బీజేపీ-జనసేన బంధానికి బీటలు వారుతున్నాయా

By Raju VS Jan. 22, 2021, 01:00 pm IST
బీజేపీ-జనసేన బంధానికి బీటలు వారుతున్నాయా

పవన్ కళ్యాణ్‌ నేతృత్వంలోని పార్టీ జనసేన ఆవిర్భావం నుంచి ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగానే కనిపిస్తుంది. ఆపార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే ఆపార్టీ ఉనికి ఉంటుంది. హైదరాబాద్ వాసిగా ఉన్న ఆయన పర్యటనకు వస్తేనే ఏపీలో జనసేన ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటి పార్టీ 2019 ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్నా చివరకు మింగుడుపడని స్థాయిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దాంతో ఆ పరాజయ ప్రభావంతో పవన్ అనూహ్యంగా బీజేపీ పంచన చేరిపోయారు. ఆ తర్వాత దాదాపుగా కమలం పార్టీ చేతిలో చిక్కుకున్నట్టుగానే కనిపిస్తోంది. అమరావతి ఉద్యమం సహా అన్ని సందర్భాల్లో బీజేపీ పెద్దల మాటకే పవన్ విలువనివ్వాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన జెండాలు తొలగించాలంటూ కొందరు బీజేపీ నేతలు ఆదేశించే వరకూ వెళ్లింది. ఇక అంతిమంగా తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడా రెండు పార్టీల మధ్య సంఖ్యతకు చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఎవరు పోటీ చేయాలనే అంశంలో సందిగ్ధం జనసేన తీవ్రంగా మధనపడేందుకు మూలమవుతోంది.

ఏపీలో ఆరు శాతం బలమున్న తమ పార్టీ ఒక్క శాతం ఓట్లున్న పార్టీ చేతిలో చిక్కుకుందని సగటు జనసేన శ్రేణుల అసంతృప్తి అనేక మార్లు బయటపడింది. కేంద్రంలో అధికార పార్టీ కావడంతో బీజేపీ చెప్పినట్టు చేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. చివరకు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా తమకు తెలపకుండానే బీజేపీ ఏకపక్షంగా సాగుతుందనే అభిప్రాయం జనసేనలో ఉంది. తాజాగా తిరుపతిలో జరుగుతున్న ఆపార్టీ పీఏసీ సమావేశంలో ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు తమను చిన్నచూపు చూస్తున్నారని పలువురు వాపోయారు. తమను ఖాతరు చేయని పార్టీతో కలిసి సాగేదెలా అంటూ కొందరు ప్రస్తావించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి స్పందించడం విశేషం. రాష్ట్రంలో కొందరు నేతల తీరుతో సమస్యలున్నట్టు ఆయన అంగీకరించారని జనసేన నేతలు చెబుతున్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు గౌరవిస్తున్న విషయం గమనంలో ఉంచుకోవాలని ఆయన సూచన చేసినట్టు చెబుతున్నారు.

తిరుపతి ఉప ఎన్నికలలో బీజేపీ పోటీ కి సిద్ధపడింది. అభ్యర్థి ఎంపిక కూడా దాదాపు ఖాయం అయ్యింది. తాము బరిలో ఉంటున్నందున తమనే గెలిపించాలనే రీతిలో మత పరమైన విభజనకు ఆపార్టీ నేతలు అప్పుడే మాటల యుద్ధం కూడా మొదలెట్టేశారు. ఈ సమయంలో తాము కూడా పోటీ చేయాలని జనసేన ఆలోచన చేయడం ఆసక్తికరం అవుతోంది. వారం రోజుల్లో ఈ వ్యవహారం తేలిపోతుందని తాజాగా పవన్ ప్రకటించారు. కానీ జనసేనకు చోటు కల్పించేందుకు బీజేపీ ససేమీరా అంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో జనసేన , బీజేపీ మధ్య తిరుపతి వ్యవహారం తగాదాకి దారితీసే అవకాశం ఉంది. చివరకు జనసేన రాజీపడుతుందా లేక బీజేపీ తీరుకి నిరసనగా ఎలాంటి చర్యలకయినా పూనుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. కానీ పవన్ కి అలాంటి ఆలోచన లేదని, మళ్లీ బీజేపీ అభ్యర్థికే జై కొడతారని పలువురు అంచనా వేస్తున్నారు.

బీజేపీ తమను ఖాతరు చేయడం లేదని బీజేపీ నేతలంతా చెబుతున్నా పవన్ మాత్రం ఆపార్టీతో స్నేహం విషయంలో సందిగ్ధంలో ఉన్నారని చెప్పవచ్చు. పవన్ కి చిరకాల స్నేహితుడు చంద్రబాబు కూడా ఈ మిత్రుల మధ్య సఖ్యత కొనసాగకూడదని ఆశిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ బలాన్ని నియంత్రించే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు బీజేపీ బలం పుంజుకుంటే అది రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రతిపక్ష స్థానానికి చిక్కులు తెచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దాంతో బీజేపీ, జనసేన మధ్య సామరస్య వాతావరణం లేకుండా చేసి, జనసేన ఓట్లు బీజేపీకి మళ్లకుండా చూసేందుకు ప్రణాళిక రచించినట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే తిరుపతిలో జనసేన సమావేశం నిర్వహించి, తమ అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించేందుకు జనసేన నేతలు పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెబుతోంది. దాంతో చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా పవన్ వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కూడా కమలదళంలో మొదలవుతోంది. ఈ తరుణంలో ఇరు శిబిరాల్లో సందేహాలు పెరగుతున్న తరుణంలో జనసేన- బీజేపీ మైత్రి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp