రాష్ట్రంలో కమలానికి కొత్త సారధి రానున్నారా ??

By iDream Post Mar. 13, 2020, 05:36 pm IST
రాష్ట్రంలో కమలానికి కొత్త సారధి రానున్నారా ??

గత కొంతకాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షుల మార్పు తప్పదని, రాష్ట్ర శాఖ సారధ్య భాద్యతలనుండి ఇప్పుడున్నవారిని తప్పించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని బిజెపి యోచిస్తున్నట్టు ఆమధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్ర బిజెపి సారధ్య బాధ్యతలను కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ కి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి అధ్యక్ష్యుడి మార్పు ఖాయమైంది సమాచారం.

రాష్ట్ర బిజెపి నూతన సారధ్య భాద్యతలను చేపట్టడానికి మొదటినుండి అనేకమంది రాష్ట్రస్థాయి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మనారాయణ, పురంధరేశ్వరి, సోము వీర్రాజు, మాజీమంత్రి మాణిక్యాల రావు, సినీ నటుడు కృష్ణం రాజు, కావూరి సాంబశివ రావు లాంటి నేతల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలించినప్పటికీ, రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక వైపు జనసేనతో రాజకీయ అవగాహన కుదుర్చుకున్న నేపథ్యంలో, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత వెనుకబడిన బిసి లకు పార్టీ అధిష్టానంఈసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర బిజెపి నూతన రధసారధిగా ఉత్తరాంధ్రకు చెందిన యువనేత, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పేరు దాదాపు ఖరారైందని సమాచారం. ఈ నెలాఖరులో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ఘట్టం పూర్తి కాగానే ఆయన పేరును ఏక్షణంలోనైనా ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల సమయంలో కాపు వర్గానికి సారధ్యభాద్యతలు అప్పగించడం ద్వారా రాజకీయంగా లాభపడాలని భావించిన బిజెపి అధిష్టానం కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మనారాయణ కు ఆబాధ్యతలు అప్పగించింది.

అయితే అయన నియామకం రాష్ట్రంలో పార్టీకి ఏవిధంగానూ కలిసిరాలేదు. గత ఎన్నికల్లో ఒంటరి గా పోటీ చేసిన బిజెపి దేశవ్యాప్తంగా సత్తా చాటినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ఘోరమైన ఫలితాలతో అవమానాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ఘోరపరాజయం చెందడంతో, ఎన్నికల అనంతరం ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు రాత్రికి రాత్రే తెలుగుదేశాన్ని వీడీ బిజెపి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

అయితే తెలుగుదేశం నుండి బిజెపి గూటికి చేరిన సదరు వలస నేతలు బిజెపిని పటిష్టం చెయ్యవలసింది పోయి ఇప్పటికి కూడా తెలుగుదేశం ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నారని బీజేపీలో మొదటినుండి పనిచేస్తున్న సామాన్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనితో ఇటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రంలో ఎప్పటికి సొంతగా ఎదగలేమని నిదానంగా బిజెపి అధిష్టానానికి కూడా అర్ధమైందని, అందువల్లే పార్టీ కోసం మొదటినుండి పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికొచ్చిందని విశ్వసనీయ సమాచారం.

ఇటీవలే తెలంగాణలో బిసి లలో బలమైన సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్ కి రాష్ట్ర సారధ్య పగ్గాలను అప్పగించడంతో, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకపక్క పవన్ కళ్యాణ్ తో కలసి ముందుకు వెళ్లాలని భావిస్తున్న పార్టీ అధిష్టానం మరోవైపు కొత్తగా తెరపైకి తెచ్చిన ఈ బిసి కార్డు ఏ మాత్రం సత్ఫాలితాలిస్తుందో వేచి చూడాలి!!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp