మంత్రాల భ‌ద్ర‌య్య‌

By G.R Maharshi Aug. 15, 2020, 02:30 pm IST
మంత్రాల భ‌ద్ర‌య్య‌

మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌వు, కానీ డ‌బ్బులు రాలుతాయి. భ‌ద్ర‌య్య‌కి ఈ విష‌యం బాగా తెలుసు. అంద‌రినీ కొట్టిన‌ట్టే క‌రోనా అత‌న్ని కూడా కొట్టింది. దెయ్యాలు ఉన్నాయో లేదో అత‌నికి తెలియ‌దు. ఎప్పుడూ చూడ‌లేదు కూడా. కానీ దెయ్యాల్ని వ‌దిలించ‌డ‌మే అత‌ని వ్యాపారం. శ‌నివారం బిజినెస్ పీక్‌లో ఉంటుంది.

వేప చెట్టు కింద ఆంజ‌నేయ‌స్వామి ఫొటో పెట్టుకుని కూచుంటాడు. క‌ర్పూరం, అగ‌ర్‌బ‌త్తీలు అత‌ని పెట్టుబ‌డి. చుట్టు ప‌క్క‌ల ప‌ల్లెల నుంచి జ‌నం వ‌స్తారు. శ‌నివారం దెయ్యం ప‌ట్టిన ఆడోళ్లు, జుత్తు విర‌బోసుకుని నిల‌బ‌డితే , వేప మండ‌ల‌తో కొడుతూ మంత్రాలు చ‌దువుతూ భ‌ద్ర‌య్య అరుస్తూ ఉంటాడు. ఆ మంత్రాల‌కు అర్థం తెలియ‌దు. వాళ్ల నాయ‌నా నేర్పించాడు. చ‌చ్చిపోతూ ఒక మాట చెప్పాడు.

దేవుడు ఉన్నంత కాలం దెయ్యం ఉంటుంది. దెయ్యాన్ని న‌మ్ముకో అని చెప్పాడు. దెయ్యాన్ని చూసినావా నాయ‌నా? అని భ‌ద్ర‌య్య అడిగితే దేవున్ని దెయ్యాన్ని చూసినోళ్లు ఈ భూమ్మీద ఎవ‌రూ లేరు అన్నాడు. అయినా దెయ్యం కోసం భ‌ద్ర‌య్య వెతికాడు. ఇంకా క‌న‌ప‌డ‌లేదు.

శ‌నివారం కాకుండా మిగ‌తా రోజుల్లో తాయ‌త్తులు క‌డ‌తాడు. నిద్ర‌లో భ‌య‌ప‌డి అరిచే పిల్ల‌ల‌కి బొట్టు పెట్టి విభూది ఊదుతాడు. గొప్ప‌గా కాదు కానీ, జ‌రుగుబాటుకి లోటులేదు. దీనికి కూడా పోటీ ఎక్కువే. ప‌క్క ఊళ్ల‌లో ఇద్ద‌రు ముగ్గురు ఆడోళ్లు అమ్మ‌వారి అవ‌తారం ఎత్తి దుకాణం తెరిచారు. భ‌ద్ర‌య్య‌కి వార‌స‌త్వం ఉండ‌డంతో బండి జ‌రిగిపోతూ ఉంది.

హ‌ఠాత్తుగా క‌రోనా వచ్చే స‌రికి భ‌ద్ర‌య్య‌కేమీ అర్థం కాలేదు. జ‌నాలు తిర‌గ‌డం మానేశారు. గుళ్లు కూడా మూసేశారు. దెయ్యాలు ప‌ట్టినోళ్లు ఏమై పోయినారో అర్థం కాలేదు. ప్ర‌పంచానికే క‌రోనా దెయ్యం ప‌ట్టింది.

ముక్కుకి గుడ్డ క‌ట్టుకుని వేప చెట్టు కింద కూచున్నాడు. ఒక‌రిద్ద‌రు క్ల‌యింట్స్ వ‌చ్చారు కానీ, ద‌క్షిణ పెద్ద‌గా రాల‌లేదు. జ‌నం ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.

ఒక రోజు క‌ళ్లు మూసుకుని మంత్రాలు చ‌దువుతూ పిల్ల‌గాడికి విభూది ఊదుతుంటే భుజం మీద లాఠీ దెబ్బ ప‌డింది.

క‌రోనా రాకుండా రెయింబ‌వ‌ళ్లు ఊళ్ల మీద ప‌డి మేము తిరుగుతా ఉంటే, వ్యాపారం పెట్టినావా బాడకోవ్ - అని ఎస్ఐ మ‌ళ్లీ లాఠీ ఎత్తాడు.

భ‌ద్ర‌య్య క‌ళ్లు, మీసాలు చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డుతారు. కానీ అవ‌త‌ల ఉన్న‌ది పోలీస్‌. రోజూ నాయ‌కుల‌తోనూ, దెయ్యాల‌తోనూ సావాసం చేసేవాడు.

భ‌ద్ర‌య్య దుకాణం మూసేశాడు. మంత్రం త‌ప్ప వేరే ప‌నిరాదు. గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చిన రేష‌న్‌తో కొన్నాళ్లు నెట్టాడు. ఉపాధి ప‌నుల‌కు పోదాం ప‌దా అన్నాడు కొడుకు. ఒక‌సారి మ‌నం కూలోడిగా మారిపోతే మ‌ళ్లీ మంత్రం కోసం ఎవ‌రూ రారు అన్నాడు. క‌రోనా పోతానే మ‌న వ్యాపారం మూడింత‌లైతాది సూస్తా ఉండు అన్నాడు అశ‌గా.

ఎమో నాయ‌నా నాకు న‌మ్మ‌కం లేదు అన్నాడు కొడుకు. అనుభ‌వం మీద చెప్తాండా వినూ. నెల‌లు నెల‌లు ఆడోళ్ల‌ని సూస్తా మ‌గోళ్లు, మ‌గోళ్ల‌ని సూస్తా ఆడోళ్లు ఇంట్లోనే ఉంటే ఇద్ద‌రికీ దెయ్యం ప‌డుతుంది. తాగితే మ‌గోళ్ల దెయ్యం వ‌దులుతాది. ఆడోళ్లు తాగ‌రు కాబ‌ట్టి మ‌న ద‌గ్గ‌రికి రావాల్సిందే అని కొడుక్కి హిత‌బోధ చేశాడు.

క‌రోనా పోయిన త‌ర్వాత ఏం జ‌రుగుతుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp