రఘురామకృష్ణంరాజు తీరుపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు, కేసు నమోదు చేయాలని డిమాండ్

By Raju VS Jan. 14, 2022, 09:00 am IST
రఘురామకృష్ణంరాజు తీరుపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు, కేసు నమోదు చేయాలని డిమాండ్

నర్సాపురం ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు తీరు పదే పదే వివాదాస్పదమవుతోంది. ఆయన నోటికి పనిచెబుతూ వివిధ వర్గాలను కించపరిచేలా మాట్లాడుతున్న తీరు మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు చేసేవరకూ వెళుతోంది. కేసు నమోదు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన విద్వేషాలు రగిల్చే ప్రయత్నంలో ఏపీ సీఐడీ కేసుల్లో ఉన్నారు. గతంలో అరెస్ట్ కావడం, బెయిల్ పై విడుదల కావడం అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి ఆయనకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈనెల 17న విచారణకు హాజరుకావాల్సి ఉంది. నోటీసులు అందుకోగానే రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పయనం కావడం ఆసక్తిగా మారింది. ఏపీ సీఐడీ నిర్దేశించిన గడువు ప్రకారం ఆయన విచారణకు హాజరువుతారా లేదా అనేది చూడాలి.

ఈలోగా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల మీద పలువురు స్పందిస్తున్నారు. ఆయన మీద కేసులు నమోదు చేయాలని పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులందాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, గుంటూరు జిల్లా తెనాలి లో ఆయన మీద పోలీసులకు ఫిర్యాదులు అందాయి. క్రైస్తవుల మీద రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను తప్పుబడుతూ మైనార్టీ సంఘాలు తెనాలి అర్బన్  పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు టీవీ చానెల్ చర్చలో విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారని రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీసులకు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు అందింది. ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మీద ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఎయిమ్ సంస్థ తప్పుబట్టింది. ఎంపీపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. ఎస్సీ అధికారి ఉన్నత స్థానంలో ఉండడం రఘురామరాజు సహించలేకపోతున్నారని తెలిపింది. ఇలాంటి వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎయిమ్ సంస్థ ప్రతినిధులు కోరారు. దాంతో వివిధ ప్రాంతాల్లో రఘురామకృష్ణంరాజు మీద ఫిర్యాదులు అందుతున్న తరుణంలో వాటిని పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకునే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారం ఈ ఎంపీని మరిన్ని వివాదాల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్నట్టుగా నోరు ఉంది కదా అని అన్ని చోట్లా వీరంగం చేస్తే ఏమవుతుందో ఆయన అనుభవం చాటిచెబుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp