ఏపీ కేబినెట్ భేటీలో క‌రోనాకు ప్రాధాన్యం ఇవ్వ‌లేదా..?

By Kalyan.S May. 06, 2021, 09:10 am IST
ఏపీ కేబినెట్ భేటీలో క‌రోనాకు ప్రాధాన్యం ఇవ్వ‌లేదా..?

సాధార‌ణ ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్ష పార్టీ రాజ‌కీయాలు ఎలాగున్నా.. క‌రోనా వంటి విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి. ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపేలా వ్య‌వ‌హ‌రించాలి. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవాలంటూ త‌మ పార్టీ శ్రేణుల‌ను సైతం రంగంలోకి దింపాలి. కానీ, ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం ఆది నుంచీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అవుతోంది. మొద‌టి ద‌శ‌లో అస‌లు రాష్ట్రంలోనే క‌నిపించ‌ని ఆ పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు.. రెండో ద‌శ‌లో ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంటున్నారు. బుధ‌వారం జూమ్ ద్వారా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

వాస్త‌వాల‌కు విరుద్ధంగా ఆరోప‌ణ‌లు

వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈ సంద‌ర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందట‌. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు స‌రే కానీ, అతి తీవ్రమైన కరోనా గురించి కేబినెట్ భేటీలో ప్రాధాన్యత ఇవ్వ‌లేద‌ని చెప్ప‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. వాస్త‌వాలు తెలుసుకోకుండా, రాష్ట్రంలో జ‌రుగుతున్న క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను చూడ‌కుండా, కేవ‌లం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించాల‌నే ప‌నిగా పెట్టుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. పైగా, ప్రభుత్వాన్ని విమర్శించడం తమ పని కాదని, కానీ ఆవేదనతోనే మాట్లాడతున్నామని పేర్కొన్న ఆయ‌నకు క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యాలు తెలియ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉంది. ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ప్ర‌భుత్వాన్ని వేలెత్తి చూప‌డం ప్ర‌తిప‌క్ష పార్టీకి మామూలే అనుకున్నా, అస‌లే భ‌యాందోళ‌న‌లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పాల్సింది పోయి.. మ‌రింత భ‌య‌పెట్టేలా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

చ‌ర్చ జ‌రిగింది నిజం కాదా..

కేబినెట్ భేటీలో క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు. స‌మావేశం మొత్తంలో ప్ర‌జ‌ల సంక్షేమానికి, క‌రోనా నియంత్ర‌ణ‌కే ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అప్ప‌టి వ‌ర‌కూ రాత్రి వేళ‌లోనే కొన‌సాగుతున్న కర్ఫ్యూ ను డేలో కూడా అమ‌ల్లోకి తెచ్చింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు కానుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌ర్వాతి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండేలా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసింది. గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం వంటి వి పూర్తిగా నిషేధించింది. కర్ఫ్యూ సమయంలో ఆటోలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. 12 గంటల తరువాత ఆటోలు రోడ్ల పైకి వస్తే సీజ్‌ చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. ఆంక్ష‌ల‌తో పాటు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌క‌ల సౌక‌ర్యాలూ క‌ల్పిస్తోంది. ఇంజక్షన్లు, ఆక్సిజన్‌కు కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేప‌ట్టింది. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రూ.511.79 కోట్లు వ్యయం కానుందని అంచనా వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు సైతం ప్ర‌శంసిస్తున్నారు. కానీ చంద్ర‌బాబు తీరు మాత్రం మార‌డం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

బాబు, త‌న‌యుడి తీరు మార‌దా : విజ‌య‌సాయి

కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుపై మండిపడ్డారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా వారి ఆలోచనలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఇదే క్రమంలో బాబు, లోకేశ్‌ చేస్తున్న విమర్శలపై కొన్ని ట్వీట్లు చేశారు. ‘రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీ కొడుకులు ఎన్నడూ కోరుకోరు. జగన్ గారు విఫలమయ్యారని ఏడవడానికి, దేశమంతా మహమ్మారి అదుపులోకి వచ్చినా ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని ‘వాళ్ల దేవుళ్లకు’ మొక్కుతుంటారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా ఉంటాయి వీళ్ల ఆలోచనలు.’ అని ట్వీట్‌ చేశారు. ‘పాపాలు చేసిన వారిని దేవుడు క్షమిస్తాడేమో కానీ తమను నిలువునా దోచుకుని, మాఫియా పాలనతో పీడించిన బాబులాంటి వారిని ప్రజలు అస్సలు మన్నించరు. వరుస పరాజయాలు అందుకే. నిజాయతీ విలువ తెలియని వ్యక్తులు పరాజయాల భారం కింద నలిగిపోక తప్పదు’ మరో ట్వీట్‌ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp