కార్పొరేటర్‌గా ఓడి.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అయ్యారు..!

By Voleti Divakar Nov. 20, 2020, 06:31 pm IST
కార్పొరేటర్‌గా ఓడి.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అయ్యారు..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గత చరిత్ర ఆసక్తి కరంగా ఉంది. పలువురు నాయకులు బల్దియా నుంచి తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చట్టసభలకు ప్రాతినిథ్యం వహించారు. కార్పొరేటర్‌గా ఓటమిపాలైనా.. ఎమ్మెల్యేలు, మంత్రులుగా రాణిస్తూ తమ ప్రాభవాన్ని చాటుకుంటున్నారు.

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌..

.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రస్థానం 1986లో మోండా మార్కెట్‌ కార్పొరేటర్‌గా పోటీ చేయడంతో ప్రారంభమైంది. అప్పడు జనతాపార్టీ తరఫున బరిలోకి దిగిన తలసాని ఓడిపోయారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1994,1999లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు తెదేపా అధిష్ఠానం.. 2005లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో తెదేపా నుంచి పోటీ చేసి గెలిచిన తలసాని.. కొంతకాలానికి తెరాసలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సనత్‌నగర్‌ నుంచి తెరాస తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు కేసీఆర్‌ కేబినెట్‌లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి.....

2014లో తెదేపా పార్టీ తరఫున మహేశ్వరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణారెడ్డి రాజకీయ జీవితం 1986లో గాంధీనగర్‌ కార్పొరేటర్‌గా పోటీ చేయడంతో మొదలైంది. తొలుత కార్పొరేటర్‌గా ఓటమిపాలయ్యారు. అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో హుడా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తెదేపా హయాంలో మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగడంతో కృష్ణారెడ్డి ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2014 ఎన్నికల్లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాలతో ఆయన తెరాసలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరఫున మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

బీజేపీ నేత కె.లక్ష్మణ్‌ ....

గాంధీనగర్‌ వార్డు నుంచి పోటీ చేయడంతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన కె.లక్ష్మణ్‌ అనేక పదవులను అలంకరించారు. 1999, 2014లో రెండుసార్లు ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భాజపా సీనియర్‌ నేత అయిన లక్ష్మణ్‌ 2014లో ఆ పార్టీ శాసనసభా పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 నుంచి నాలుగేళ్ల పాటు తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో భాజపాకు మంచి ఆదరణ లభించినట్లయింది. లక్ష్మణ్‌ సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం.. ఆయన్ను జాతీయ స్థాయి పదవి అప్పగించింది. కీలకమైన బీసీ నాయకుడు కావడంతో భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే జి. సాయన్న.....

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి.సాయన్న తొలినాళ్లలో దోమల్‌గూడ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం సికింద్రాబాద్‌ నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా హ్యట్రిక్‌ విజయాలు అందుకున్నారు. హుడా ఛైర్మన్‌గా కూడా ఈయన సేవలు అందించారు. 2018లో తెరాసలో చేరిన సాయన్న.. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన సాయన్న 2009లో కాంగ్రెస్ అభ్యర్థి శంకరరావు చేతిలో ఒక్కసారే ఓటమిపాలయ్యారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp