పంద్రాగ‌స్టులో ఈ పంద్రాగ‌స్టు వేర‌యా...

By Kalyan.S Aug. 14, 2020, 09:57 pm IST
పంద్రాగ‌స్టులో ఈ పంద్రాగ‌స్టు వేర‌యా...

73 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో స్వాతంత్య్ర వేడుక‌లు ఈ సారి భిన్నంగా జ‌ర‌గ‌నున్నాయి. అనేక ప‌రిమితులు, ఆంక్ష‌ల మ‌ధ్య కొన‌సాగ‌నున్నాయి. కేంద్రం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటే వేడుక‌ల‌కు స‌న్నాహ‌మైంది. సైనిక విన్యాసాల‌లో పాల్గొనే సిబ్బంది నెగెటివ్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి. ఈ వేడుక‌ల కోసం 350 మంది పోలీసుల‌ను ముంద‌స్తుగా క్వారంటైన్ లో ఉంచారు. ఢిల్లీ కంటోన్మెంట్ లోని ఓ హౌసింగ్ కాల‌నీకి పంపారు. వారు నేరుగా వేడుక‌ల్లో పాల్గొంటారు. రిహార్స‌ల్స్ కు త‌ప్పా.. ఎక్క‌డికీ క‌ద‌ల‌కుండా వారికి ఆంక్ష‌లు విధించారు. వారే కాదు.. వారి స‌హాయ‌కులు, వంట‌వాళ్లు, డ్రైవ‌ర్ల‌ను సైతం ముంద‌స్తుగా క్వారంటైన్ కు పంపారు. ఢిల్లీ వేడుక‌ల్లో ఈ సారి క‌నిపించే ప్రధాన మార్పు స్కూలు పిల్ల‌ల‌ను దూరంగా ఉంచ‌డం. ఏటా 3500 మంది విద్యార్థులు పంద్రాగ‌స్టు వేడుక‌ల్లో పాల్గొనేవారు. క‌రోనా భ‌యంతో ఈసారి వారిని అనుమ‌తించ‌డం లేదు. అతిథుల సంఖ్య‌నూ భారీగా త‌గ్గించేశారు. ఏటా 300 నుంచి 350 మంది ఉండే అతిథుల సంఖ్య‌ను ఈసారి 120కి ప‌రిమితం చేశారు. ప్ర‌ధాని ద‌గ్గ‌ర‌గా ఉండే మీడియా ప్ర‌తినిధుల విష‌యంలోనూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగెలివ్ అని తేలిన ఫొటోగ్రాఫ‌ర్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించారు.

మోదీ షెడ్యూల్ ఇదీ...

శ‌నివారం ఉద‌యం 7.21కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్ర‌కోట‌కు చేరుకుంటారు. 7.30కి జాతీయ జెండాను ఎగుర‌వేస్తారు. అనంత‌రం సుమారు 45 నిమిషాల నుంచి 90 నిమిషాల‌కు వ‌ర‌కూ ప్ర‌సంగిస్తారు. ఈ సందేశంలో దేశ పౌరుల ఆరోగ్యానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. దేశ‌మంత‌టికీ ఒక‌టే కార్డు ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్య రికార్డుల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు ఓ వినూత్న ప్రాజెక్ట్ రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

కేంద్రం సూచ‌న‌లు, ఆదేశాల ప్ర‌కార‌మే తెలుగు రాష్ట్రాల‌లో కూడా పంద్రాగ‌స్టు వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆంధ‌ప్ర‌దేశ్ లో విజ‌య‌వాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం అన్ని విధాలుగా సిద్దం చేశారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. నిబంధనలు కచ్చితంగా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పెరేడ్‌లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. తెలంగాణ‌లో అయితే ప్రగతి భవన్‌లోనే వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోనే పతాకావిష్కరణ చేయనున్నారు. దీని కోసం పూర్తి ర‌క్ష‌ణ చ‌ర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లా కార్యాల‌యాలు, పోలీస్ క‌మిష‌న‌రేట్ల లో కూడా కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వేడుక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల‌లోనూ కొంత మంది క‌రోనా వారియ‌ర్స్ ను, విజేత‌ల‌ను స‌న్మానించ‌నున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp