ఎంపీనే బురిడీ కొట్టించబోయిన సైబర్ క్రిమినల్..

By Balu Chaganti Jan. 15, 2022, 10:30 am IST
ఎంపీనే బురిడీ కొట్టించబోయిన సైబర్ క్రిమినల్..

సైబర్ నేరగాళ్లు వాళ్ళు వీళ్ళు అని లేకుండా తమకు వీలున్న ప్రతి ఒక్కరిని ట్రాప్ చేస్తూ మెల్లగా తమ ఉచ్చులోకి వారిని లాగేస్తున్నారు. చిన్న అవకాశం ఇచ్చినా వారి చేతిలో ఎంతటి వారయినా మటాష్ అయిపోయినట్లే. అంతగా పకడ్బందీ ప్లాన్ తో టార్గెట్ చేస్తూ మన దగ్గర ఉన్న డబ్బులు మనకే తెలియకుండానే కొట్టేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. రకరకాలుగా జనాన్ని టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుని సైలెంట్ అయిపోతున్నారు. మిగతా కేసులతో పోలిస్తే ఈ సైబర్ కేసులను సాల్వ్ చేయడం మన పోలీసులకు కూడా తలకుమించిన భారమే.

ఎందుకంటే కొత్త కొత్త టెక్నికల్ పద్ధతులు ఫాలో అవుతూ ఎవరూ ఊహించని విధంగా ప్లాన్ చేసి మరీ డబ్బు కొట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు సహా చదువుకున్నా అత్యాశకి పోయే కొందరే ఎక్కువగా ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ఈ సైబర్ అనుభవం ఓ వైసీపీ ఎంపీకి ఎదురైంది. అయితే ఆయన అప్రమత్తంగా ఉండటంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకున్నారు. అసలు విషయం ఏమిటంటే అభిషేక్ అనే వ్యక్తి నేరుగా తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేసి తాను సీఎంఓలో పనిచేస్తున్నట్లు చెప్పారు. 

అలాగే ఖాదీ పరిశ్రమ శాఖలో సబ్సిడీ రుణాలు యూనిట్ల కోసం మంజూరు చేస్తానని అందుకు 25 దరఖాస్తులకు ఒక్కొక్క అకౌంట్ కి 1.25 లక్ష 25 వేలు ఆన్లైన్ లో తక్షణమే నగదు బదిలీ చేయాలని కోరారు. అయితే లోన్ కావాలంటే ముందు డబ్బు కట్టే పద్ధతి మీద డౌట్ రావడంతో ఎంపి తన పిఏ హరీష్ కి ఈ వ్యవహారాన్ని అప్పచెప్పారు. దీంతో ఇది అనుమానస్పదంగా ఉందని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపీ పిఏ హరీష్ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp