కెసిఆర్ పీవీని విమర్శించాడు --ఎందుకు ఈ రాతలు?

By Ravuri.SG Jul. 12, 2020, 02:32 pm IST
కెసిఆర్ పీవీని విమర్శించాడు --ఎందుకు ఈ రాతలు?

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని హడావిడి చేశారు. ఇదే కేసీఆర్‌ ఒకప్పుడు పీవీని తీవ్రంగా విమర్శించారు.
    - ఒక ప్రముఖ పత్రికలో వాఖ్య

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను అన్ని పార్టీలు జరుపుతున్నాయి.పీవీ తెలంగాణ వారు కావటం వలన కేసీఆర్ ఎక్కువ బాధ్యతగా పీవీ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. దాని మీద ఎవరికైనా ఫిర్యాదు ఉండవలసిన అవసరం లేదు... కానీ ఒక పత్రిక మాత్రం దాని మీద దీర్ఘాలు తీస్తూ కామెంట్లు రాసింది.

1991-1996 మధ్య కేసీఆర్ నిర్వహించిన బాధ్యతలేంటి?
విషయంలోకి వెళ్లే ముందు పీవీ ప్రధానిగా ఉన్న 1991-1996 మధ్య కేసీఆర్ ఏ స్థాయి నేత?ఎన్టీఆర్ ప్రభుత్వంలో కనీసం మంత్రి కూడా కాదు. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ తో పీఠమెక్కిన చంద్రబాబు కూడా మొదటి క్యాబినెట్లోకి కేసీఆర్ ను తీసుకోలేదు...1996 లోక్ సభ ఎన్నికల్లో మంత్రులుగా ఉన్న ఎర్రం నాయుడు, అయ్యన్నపాత్రుడు, సుబ్బారాయుడు, ఎల్.రమణ, వేణుగోపాలచారి తదితరులు గెలవటంతో జరిగిన మంత్రివర్గ విస్తరణ లో కేసీఆర్ రవాణ శాఖ మంత్రి అయ్యారు. 1999 ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు.. 2001లో రాజీనామా చేసి తెరాసాను స్థాపించటం, తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే..

ఈ విషయాలను పరిశీలిస్తే కేసీఆర్ పీవీ ని విమర్శించే పరిస్థితే ఎప్పుడు ఉత్పన్నం కాలేదు..ఈ విషయాలతో సంబంధం లేకుండానే నాడు రాజకీయాలను దగ్గరగా పరిశీలించిన పాత్రికేయులు ఇప్పటికీ రిపోర్టింగ్ లో ఉన్నారు.. ఇవన్నీ పాఠకులు కూడా మర్చిపోయేంత పాత విషయాలేమి కావు..

1996 ఎన్నికల్లో బాబు చేసిన విమర్శలేమిటి?
అవన్నీ పక్కన పెడితే - 1996 పార్లమెంట్ ఎన్నికల సమయానికి లక్ష్మి పార్వతి పెట్టిన 'ఎన్టీఆర్ టీడీపీ' వైపు దేవినేని నెహ్రు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాకినేని పెద్దరత్తయ్య, మదుసూదనాచారి ,ఇంద్రారెడ్డి లాంటి సీనియర్ నాయకులు నిలబడి ఎన్నికల పనులు చూస్తుండటం(వీరిలో చాలా మంది స్వయంగా ఎన్నికల్లో పోటీచేశారు), సానుభూతి పవనాలు అటు వీస్తాయేమోననే అనుమానం కూడా కొంత చంద్రబాబు వర్గంలో ఉండేది. అందుకే అనేక మంది మంత్రులను,ఎర్రం నాయుడు లాంటి బలమైన ఎమ్మెల్యేలను చంద్రబాబు లోక్ సభ బరిలో దించారు...

ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రధాని పీవీ నరసింహారావు(పీవీ) మీద విపరీతమైన విమర్శలు చేశారు. మీడియాలో వచ్చిన కుంభకోణాల చిట్టా చదువుతూ పీవీ అవినీతిపరుడంటూ, ప్రధాని హోదాలో కోర్టు మెట్లు ఎక్కాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ బ్రతికి ఉన్నప్పుడు పీవీ నరసింహారావుతో స్నేహంగా మెలిగిన చంద్రబాబు తరువాత నేరుగా ప్రధాని పీవీని విమర్శించటం వెనకాల ఉన్న మర్మం బాబు జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్షాలను ఆకర్షించి, నేషనల్ ఫ్రంట్ లో ఉన్న ఎన్టీఆర్ చైర్మన్ పదవి తాను దక్కించుకోవటానికే అని అందరూ బహిరంగానే మాట్లాడుకున్నారు. ఈ ఆరోపణల మీద బాధపడ్డ పీవీ ఒక సందర్భంలో తన పదవికి కాకపోయినా వయసుకైనా గౌరవమివ్వాలని చెప్పమనండి అని తనను కలిసిన పాత్రికేయులకు చెప్పారు ! ఆ వార్త అన్ని పత్రికల్లోనూ వచ్చింది. పీవీ మీద వేసిన కేసుల విషయంలో కూడా చంద్రబాబు తన సహజధోరణిలో వ్యక్తిగత విమర్శలు చేశారు.

ఎన్టీ రామారావు(ఎన్టీఆర్)కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కొంత కాలానికే ఎంతో మనోవేదనకు గురైన ఎన్టీఆర్ కాలం చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి 'ఎన్టీఆర్ టీడీపీ' అని పార్టీ స్థాపించి 42 స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలిపారు - ఒక్క సీటు కూడా గెలవలేదు. చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే రంగులు మారుస్తూ కాషాయాన్ని వదిలి ఎర్ర జెండాకు జై కొడుతూ వామపక్షాలతో చేతులు కలిపారు - 16 ఎంపీ స్థానాలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి 42 స్థానాలకు గానూ 22 స్థానాల్లో గెలిచింది. ఎన్టీఆర్ కనుక బతికే ఉండుంటే చంద్రబాబు నాయుడుకు జనంలో ఉన్న బలం ఎంత మాత్రమో ఆ ఎన్నికల్లోనే బయటపడేదని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

1996 అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చంద్రబాబుని పొగుడుతున్న క్లిప్పింగ్ ఆ మధ్య ఒక ఛానల్ వారి సౌజన్యంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.. అదే సమయంలో "అపుడు మీరు చంద్రబాబు గారిని అలా పొగిడారు కదా?" అని ఒక సారి విలేకర్లు ప్రశ్నిస్తే - కేసీఆర్ ఇచ్చిన సమాధానం - "అవునువయ్యా అపుడు తెలుగు దేశం పార్టీల ఉన్న - అపుడు మా నాయకుడ్ని పొగడకుండా 'దగుల్బాజీ' అని తిడతామా ? ఏం ప్రశ్నలు అడుగుతార్వయా ?" అని తన స్టైల్లో సమాధానం కూడా చెప్పారు.

అలాగే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని, మేధావి అయిన శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడేటప్పుడు ఎవరైనా పీవీ గురించి గొప్పగానే మాట్లాడుతారు తప్ప, పీవీ ప్రధానిగా ఉండగా వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కూల్చివేత గురించో, ఆయన మీద వచ్చిన ఆరోపణల మీదనో మాట్లాడరు కదా ?!
మరి బాబు ఎన్టీఆర్ మీద చేసిన విమర్శల మాటేమిటి?

ఒక జర్నలిస్టుగా ఈ విషయంలో కేసీఆర్ ని విమర్శించే హక్కు ఆయనకుంది అనుకుందాం. అప్పుడు - "1996 ఎన్నికల సమయంలో దారుణంగా పీవీని విమర్శించిన చంద్రబాబు నాయుడే 2018 లో పీవీ తెచ్చిన ఆర్ధిక సంస్కరణల్ని పొగడటం కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు అనుకోవాలా ? మొన్న పీవీ శతజయంతి సంవత్సరం సందర్భంగా "పీవీ భారతరత్నకు అర్హుడు" అని ఉపన్యాసాలు ఇవ్వడం కేవలం పీవీని పొగుడుతూ వార్తల్లో ఉండడానికి అనుకోవాలా ?" అని ప్రశ్నించే హక్కు, ఆలోచించే జ్ఞానం పాఠకులకు కూడా ఉన్నాయి.

తమాషా ఏమిటంటే ...
ఎన్టీఆర్ కు నైతిక విలువలు శూన్యం  అన్న చంద్రబాబు... 
ఎన్టీఆర్ మాకు అవసరం లేదు చంద్రబాబు...
ఎన్టీఆర్ మీద చెప్పులేయించిన చంద్రబాబు...
ఎన్టీఆర్ పార్టీ గుర్తును,పార్టీ నిధులను కూడా సొంతం చేసుకున్న చంద్రబాబు...
ఎన్టీఆర్ ఫోటో కూడా పార్టీ కార్యక్రమాల్లో లేకుండా చేసిన చంద్రబాబు...
ఎన్టీఆర్ మా దేవుడు, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రతి సంవత్సరం కోరుతుంటే,
ఎన్టీఆర్ సినిమాల్లో వేసిన కృష్ణుడి రూపంలో కూడా విగ్రహాలు పెట్టించి దండలేస్తుంటే,
ఎన్టీఆర్ ఆశయాలకు నిజమైన వారసులమని చెప్పుకుంటుంటే,
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమదే అంటుంటే,
ఎన్టీఆర్ మనవళ్లను, మనవరాళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటుంటే ...

ఆ పత్రిక ఒక్క సారైనా ఇలా రాయకపోవటం యాదృచ్ఛికం కాదు ఉద్దేశ్యపూర్వకం అవుతుంది ... పైగా నాదెండ్లది వెన్నుపోటు అని రాసిన కలంతోనే, చంద్రబాబుది తిరుగుబాటు అని పలుకుతూ భావితరాలకు నిజాలు తెలియకుండా చేసేందుకు జరుగుతున్న విఫలయత్నాలు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.

ఒకనాడు విమర్శలు చేసినా ఇప్పడూ పీవీని మాజీ ప్రధానిగా చంద్రబాబు, కేసీఆర్ గౌరవించటం ఆహ్వానించదగ్గ విషయమే. కానీ పనికట్టుకొని మరీ కేసీఆర్ పీవీ మీద చేయని విమర్శలను ప్రస్తావించటంలో దురుద్దేశం ఏమిటో మాత్రం అర్ధం కాదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp