దమ్మాలపాటికి దడ పుట్టిందా? మాజీ ఏజీలో ఎందుకీ ఆందోళన??

By Raju VS Sep. 15, 2020, 08:30 am IST
దమ్మాలపాటికి దడ పుట్టిందా? మాజీ ఏజీలో ఎందుకీ ఆందోళన??

దమ్మాలపాటి శ్రీనివాస్. టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడు. న్యాయపరమైన అంశాలలో కీలకంగా వ్యవహరించారు. ప్రతిఫలంగా గత ప్రభుత్వంలో ఆయనకు అడ్వొకేట్ జనరల్ పదవి దక్కింది. దాంతో పాటు అమరావతిలో భారీ నజారానా కూడా కొల్లగొట్టినట్టు ప్రచారం ఉంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించడంతో ప్రభుత్వం కూపీ లాగింది. చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సన్నద్ధమయ్యింది. సరిగ్గా అలాంటి సమయంలో తనను ఆరెస్ట్ చేయకుండా చూడాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్ట్ ని ఆశ్రయించడం ఆసక్తిగా మారింది.

టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ పదవి దక్కించుకున్న దమ్మాలపాటి ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ ఆపార్టీ సేవలో ఉన్నారు. అధికార పక్షాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నంలో మునిగితేలుతున్నారు. వివిధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు ఆయన సూత్రధారిగా పలువురు చెప్పుకుంటున్న తీరు దానిలో భాగమే. జగన్ సర్కారుపై ఏకంగా 300 అంశాలలో పిల్ వేయడం విశేషంగానే చెప్పాలి. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం పైనా 5 ఏళ్లలో కూడా ఇన్ని వ్యాజ్యాలు నమోదయిన దాఖలాలే లేవు. కానీ చంద్రబాబు మార్గదర్శకత్వంలోని దమ్మాలపాటి బృందం కేవలం రెండేళ్లు నిండకుండానే 300 మార్లు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అస్త్రాన్ని ప్రయోగించేందుకు పూనుకున్నారు. ఇదంతా ప్రభుత్వాన్ని సజావుగా నడపకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో సాగుతున్న ప్రయత్నంగా పాలకపక్షం భావిస్తోంది.

వర్తమానం అలా ఉంచితే భూతకాలంలో దమ్మాలపాటి వారి దమ్ము ఏపాటిదో ఇప్పటికే ఆధారాలతో ప్రత్యేక విచారణ బృందం సిద్ధమయ్యింది. సిట్ సేకరించిన ఆధారాల ప్రకారం అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన ఆయన అమరావతిలో అక్రమంగా భూములు కొన్నారనే అంశంలో కీలక విషయాలు సేకరించింది. అమరావతి భూకుంభకోణంలో భాగంగా సాగుతున్న దర్యాప్తులో వెల్లడయిన ఆధారాలతో కేసు నమోదు చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ సదరు అంశంలో విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. విచారణ సాగితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయనే భయాందోళనతోనే బాబు అండ్ కో వేసిన పిటీషన్ ఫలితంగా స్టే వచ్చిందని భావిస్తున్నారు. కానీ తీరా సదరు స్టే విషయంలో సుప్రీంకోర్ట్ లో బాబు బ్యాచ్ యత్నాలు బూమరాంగ్ అయ్యాయి. విచారణే జరకూడదంటే కుదరదని తేల్చేసింది.

ఈ నేపథ్యంలో మళ్లీ సిట్ సీన్ లోకి రాబోతోంది. అలాంటి సమయంలో తనను అరెస్ట్ చేస్తారనే బెంగ పట్టుకుంది ఈ మాజీ ఏజీ శ్రీనివాస్ కి. వెంటనే మళ్లీ మరో పిటీషన్ తో సిద్ధమయ్యారు. సిట్ విచారణ ముమ్మరం చేస్తే ముప్పు తప్పదని గ్రహించారు. "నన్ను అరెస్ట్ చేయకూడదు,నిర్బంధించకూడదు,ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని" కోరుతూ హైకోర్ట్ ని ఆశ్రయించారు. అయితే అసలు విచారణ కూడా జరగకుండా తనను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఈ మాజీ అడ్వకేట్ జనరల్ కి ఎలా అనుమానం వచ్చిందన్నది ఆశ్చర్యంగా కనిపిస్తోంది. అక్రమాలకు ఆధారాలు దొరకడంతో తాను దొరికిపోయినట్టేననే నిర్ధారణకు ఆయన వచ్చారా అనే సందేహం కలుగుతోంది. అమరావతి అక్రమాల్లో తన భాగస్వామ్యం గురించి నిర్ధారణ జరుగుతుందనే నిశ్ఛితాభిప్రాయంతో కూడిన కలవరం ఆయన కనిపిస్తోందని అనిపిస్తోంది. ఏమయినా ఆయన హైకోర్ట్ కి వెళ్లి గతంలో విచారణ వద్దని కోరుకున్నట్టే ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయవద్దని కోరడం విడ్డూరంగా ఉంది. ఈసారి కోర్ట్ ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp