ఈటల రాజేందర్ బలం కేసీఆర్ కు తెలుసా..?

By Ritwika Ram Jul. 21, 2021, 09:30 pm IST
ఈటల రాజేందర్ బలం కేసీఆర్ కు తెలుసా..?

తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. రెండు నెలలకు ముందు దాకా ఇద్దరిదీ ఒకే పార్టీ. కానీ రాజకీయ కారణాలతో టీఆర్ఎస్ నుంచి ఈటల బయటికి వచ్చారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అసమ్మతి వినిపించి.. మంత్రి పదవిని పోగొట్టుకుని, తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఇద్దరూ ప్రత్యర్థులు అయ్యారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. హూజూరాబాద్ ఉప ఎన్నికకు సిద్ధమయ్యారు. కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈటల అంగబలం, అర్థబలం తెలిసిన కేసీఆర్.. అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతున్నారు.

ఒకరి బలాలు ఒకరికి తెలుసు

కేసీఆర్, ఈటల రాజేందర్ ఇద్దరూ రెండు దశాబ్దాలు కలిసి పని చేశారు. టీఆర్ఎస్ స్థాపన నుంచి రెండో సారి అధికారంలోకి వచ్చే దాకా కష్టపడ్డారు. తెలంగాణ రాకముందు.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఎంపీగా ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ రాజకీయాలు చేస్తే.. ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో టీఆర్ఎస్ పక్ష నేతగా తెలంగాణ వాయిస్ ను గట్టిగా వినిపించే వారు ఈటల రాజేందర్. కేసీఆర్ వ్యూహాలు ఈటలకు తెలుసు.. ఈటల బలాబలాలను కేసీఆర్ కు తెలుసు. ఇప్పుడు రాజకీయ శత్రువులు మారిన ఇద్దరూ ఎన్నికల యుద్ధంలో పోటీ పడుతున్నారు. సీఎంగా తనకున్న అధికారాలతో ఈటల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు కేసీఆర్. ఇప్పుడు వీరిద్దరూ ఆడుతున్న ఆట రసవత్తరంగా మారింది.

Also Read : టీఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికి కాదా?

ఈటల పాదయాత్ర

తన పదవికి రాజీనామా చేసిన ఈటల.. సింపతీ ఓట్లతో గెలవాలని భావించారు. ఆత్మ గౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గమంతా చుట్టేశారు. ఇంటింటి ప్రచారం చేశారు. ఆయన భార్య జమున కూడా ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఈటల పాదయాత్ర కూడా ప్రారంభించారు. రోజుకోరకంగా కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తనను హత్య చేసేందుకు గతంలో కొందరు ప్రయత్నించారని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తేలిగ్గా కొట్టిపారేసిన టీఆర్ఎస్ నేతలు.. సానుభూతి ఓట్ల కోసం ఈటల అలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

కేసీఆర్ పద్మవ్యూహం

రాజకీయ దురంధరుడు కేసీఆర్. అందుకే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేసేశారు. ఒకే ఒక ఉప ఎన్నికతో జానారెడ్డి లాంటి సీనియర్ నేతను సైలెంట్ చేసేశారు. ఇప్పుడు ఈటలను ఎలాగైనా ఓడించే పనిలో పడ్డారు. ఈటల బలాబలాలు తెలిసిన సీఎం.. అందుకు తగ్గట్లుగానే పద్మవ్యూహం పన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందేలా చూస్తున్నారు. కొత్తవి మంజూరు చేస్తున్నారు. దళిత బంధు పేరుతో పథకం ప్రకటించి.. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నే ఎంపిక చేశారు. ఒకరకంగా ఇది మాస్టర్ స్ట్రోక్.

దళితులు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్ లో ఎన్నికల సమయంలో ఈ పథకం ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. అయితే ఎన్నికల కోసమే హుజూరాబాద్ ను ఎంపిక చేశారన్న ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొడుతూ.. గతంలో రైతు బంధు కూడా అక్కడి నుంచే ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో దెబ్బకు ప్రతిపక్షాలకు ఊపిరాడని పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కు అభ్యర్థి లేకుండా చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి హుజూరాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకున్నారు. బీసీల్లో బలమైన నేత ఎల్.రమణను ఆహ్వానించారు. దీంతో ఈటల గెలిచేందుకు అవకాశమే లేకుండా అన్ని మార్గాలను మూసేస్తున్నారు.

Also Read : ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును బుక్ చేసిన రేవంత్ రెడ్డి..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp