు మళ్లీ దగ్గరవుతున్నాయన్న వాదనలు వినిపించాయి. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దూరమైన మిత్రపక్షాలను తిరిగి మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైంది. అందులో భాగమే మోదీ, థాక్రే భేటీ అన్న ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రస్తుత మహావికాస్ అఘాడీ ప్రభుత్వం త్వరలో మారుతుందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు

మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలా తాజాగా చేసిన వ్యాఖ్యలు మరిన్ని సందేహాలు రేపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. పార్టీ అధిష్టానం అనుమతిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే ఉంటానని వెల్లడించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై సందేహాలు పెరుగున్నాయి. ఎన్సీపీ నేతలు శరద్ పవార్, జయంత్ పటేల్ ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీ, ముంబైలలో మారుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం బీజేపీ, శివసేన మళ్లీ కలవడం ఖాయమని.. తత్ఫలితంగా ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే మారిపోతుందని అంటున్నారు.

Also Read : మోదీ ఇలాకాలో పాగా వేస్తామంటున్న ఆప్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp