విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలు.. అమరావతి మద్ధతుపార్టీలకు సువర్ణావకాశం..

By Karthik P Mar. 06, 2021, 12:30 pm IST
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలు.. అమరావతి మద్ధతుపార్టీలకు సువర్ణావకాశం..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ గెలిస్తే.. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి అనుమతి ఇచ్చినట్లేనన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అమ్మేది కేంద్రప్రభుత్వమైతే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై మాట్లాడిన చంద్రబాబు.. కార్యనిర్వాహక రాజధాని అంశంపై మాత్రం ఇలాంటి హెచ్చరిక ప్రకటన చేయలేదు. విశాఖలో వైసీపీ గెలిస్తే.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లేనన్న మాట చంద్రబాబు నోట నుంచి రాకపోవడం బాబు శైలి రాజకీయానికి నిదర్శనం. విశాఖ సంగతి ఏమో గానీ మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ, ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే టీడీపీ డిమాండ్‌కు ప్రజా బలం ఉందని నిరూపించుకునేందుకు చంద్రబాబుకు మున్సిపల్‌ ఎన్నికల రూపంలో మంచి అవకాశం లభించింది.

అమరావతి రాజధాని గుంటూరు, విజయవాడ మధ్య ఉంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు కార్పొరేషన్లను గెలుచుకోవడం ద్వారా అమరావతికి ప్రజా మద్ధతు ఉందని, మూడు రాజధానులకు లేదని చెప్పుకునేందుకు టీడీపీకి ఓ మంచి అవకాశం వస్తుంది. ఈ తరహాలో గుంటూరు, విజయవాడ కారొపరేషన్‌ ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రచారం చేసుకొవచ్చు. రెండు కార్పొరేషన్లు, నగరాల్లో టీడీపీకి రాజకీయంగా ఘనమైన చరిత్రే ఉంది.

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ, గుంటూరు నగరాల్లో టీడీపీ మంచి ఫలితాలను రాబట్టింది. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని రెండు నగరాల్లో పసుపు జెండాను ఎగురవేసింది. రాష్ట్రం మొత్తం మీద 25 ఎంపీలకుగాను టీడీపీ మూడు గెలిస్తే.. అందులో రెండు విజయవాడ, గుంటూరు లోక్‌సభ స్థానాలే. అసెంబ్లీ స్థానాల్లోనూ విజయవాడ, గుంటూరు నగరాల్లో టీడీపీ తన పట్టును నిరూపించుకుంది. గుంటూరులో రెండు నియోజకవర్గాలు ఉంటే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ, ఈస్ట్‌ నియోజకవర్గంలో వైసీపీ గెలిచాయి. విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో గెలిచిన టీడీపీ సెంట్రల్‌ సీటను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడిపోయింది. వెస్ట్‌లో వైసీపీ గెలిచింది.

Read Also : తిరుపతి పీఠం కోసం పోటీపడుతున్నా వైసీపీ నేతలు ఎవరు?

ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి తిరుపతి, చిత్తూరు వంటి కార్పొరేషన్లు, పిడుగురాళ్ల, మాచర్ల, తుని వంటి మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితికి భిన్నంగా విజయవాడ, గుంటూరులో టీడీపీ పరిస్థితి ఉంది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులకు ఆ పార్టీకి కొదవ లేదు. విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లలోనూ పోటీ నెలకొంది. గుంటూరు 57 డివిజన్లకు గాను ఒక్క డివిజన్‌ మాత్రమే ఏకగ్రీవమైంది. అంటే ఇక్కడ పోరు హోరాహోరీగా సాగడం ఖాయమైంది.

ఈ రెండు కార్పొరేషన్లలో టీడీపీ సీపీఐతో పొత్తు పెట్టుకుని, జనసేనతో అవగాహనతో బరిలోకి దిగింది. వైసీపీ ఒంటిరిగా పోటీ చేస్తోంది. టీడీపీ, జనసేన, సీపీఐలు అమరావతికి మద్ధతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. కాబట్టి విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాలు గెలుచుకోవడం ద్వారా టీడీపీ, దాని మిత్రపక్షాలు మూడు రాజధానులకు ప్రజా బలం లేదని నిరూపించవచ్చు. అదే సమయంలో వైసీపీ గెలిస్తే అమరావతి ప్రాంత ప్రజలే మూడు రాజదానులకు జై కొట్టారనుకోవచ్చు. 400 రోజులకు పైబడి చేస్తున్న రాజధాని ఉద్యమంలో కూడా పస లేదని తేలిపోతుంది. ఇలాంటి ప్రమాదాన్ని తప్పిస్తూనే.. రెండు కార్పొరేషన్లను గెలవడం ద్వారా ప్రజా బలంతో అమరావతి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించే అవకాశాన్ని టీడీపీ తీసుకుంటుందా..?

Read Also : అనంతపురం మేయర్ పదవికి పోటా పోటీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp