వివాదమే నిమ్మగడ్డ అజెండానా..?

ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయపరమైన వివాదాలు, ప్రభుత్వంతో గొడవలు, ఉద్యోగులపై వేటు వంటి నిర్ణయాలతో అత్యంత వివాదాస్పద అధికారిగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాబోయే రోజుల్లో మరింత వివాదాస్పదంగా వ్యవహరిచబోతున్నారా..? ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను తన వ్యక్తిగత అజెండా అమలుకు వినియోగించబోతున్నారా..? రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యాలు కొనసాగించబోతున్నారా..? ఎన్నికల నిర్వహణ పేరుతో విచ్చలవిడిగా అధికారం చెలాయించబోతున్నారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాల ద్వారా అవుననే సమాధానం వస్తోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ స్టే ఇవ్వడంతో.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.
హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించినా.. అవేమీ పట్టని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హుటాహుటిన గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మినహా మిగతా 11 జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఆ రెండు జిల్లాలో గత ఏడాది మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక ఘటనలు జరిగాయంటూ.. కలెక్టర్లను తప్పించాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వారితోపాటు చిత్తూరు అర్బన్, గుంటూరు రూరల్ ఎస్పీలను మార్చాలని సర్కులర్ జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలో కరోనా పేరు చెప్పి అర్థంతరంగా ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ.. అదే సమయంలో కలెక్టర్లు, ఎస్పీలను మార్చాలని ఆదేశించి వివాదం రేపారు. ఎన్నికలు వాయిదా వేయడం, అదే సమయంలో అధికారుల మార్పు.. పరస్పర భిన్నమైన నిర్ణయాలు తీసుకున్న నిమ్మగడ్డ వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో.. ప్రభుత్వాన్ని నిందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజకీయ నేతలతో సమావేశమైన వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. నాడు తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం అధికారులను మార్చాలంటూ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన నిమ్మగడ్డ తన లక్ష్యం ఏమిటో బయటపెట్టుకుంటున్నారు.
మునుపెన్నడూ లేనివిధంగా ఏ ఎన్నికల కమిషనర్ వ్యవహరించని రీతిలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రవర్తిస్తుండడం మాజీ ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజకీయపరమైన అజెండాతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. ఆయన తీరు మారకపోగా మరింత వివాదాస్పదంగా మారుతోంది. నిమ్మగడ్డ ఏ విధంగా వ్యవహరిస్తోంది ఏపీలోని సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. ఈ తరహా తీరుతో ఆ స్థానానికి కళంకం తెస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నా.. నిండా మునిగాక చలి ఏముందనే మాదిరిగా నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉండబోతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే.. ఆ సమయంలో నిమ్మగడ్డ తీరు మరింత వివాదాస్పదమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click Here and join us to get our latest updates through WhatsApp