బెంగాల్ - ముందుగానే పంపకాలు.. ఫలితాలు ఎలా ఉంటాయో..?

By Karthik P Mar. 04, 2021, 09:03 pm IST
బెంగాల్  - ముందుగానే పంపకాలు.. ఫలితాలు ఎలా ఉంటాయో..?

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నా.. దేశం దృష్టి ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌పై ఉంది. ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) హ్యాట్రిక్‌ కొట్టేందుకు శాయశక్తులు ఒడ్డుతుంటే.. అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. తమను తక్కువ అంచనా వేయొద్దని కాంగ్రెస్‌–వామపక్షకూటమి–ఇండియన్‌ సెక్యూలర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎల్‌)లు తమ బలాన్ని చాటుతుండడంతో బెంగాల్‌ దంగల్‌ ఈ సారి ఆసక్తికరంగా మారింది. బీజేపీ, టీఎంసీలు ఒంటిరిగా పోటీ చేస్తున్నాయి.

ఎన్నికలకు షెడ్యూల్‌ విడులై వారం రోజుల్లో కాంగ్రెస్‌ – వామపక్షకూటమి–ఐఎస్‌ఎల్‌ మధ్య సీట్ల పంపకం పూర్తవడంతో ఈ ఎన్నికలను ఆయా పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతోంది. సీట్ల పంపకాల్లోనే పుణ్యకాలం గడచిపోకుండా ఆయా పార్టీలు పక్కా ప్లాన్‌తో సమష్టిగా ఎన్నికలను ఎదుర్కొన్నబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ రోజు జరిగిన సీట్ల పంపకాల్లో వామపక్ష కూటమికి మెజారిటీ స్థానాలు దక్కాయి. 294 సీట్లు ఉన్న బెంగాల్‌లో వామపక్షకూటమి 165 స్థానాల్లో, కాంగ్రెస్‌ 92, ఐఎస్‌ఎల్‌ 37 స్థానాల్లో పొటీ చేసేలా భాగపంపకాలు జరిగాయి. వామపక్ష కూటమికి వచ్చిన 165 సీట్లలో సీపీఎం 135 స్థానాల్లోనూ, సీపీఐ 9, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 15, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి.

బెంగాల్‌ 8 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి దశలో 30 నుంచి 40 స్థానాల మేర పోలింగ్‌ జరగనుంది. మార్చి 27వతేదీన తొలి దశ, ఏప్రిల్‌ 29వ తేదీన తుది దశ పోలింగ్‌ జరగబోతోంది. ప్రతి దశలోనూ 30 పైచిలుకు స్థానాలకే పోటీ జరగబోతున్న తరుణంలో ఆయా పార్టీలు సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. వామపక్షకూటమి పార్టీలు తమ అభ్యర్థులను ఈ నెల 8వ తేదీన ప్రకటించబోతున్నాయి. తొలి దశ పోలింగ్‌కు మూడు వారాల ముందే అభ్యర్థులను ప్రకటించబోతుండడంతో వామపక్షపార్టీలు ఈ ఎన్నికలకు పక్కా వ్యూహంతో సిద్ధమయవుతున్నాయని అర్థమవుతోంది. మరో వైపు బెంగాల్‌ సహా ఐదు రాష్ట్రాలలో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందకు ఢిల్లీలో ఈ రోజు బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థుల తుది జాబితాకు మెరుగులు దిద్దుతోంది. రెండు నెలల పోరు తర్వాత మే 2వ తేదీన ఆయా పార్టీల భవితవ్యం తేలిపోనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ రోజు వెల్లడికానున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp