సీఎం లెక్క తప్పుతోందా..?

By Karthik P May. 04, 2021, 12:44 pm IST
సీఎం లెక్క తప్పుతోందా..?

ఈటల రాజేందర్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ లెక్క తప్పిందా..? రాజేందర్‌ దూకుడుతో టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు నష్టం జరుగుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి ఉన్న నేత పట్ల, తనకు కుడిభుజం అంటూ చెప్పిన కేసీఆర్‌.. ఈటెల విషయంలో వ్యవహరించిన తీరు సరికాదనే భావన సర్వత్రా నెలకొంది. మేము కిరాయిదారులం కాదు.. పార్టీకి ఓనర్లం అంటూ ఈటల మాట్లాడడంతోనే.. ఆయన్ను కావాలనే మంత్రివర్గం నుంచి తప్పించేందుకే భూ కబ్జా వ్యవహారం తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది.

అవినీతి ఆరోపణలపై టి. రాజయ్యను తొలగించినప్పుడు ఆయన మిన్నుకుండిపోయారు. కేసీఆర్‌కు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నిరసన గళం వినిపిస్తే భవిష్యత్‌ ఉండదనే భావనలో రాజయ్య మౌనం వహించారు. ఇదే విధంగా ఈటల కూడా ఉంటారని కేసీఆర్‌ భావించారు. అయితే ఉద్యమంలో ఉన్న నాయకుడుగా, తాను తప్పు చేయలేదనే నమ్మకంతో ఉన్న ఈటలకు కేసీఆర్‌ నిర్ణయం ఆగ్రహం తెప్పించింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సొంత మీడియాలో కబ్జాదారు అంటూ ప్రచారం చేయించడం, నిజానిజాలు తెలుసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం ఈటల జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నిరసన గళం విప్పారు. మంత్రివర్గం నుంచి తొలగించిన మురుసటి రోజు మీడియాతో మాట్లాడిన రాజేందర్‌.. పార్టీలో తాను చేసిన పని, ఉద్యమంలో, ప్రభుత్వంలో తాను నిర్వర్తించిన బాధ్యతలను గుర్తు చేస్తూ.. కే సిఆర్‌ లక్ష్యంగా పలు ప్రశ్నలు సంధించారు. ఈ సమయంలో ఆయన ఎక్కడా దూకుడు, దుందుడుకు వ్యాఖ్యలు చేయకుండా కేసీఆర్‌ను ఇరుకునపెట్టేలా వ్యవహరించారు. న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

ఉద్యమ నాయకుడు కావడంతో ఈటలకు ప్రజా బలం కూడా ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. నిజాం ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థులు ఈటలకు మద్ధతుగా ఉన్నారు. అంతేకాకుండా సొంత నియోజకవర్గం ప్రజలు, నేతలు, కార్యకర్తలు ఈటల వైపు నిలుచున్నారు. మంత్రిగా పని చేసే సమయంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు ఈటలపై రాకపోవడం, పక్కా తెలంగాణా వాది అనే పేరు ఈటలకు ఈ సమయంలో కలసి వచ్చే అంశాలు. కారు గుర్తుపై గెలిచారు.. రాజీనామా చేయాలంటే.. చేస్తానని కూడా ఈటల చెప్పడం ఆయన ఎంచుకున్న మార్గాన్ని తెలియజేస్తోంది. ఈటల తీరు.. కేసీఆర్‌ ఒకప్పటి సన్నిహితులు, ఇప్పటి వ్యతిరేకులను ఒక్కటి చేసేలా కనిపిస్తోంది. ఫ్రొఫెసర్‌ కోదండరాం వంటి వాళ్లు ఈటలతో కలసి నడిచే అవకాశం ఉంది.

ప్రజా స్వామ్యంలో అణచివేతకు అవకాశం లేదని, ప్రజలు తగిన సమయంలో శిక్షిస్తారంటూ ఈటల మాట్లాడడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. ముదిరాజ్‌ బిడ్డను అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు వెనుక భవిష్యత్‌ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని చెప్పాలి. పార్టీ పెడతారా..? లేక ఇప్పటికే ఉన్న పార్టీలలో చేరి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పని చేస్తారా..? అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. మొత్తం మీద ఈటల వ్యవహారం టీఆర్‌ఎస్‌లో అలజడిని సృష్టించిందనే చెప్పాలి.

ఈటలపై ప్రయోగించిన భూ కబ్జా అస్త్రం ఆయనతోనే ఆగిపోవడం లేదు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు, ఎంపీ రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ నేతల భూ కబ్జాల చిట్టాను బయటపెట్టారు. అయితే కేసీఆర్‌ అండ ఉన్నంత వరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు. అందుకే రేవంత్‌.. టీఆర్‌ఎస్‌ నేతల భూ కబ్జాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు, సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిలకు ఫిర్యాదు చేసి, ఆధారాలు అందిస్తానని చెబుతున్నారు. మరి ఈటల వ్యవహారం ఎటు తరిగి.. ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.. వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp