తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న వ్యాక్సిన్

By Kranti Jan. 13, 2021, 10:00 am IST
తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న వ్యాక్సిన్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. దేశ ప్రజలను కరోనా నుంచి కాపాండేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే డ్రై రన్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేయనున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దేశంలో కోటి మందికి పైగా కరోనా బారిన పడ్డారు. లక్ష మందికి పైగా మృతి చెందారు. మరోవైపు రెండో దశ కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు కేంద్రం గట్టి ప్రయత్నం చేసింది. స్వయంగా ప్రధాని మోదీ వ్యాక్సిన్ తయారీ పురోగతిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ వచ్చారు. వాక్సిన్ తయారీ ప్రక్రియ పూర్తవ్వడంతో ఇప్పుడు దశల వారిగా దేశ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించారు కూడా.

కేంద్రం అందిస్తున్న వాక్సిన్ డోసులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో 31 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్‌ ను హైదరాబాద్ కు తీసుకువచ్చారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వ్యాక్సిన్ ను అక్కడి నుంచి కోఠిలోని ప్రధాన స్టోరేజ్ సెంటర్ కి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. తెలంగాణలో 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు నిల్వ చేసేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ లో 3 కోట్ల డోసులు, జిల్లాల్లో మరో 2 కోట్ల డోసులు నిల్వ చేయనున్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలిరోజు 139 కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. 17వ తేది సెలవు దినం కావడంతో తిరిగి 18వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,200 సెంటర్లలో వ్యాక్సినేషన్ మొదలుపెడతారు. తొలి విడతలో భాగంగా 2.9 లక్షల మంది ఆరోగ్య కార్యక్తలకు వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా... వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు, భయాలు అవసరం లేదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తొలి వ్యాక్సిన్ తానే వేయించుకుంటానని తెలిపారు. 16వ తేదీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యే తొలిరోజు ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. గాంధీ ఆసుపత్రితో పాటు నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలిస్తారు.

అటు ఆంధ్రప్రదేశ్‌కూ కోవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. తొలివిడతలో భాగంగా 4.7 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం రాష్ట్రానికి పంపించింది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్‌ను స్థానికంగా ఏర్పాటు చేసిన శీతలీకరణ కేంద్రానికి తరలించారు. బుధవారం అన్ని జిల్లా కేంద్రాలకు వ్యాక్సిన్‌ను అధికారులు తరలించనున్నారు. వాక్సినేషన్ కోసం ఇప్పటికే రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గన్నవరంలో 15 లక్షల డోసుల నిల్వ సామర్థ్యం స్టోరేజ్ పాయింట్ ని సిద్ధం చేశారు. అక్కడి చేరుకున్న వాక్సిన్ ను కర్నూలు, కడప, గుంటూరు, విశాఖ ప్రాంతీయ కేంద్రాలకు తరలిస్తారు. వ్యాక్సిన్లను భద్రపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,677 కోల్డ్ చైన్ పాయింట్లను సిద్ధం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో 17,032 మంది ఏఎన్ఎంలు పాల్గొననున్నారు. మొత్తానికి మరి కొద్ది నెలల్లో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ చేరబోతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp