తిండి, విటమిన్లతోనే ఆరోగ్యమా!

By Jaswanth.T Sep. 15, 2020, 05:00 pm IST
తిండి, విటమిన్లతోనే ఆరోగ్యమా!

తిండికలిగితె కండకలదోయి.. కండ కలవాడేను మనిషోయి.. అంటూ గురజాడ అప్పారావు తన దేశ భక్తిగేయంలో చెబుతారు. ప్రస్తుతం కరోనా కాలంలో దేశ ప్రజలంతా దీన్ని తప్పకుండా దర్శంగా తీసుకున్నట్లుగా కన్పిస్తోంది. గుడ్లు, చికెన్, చేపలు వంటి నాన్‌వెజ్‌తో పాటు, విటమిన్‌ టాబ్లెట్లను కూడా భారీగానే లాగించేస్తున్నారట. ఇప్పటికే పలు నివేదికలు వీటిని ఖరారు చేసాయి. సాధారణ గుడ్లు, మాసం వినియోగంతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు ఎక్కువ వినియోగం అవుతున్నట్లుగా సంబంధిత సంస్థలు చెబుతున్నాయి.

అలాగే దేశం మొత్తం మీద జరిగే ఫార్మా అమ్మకాల్లో 40శాతం వరకు విటమిన్‌లదేనన్న నివేదికలు కూడా వెలుగుచూసాయి. సాధారణంగా వాడే గైనిక్, న్యూరో, ఆప్తమాలజీ, డెంటల్‌ తదితర మందుల వినియోగం భారీగా తగ్గిపోయిందట. అయితే అదే స్థాయిలో విటమిన్స్‌ వినియోగం పెరిగిపోయిందని చెబుతున్నారు. షుగరు, గుండె, కేన్సర్‌ సంబంధిత మందుల వినియోగంలో పెద్దగా తేడాల్లేనట్లుగా తెలుస్తోంది.

కరోనా మనిషి జీవన గమనాన్ని మార్చివేసినట్లుగానే వారి ఆహారపు అలవాట్లు, వైద్యం తదితర వాటిలో కూడా పూర్తిగానే మార్పుతీసుకొచ్చింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుకోవాల్సిందేనని నిపుణులు తమ అభిప్రాయంగా చెబుతున్న నేపథ్యంలో అందుకు కీలకమైన ఆహారం, విటమిన్‌లపై ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఆధారపడినట్లుగా ఆయా నివేదికల సారాంశాన్ని బట్టి తెలుస్తోంది. ఆహారంలో గుడ్లు, చికెన్, మటన్, చేపల వినియోగం పెరిగినట్టుగానే విటమిన్‌లలో జింక్, బీ,డీ,సీ విటమిన్స్‌ను కూడా అత్యధికంగానే వినియోగిస్తున్నారు.

అయితే ఈ విధమైన మార్పు ద్వారా పొందే ప్రయోజనం తక్కువేనన్న వాదన కూడా లేకపోలేదు. ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే శరీరానికి తగు పోషకాలను అందించాలని, తాత్కాలికమైన వాటిపై ఆధారపడడం అంత కరెక్టు కాదన్నది పలువురు ప్రకృతి వైద్యులు చెబుతున్న మాట. రోగ నిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు నాన్‌వెజ్‌ తినడం, విటమిన్‌ టాబ్లెట్లు వేసుకోవడం ఒక్కటే మార్గం కాదన్నది వారి వాదన. శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలని, అందుకు తగిన శారీరక శ్రమ కూడా చేయాలని వారు సూచిస్తున్నారు.

బైటకు వెళ్ళేందుకు భయపడుతున్న ప్రస్తుత తరుణంలో గత ఆరునెలలుగా ఇంటి పట్టునే ఉండి నచ్చిన ఆహార పదార్ధాలు లాగించేస్తున్న వారు ఒక్కసారి తమ శారీరక బరువుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఒక వేళ బరువు గనుక పెరిగే దానిని తగ్గించుకోవడానికి తప్పని సరిగా చర్యలు తీసుకోవాలంటున్నారు. తగిన ఆహారం, విశ్రాంతి తీసుకోవడంతో పాటు, శారీరక శ్రమ ద్వారా మాత్రమే రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉంటుందన్నది గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

లేకపోతే కోవిడ్‌ ఎదుర్కొనేందుకు కషాయాలు తాగితే మంచిదన్న మెస్సేజ్‌లను చూసి, సదరు కషాయాలు తాగిన వాళ్ళు జీర్ణ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రుల చుట్టూ తిరగడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఇప్పుడు ప్రమాదం వచ్చింది కాబట్టి తాత్కాలికంగా నాన్‌వెజ్, విటమిన్లపై ఆధారపడకూడదన్నది వారి మాటల్లోని అంతరార్ధంగా తోస్తుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్లుగా వాళ్ళు ఆహారం తీసుకుండా, వ్యాయామం చేస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఒక వేళ చేరినా దానిని ఎదుర్కొగలిగే స్థాయికి శరీరం చేరుకుంటుందని వివరిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp