Chandrababu Democracy - చంద్రబాబు కష్టాలన్నీ ప్రజాస్వామ్యానికి నష్టాలేనంట 

By Gopal.T Oct. 22, 2021, 01:00 pm IST
Chandrababu Democracy - చంద్రబాబు కష్టాలన్నీ ప్రజాస్వామ్యానికి నష్టాలేనంట 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనకు, తన రాజకీయ భవిష్యత్తుకు ఏ ప్రమాదం అనిపించినా మొత్తం దేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ప్రచారం చేయడం అలవాటుగా మారింది. తన మనుగడకు, తన పార్టీ మనుగడకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం అనిపించినా దాన్ని యావత్ భారతదేశానికీ వర్తింపజేయాలని చూస్తారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రచారం చేస్తారు. ఈ ప్రచారానికి తన అనుకూల మీడియా బాకా ఊదుతుంది. ఆయన తన శక్తి వంచన లేకుండా జాతీయ మీడియాను కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా తన ఉనికిని కాపాడుకుంటారు. ఇది అనేక సందర్భాల్లో రుజువయింది. 

మొన్న 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత, తాను మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం "ధర్మ పోరాట దీక్ష" అంటూ పెద్ద రాజకీయ డ్రామానే నడిపారు చంద్రబాబు. ఏకంగా దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో ఆయన జట్టుకట్టారు. చివరికి కాంగ్రెస్ పార్టీతో అడుగులేసి కాంగ్రెస్, టీడీపీ కలయిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ ఉపన్యాసాలు దంచారు. బీజేపీ నాయకత్వం వల్ల, ఆ పార్టీ విధానాల వల్ల, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటూ ఢిల్లీలో కూడా ప్రసంగాలు చేశారు. దేశాన్ని బీజేపీ, మోడీ నాయకత్వం నుండి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని దేశ ప్రజలకు ఉద్భోద చేశారు. నల్లచొక్కా వేసుకుని దేశం అంతటా తిరిగారు.

చంద్రబాబు ఇంత చేసినా జనం నమ్మలేదు. దేశానికేం కాలేదు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పూ రాలేదు. ఆ ఎన్నికల తర్వాత కూడా దేశం మోడీ నాయకత్వంలోనే కొనసాగుతోంది. ఆయన నాయకత్వమే దేశానికి అవసరం లేకుండా పోయింది. ఆయన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ లో 23 స్థానాలకు కుదించివేశారు ప్రజలు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన నాయకత్వం లేకపోవడమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అనుకున్నట్టు ప్రజలు ఓట్లేసి ఆయన్ను ఓడించారు. 

Also Read : TDP CBN Pattabhi-అస‌లుకే ఎస‌రు.. జ‌ర జాగ్ర‌త్త బాబోరూ..!

ఆ ఎన్నికల్లో ఓడినప్పటినుండి ఓటమిని అంగీకరించక పోగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞత కోల్పోయారని, ప్రలోభాలకు లొంగిపోయారని ప్రజలను నిందించడం మొదలు పెట్టారు. అలాగే తన ఓటమి రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. తాను అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రం ఏమైపోతేనేం అనుకుని రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పనిని వివిధ మార్గాల ద్వారా అడ్డుకోవడం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వం అమలుచేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు నిత్యం అడ్డుకుంటూనే ఉన్నారు. తన అనుకూల మీడియాతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనునిత్యం ప్రచారం చేయిస్తూనే ఉన్నారు. 

తాను అధికారంలో లేకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కుంటుపడింది అంటూ జాతీయ మీడియాలో ప్రచారం చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులు ఆపేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలూ, ప్రచారాలూ చేస్తూనే ఉన్నారు. వివిధ వ్యవస్థల్లో ఉన్న తన అనుకూల వ్యక్తులను ప్రభావితం చేసి నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ తోడు ఇప్పుడు మరోసారి దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రజాస్వామ్య ప్రరిరక్షణ అంటూ తాను స్వయంగా ఓ 36 గంటల నిరాహార దీక్ష మొదలు పెట్టారు. 

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బూతద్దంలో చూపుతూ, ఆ దాడికి ఉసిగొల్పిన తన పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర డీజీపీని ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడడం, అధికార పార్టీ సభ్యులను, సానుభూతిపరులను రెచ్చగొట్టే ప్రయత్నాలు, ప్రసంగాలు చేయడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో లేక రెచ్చిపోయిన అధికార పార్టీ సభ్యులు తన పార్టీపై దాడి చేయడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో చంద్రబాబు ఆలోచించక పోయినా ప్రజలు ఆలోచిస్తారు అనే స్పృహ కూడా లేకుండా దీక్ష చేయడం చంద్రబాబుకే చెల్లింది. అయినా ఆయన చెప్పేవన్నీ ప్రజలు నమ్ముతారు అని ఇంకా అనుకుంటే అదీ ఒక లోపమే. 

టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని చంద్రబాబు చెపుతుంటే గుడ్డిగా ఎవరూ నమ్మడం లేదు. దాడి ఎందుకు జరిగింది అంటూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఈ వెతుకులాటలో ముఖ్యమంత్రిపై, డీజీపీపై చంద్రబాబు అనుచరుడు చేసిన బూతు పురాణం బయటపడుతోంది. ఆ బూతులు విన్నవారు దాడిని సమర్ధించినా చంద్రబాబు మాత్రం సమర్ధించలేక పోయారు. ఆయన చెప్పినట్టు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఏమీ లేదని, ఒకవేళ ప్రమాదం ఏమైనా ఉంటే అది చంద్రబాబు, ఆయన పార్టీ విధానాల వల్లనే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే చంద్రబాబు అబద్ధాలకు కాలం చెల్లినట్లే.

Also Read : Ganja-ఏ మాత్రం బుర్ర పెట్టకుండా 'గంజాయి'లో కాలేసిన టీడీపీ!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp