జమిలి ఎన్నికలు ఎప్పుడు..? ఎలా..?

ఒకే దేశం - ఒకే ఎన్నిక నినాదం దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. బీజేపీ మాత్రమే కాదు.. అన్ని రాజకీయ పార్టీలూ జమిలి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లే కనిపిస్తోంది. ఏ పార్టీ అధినేత సమావేశం నిర్వహించినా.. అందులో ఈ ప్రస్తావన తప్పనిసరిగా ఉంటోంది. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ శ్రేణులకు ఆయా పార్టీలు సూచిస్తున్నాయి. బీజేపీ అయితే జమిలి ఎన్నికల అంశాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. దీనిపై వెబినార్ లు నిర్వహిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికలు ఎప్పుడు.. ఎలా.. నిర్వహించాలన్న దానిపై ఉన్నత స్థాయిలో తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశ మంతా ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అన్ని రాష్ట్రాలనూ ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇందుకు ఒప్పుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో జమిలి ఎన్నికలు జరపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. నాటి నుంచీ తెలుగు రాష్ట్రాల సహా అన్ని చోట్లా ఈ ప్రస్తావన వస్తూనే ఉంది. దేశమంతటా లోక్సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా కూడా ఇప్పటికే ప్రకటించారు. పకడ్బందీగా వ్యూహ రచనలు చేస్తేనే తప్పా జమిలి నిర్వహణ అసాధ్యం. ఎక్కడ ఏ మాత్రం లోపం జరిగినా గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం నిపుణుల సలహాలను కూడా తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణపై లోతుగా అధ్యయనం చేస్తోంది.
2019లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2020లో ఢిల్లీ, బీహార్, పాండిచ్చేరి ఎన్నికలు జరిగాయి. అలాగే ఈ ఏడాది బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఒకవేళ 2022లో కేంద్రం జమిలి కి సిద్ధమైతే ఈ రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక 2022లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్లో జరగాల్సిన ఎన్నికలను జమిలిలో భాగంగా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. అలాగే... 2023లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్ని కూడా 2022లో ముందస్తుగా జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో 29 రాష్ట్రాలకు గాను బీజేపీ, దాని మిత్ర పక్షాలు కలిసి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సగం రాష్ట్రాలు ఒప్పుకుంటే జమిలికి వెళ్లొచ్చు. అందువల్ల ఇక రాజ్యాంగంలో సవరణలు చెయ్యడమే బీజేపీకి మిగిలివున్న సమస్య. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. లా కమిషన్ కూడా ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని 83(2), 172(1) అధికరణలు లోక్సభ, శాసనసభల కాలపరిమితిని నిర్దేశించాయి. రద్దు చేయనంతవరకూ ఈ సభలు ఐదేళ్ల కాలపరిమితి వరకు కొనసాగుతాయని ఈ అధికరణలు పేర్కొన్నాయి. అయితే ఈ సభల కాలపరిమితిని పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. లోక్సభ, శాసన సభల కాలపరిమితిని తగ్గించడం, పెంచడం, రాజ్యాంగంలో సంబంధిత నిబంధనలను సవరించి, రాష్ట్రాల ఆమోదం పొందడం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించడం ద్వారానే జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని రాజ్యాంగ నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు.
అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్న కేంద్రం 2022లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తుందా..? లేదా 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుపుతుందా..? అనేది తేలాల్సి ఉంది.


Click Here and join us to get our latest updates through WhatsApp