Congress Membership - Rules : కాంగ్రెస్ సభ్యత్వం ఇక కష్టమే..! పాత వారి పరిస్థితేమిటీ..?

By Voleti Divakar Oct. 24, 2021, 05:45 pm IST
Congress Membership - Rules : కాంగ్రెస్ సభ్యత్వం ఇక కష్టమే..! పాత వారి పరిస్థితేమిటీ..?

భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకునే వారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారేమో.ఖాదీ ధరించాలంట,ఆదాయానికి మించి ఆస్తులు ఉండకూడదంట,మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకే ప్రత్యేకమైన అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా పార్టీ అధిష్టానంపైనా..నాయకులపై బహిరంగ విమర్శలు చేయకూడదు. మద్యం తాగకూడదంట, మాదకద్రవ్యాలు సేవించరాదు.కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకునే వారు ఇలా 10 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

నవంబర్ 1 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకునే వారు ఈ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.స్కూలు పిల్లలకు అమలు చేసినట్లు ఇలాంటి నిబంధనలేమిటని కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.ఇన్ని నిబంధనల మధ్య కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునేదెవరని ప్రశ్నిస్తున్నారు.నాయకత్వ సంక్షోభం,ప్రజాదరణ లేమితో ఇప్పటికే కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ కొత్త నిబంధనలు పార్టీ పూర్వవైభవానికి ప్రతిబంధకంగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈరోజుల్లో ఇది సాధ్యమేనా

ఈరోజుల్లో పార్టీల పేరిట కాలేజీ విద్యార్థులు కూడా అడపాదడపా మద్యం సేవించడం సర్వసాధారణంగా మారింది.కొంతమంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు కూడా అలవాటుపడుతున్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పౌరులు మద్యాన్ని మానుకుంటారా అన్నది అనుమానమే.ఖాదీ ధరించాలన్న నిబంధనను కూడా ఖాతరు చేసే పరిస్థితి కనిపించడం లేదు.తప్పో ఒప్పో చేసి ధనార్జనే ధ్యేయంగా ఉన్న నేటి సమాజంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉండరాదన్న నిబంధన కార్యకర్తలకు మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి నిబంధనలు మానసికంగా వికాసం పొంది, ఓటు హక్కు కలిగిన వ్యక్తులు పార్టీలో చేరేందుకు ఏమేరకు ఆసక్తి చూపిస్తారన్నది ప్రశ్నార్థకమే.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మిగిలిన పార్టీల కన్నా ఎక్కువ.దీని పర్యావసనమే పార్టీ ఆవిర్భావం నుంచి చీలికలు పేలికలైంది.అధిష్టానం ఆదేశాలను ధిక్కరించిన పార్టీ ప్రజాప్రతినిధులే సొంత ప్రభుత్వాలను కూల్చివేశారు.తాజాగా పంజాబ్‌లో అధికార మార్పిడే ఇందుకు తాజా ఉదాహరణ . పార్టీ అధినేత్రి సోనియాగాంధీ,యువనేత రాహుల్ గాంధీలపై ఈమధ్య సీనియర్లు బహిరంగంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త నిబంధనలు పాతవారు పాటిస్తారా ?

కాంగ్రెస్ సీనియర్లు,నాయకులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయా ?  కొత్తగా చేరే వారు మాత్రమే ఈనిబంధనలు పాటించాలా అన్నది తేలాల్సి ఉంది. పార్టీ నాయకులు,కార్యకర్తల్లో చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉండే ఉంటుంది.కొత్త నిబంధనల ప్రకారం వారంతా మద్యం మానేయాలా ?అలాగే పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించుకున్నారు.వారి పరిస్థితి ఏమిటీ ?.కొత్త నిబంధనల ప్రకారం పార్టీ అధిష్టానంపై, విధానాలపై బహిరంగ విమర్శలు చేయకూడదు.పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తాజాగా చేసిన హెచ్చరికల నేపథ్యంలో పార్టీ సీనియర్ల నోర్లు మూత పడతాయా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

Also Read : Bihar RJD Congress - మరో మిత్రపక్షాన్ని కోల్పోయిన కాంగ్రెస్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp