వ్యాక్సిన్‌ ఓకే.. ఆ తరువాత ఏంటి..?

By Jaswanth.T Sep. 23, 2020, 12:00 pm IST
వ్యాక్సిన్‌ ఓకే.. ఆ తరువాత ఏంటి..?

కోవిడ్‌ 19ను ఎదుర్కొవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం అన్నంత రీతిలో ప్రచారం సాగుతోంది. ప్రపంచ దేశాలు కూడా తాము ముందున్నామంటే, తాము ముందున్నామంటూ వ్యాక్సిన్‌ ప్రయోగాలను గురించి ట్వంటీట్వంటీ క్రికెట్‌మ్యాచ్‌ అప్‌డేట్స్‌ ఇస్తున్నట్లు ఊరిస్తున్నాయి. ఇందులో నిజానిజాలెంత అన్నది పక్కన పెడితే గత ఆరేడు నెలలుగా జరుగుతున్న ప్రయోగాలు ప్రస్తుతం మూడవ దశకు చేరుకున్నాయి. మొదటి దశ నుంచి ఒక్కో దశకు వెళ్ళే కొద్దీ విజయం సాధిస్తే విజయం, లేకపోతే అంతే. ఇక్కడ ఏ గ్యారెంటీలు, వారంటీలు ఉండవు.

క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో వ్యాక్సిన్‌ ఇచ్చిన ఏ ఒక్క వాలంటీర్‌కు అనారోగ్యం కలిగినా అది ఎందుకు వచ్చిందన్నది తేలే వరకు ప్రయోగాలను ముందుకు తీసుకు వెళ్ళగలిగే పరిస్థితి ఉండదు. ఇది సాంకేతిక పరంగా ఉన్న ప్రధాన అడ్డంకి. దీనిని అధిగమించడానికి వేరే ఏ మార్గాలు దాదాపు ఉండవు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యాక్సిన్‌ అవసరం దృష్ట్యా ప్రయోగాల ప్రోటోకాల్స్‌ను సవరిస్తూ ఆయా సంస్థలు వీలైనంత వేగంగా వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.

ఇంత వరకు బాగానే ఉంది. కోవిడ్‌ ఉధృతిలో కొట్టుకుపోతున్న వారికి ‘‘వ్యాక్సిన్‌ వచ్చేస్తే.. ఇబ్బంది తీరిపోతుంది’’ అనే భరోసాను కల్పిస్తున్నారు. మానసిక పరమైన ఇటువంటి సంతృప్తితో కొంత మంది ఆశావహదృక్ఫథాన్ని కూడా ఏర్పరచుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 780 కోట్ల జనాభాకు సరిపడే వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసి, వారందరికీ అందించేందుకు తగిన ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే.

పోనీ దేశాల వారీగా వారివారి అత్యవసరాలను బట్టి వ్యాక్సిన్‌లను పంపిణీ జరుగుతుందనుకున్నా ఆయా దేశాల ఆర్ధిక స్థితిగతులను బట్టి, అక్కడి ప్రజల ఒత్తిడిలను బట్టి ఆయా ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తాయన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. మరోవైపు ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలు ముందుగానే భారీ సంఖ్యలో వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇస్తూ పేదదేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

జనాభా మొత్తానికి వ్యాక్సిన్‌ అవసరం లేదనుకున్నప్పటికీ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, సీనియర్‌ సిటిజన్స్, చిన్నారులకు తప్పని సరిగా వ్యాక్సిన్‌ వెయ్యాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ లెక్కనైనా వ్యాక్సిన్‌లు భారీగానే అవసరం పడతాయి. ధనికదేశాల మాట పక్కన పెడితే పేద దేశాలు వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి తమ దేశాల్లోని ప్రజలకు అందించగలిగే పరిస్థితి ఇప్పుడు ఉందా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు ఉచితంగా అందించకపోతే, ప్రజలే స్వయంగా కొనుగోలు చేయాల్సి వస్తే, అందుకయ్యే ఖర్చును తట్టుకునే స్థాయి వారికి ఉంటుందా? అన్నది కూడా ఎటూ తేలని ప్రశ్నగానే ఉండిపోతోంది.

కరోనా కారణంగా తీవ్ర ఆర్ధిక ఒడిదుడుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్న దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయకపోతే, ప్రజలు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వినియోగంపై దృష్టి పెట్టగలిగే పరిస్థితులు ఉండవు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ అనేది ఈ యేడాది కాకపోతే, వచ్చే యేడాది అయినా వస్తుంది. అయితే వ్యాక్సిన్‌ తరువాత పరిస్థితులు ఏంటన్నదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ చోటు చేసుకుంటోంది. తగినంత వ్యాక్సిన్‌ ఉత్పత్తి అయ్యేందుకు వచ్చేయేడాది చివరి వరకు సమయం పట్టొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు గగన్‌దీప్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రయోగాలు పూర్తయి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాక వాటి నిల్వ, పంపిణీలు సవాలుతో కూడుకున్నదేనన్నది గగన్‌దీప్‌ అభిప్రాయం. సమర్ధవంతమైన పంపిణీకి తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేయడం భారత్‌ సహా చాలా దేశాలకు పెనుసవాలేనని స్పష్టం చేస్తున్నారు.

ఇంత దూరాలోచన ఎందుకంటారా.. అయితే భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, జనసమూహాలకు దూరంగా ఉండడం, పౌష్టికాహారం తీసుకోవడం, తగిన వ్యాయామాలు చేయడం.. వంటివి తప్పని సరిగా పాటించడం ద్వారా మహమ్మారి భారిన పడకుండా జాగ్రత్త పడేందుకు బహు చక్కటి అవకాశం కూడా మనకు అందుబాటులోనే ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp