సీపీఐ నారాయ‌ణ‌ - గతితార్కిక నారాయణ వాదం

By G.R Maharshi Mar. 06, 2021, 09:59 am IST
సీపీఐ నారాయ‌ణ‌ - గతితార్కిక నారాయణ వాదం

ఒక‌ప్పుడు ర‌ష్యాలో చ‌లి పుడితే మ‌న క‌మ్యూనిస్టులు స్వెటర్లు వేసుకునే వాళ్లు. అక్క‌డ జ‌లుబు చేస్తే ఇక్క‌డ తుమ్ములొచ్చేవి. ర‌ష్యా మారింది, వీళ్లూ మారిపోయారు. సీపీఐ నారాయ‌ణ మార్పుకి పెద్ద దిక్కు లాంటివారు. శంక‌రాభ‌ర‌ణం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. శంక‌ర‌శాస్త్రి పాటే కాదు, మాట కూడా అర్థం కాద‌ని. నారాయ‌ణ కూడా అంతే. ఆయ‌నేం మాట్లాడుతారో ఆయ‌న‌కే తెలియ‌దు. ఎపుడు ఏ పాట పాడ‌తాడో తెలియ‌దు.

మ‌తం మ‌త్తు మందు అన్నాడు మార్క్స్‌. క‌మ్యూనిస్టు పార్టీ చీలి పోయిన త‌ర్వాత మార్క్స్‌ని సీపీఎం సొంతం చేసుకుంది. సీపీఐకి నారాయ‌ణ లాంటి నాయ‌కులు మిగిలారు. ఆయ‌న తిరుమ‌ల గుడికి వెళ్తాడు. స్వాముల‌ని ద‌ర్శిస్తాడు. పైగా క‌మ్యూనిస్టులు నాస్తికులు కాద‌ని, దేవుడికి వ్య‌తిరేకం కాద‌ని కూడా వాదిస్తాడు. దీంట్లో నారాయ‌ణ త‌ప్పేమీ లేదు. భావ‌జాలాన్ని క‌మ్యూనిస్టులు మరిచిపోయి చాలా కాల‌మైంది. నారాయ‌ణ కూడా ఒక‌ప్పుడు నేర్చుకునే వుంటాడు. వ‌య‌సై పోయి మ‌రిచిపోయి వుంటాడు.

మేము చ‌దువుకునే రోజుల్లో AISF లో కూడా ఎంతోకొంత సిద్ధాంత జ్ఞానం వుండేది. మార్క్సిజాన్ని చ‌ద‌వ‌కపోయినా క‌నీస అవ‌గాహ‌న వుండేది. ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల సంగ‌తి దేవుడెరుగు, నాయ‌కుల ప‌రిస్థితి కూడా ఘోరంగా ఉంది.

"ప్రైవేట్ లైఫ్ మీ ఇష్టం. ప‌బ్లిక్‌లోకి వ‌స్తే ఏమైనా అంటాం" ఇది శ్రీ‌శ్రీ మాట‌. ఇది నారాయ‌ణ‌కి కూడా వ‌ర్తిస్తుంది. ఆయ‌నో పార్టీకి జాతీయ నాయ‌కుడు. సిద్ధాంతాన్ని గౌర‌వించాల్సిందే. గుళ్ల‌కి, గోపురాల‌కి, స్వాముల ద‌గ్గ‌రికి వెళ్లాల‌నుకుంటే పార్టీకి రాజీనామా చేసి వెళితే గౌర‌వం. మీకే జ్ఞాన శూన్య‌త ఆవ‌రిస్తే ఇక కార్య‌క‌ర్త‌ల‌కి ఏం నేర్పుతారు?

బొడ్డుకి బీజేపీని క‌ట్టుకుని జ‌న‌సేన మునిగిపోతుంద‌ని ఈ మ‌ధ్య నారాయ‌ణ అన్నాడు. మీరు తెలుగు దేశాన్ని బొడ్డుకి క‌ట్టుకుని చేసింది అదే క‌దా! రేపు సీపీఐ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందేమీ లేదు. వాళ్లు చేసేది స్వాముల పూజే క‌దా!
క‌మ్యూనిస్టు పార్టీ అంటే ప్ర‌జా పోరాటాల పార్టీ. మ‌తిభ్ర‌మించిన మాట‌ల‌తో నారాయ‌ణ అవ‌మానిస్తున్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp