నంద్యాల - తిరుపతి : రెండు ఉప ఎన్నికల మధ్య ఎంత వైరుధ్యం

By Sanjeev Reddy Apr. 19, 2021, 12:00 pm IST
నంద్యాల - తిరుపతి : రెండు ఉప ఎన్నికల మధ్య ఎంత వైరుధ్యం

ఉపఎన్నికలు ఏవైనా అధికార పార్టీ పాలనకు రెఫరెండంగా పరిగణించడం సర్వ సాధారణం . అందుకు తగ్గట్టే ఆయా ఉప ఎన్నికలను అధికార , ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొంటాయి . ఈ క్రమంలో ఇరు పక్షాలు డబ్బు , మద్యం పంపిణీ చేయడంతో పాటు అదనంగా అధికార పార్టీ తన బలాన్ని ప్రయోగించడంతో పాటు , ప్రభుత్వం తరుపున సంక్షేమ పథకాల తాయిలాల ఎర వేయడం , స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తాము గెలవకపోతే ఇవన్నీ ఆగిపోతాయని బెదిరించడం గత కొన్ని దశాబ్దాలుగా సర్వసాధారణంగా మారిపోయింది .

ఈ తరహా ఎన్నికల ఎత్తుగడలకు చంద్రబాబు పెట్టింది పేరు . 2017 నంద్యాల ఉప ఎన్నికల తీరుని గుర్తు చేసుకొంటే పలు అంశాలు ఇందుకు ప్రతిబింబాలుగా నిలుస్తాయి . 2014 ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా నాటి ఉపఎన్నికని ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా టీడీపీ పార్టీ అధికారమే ఆలంబనగా అనేక ప్రలోభాలకు , బెదిరింపుల పర్వానికి తెర లేపింది .

విధ్వంసానికి సాక్షీభూతమైన శకలాల ముంగిట ఎన్నికల ప్రచారం మొదలు......

నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నుండి పద్మావతీ నగర్ మీదుగా సాయిబాబా విగ్రహం వరకూ 60 , 80 అడుగుల రోడ్ల విస్తరణ పేరిట రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్లను , వ్యాపార భవనాలను ఉప ఎన్నికల ముందు హడావుడిగా కూల్చిన నాటి టీడీపీ ప్రభుత్వం కూల్చివేతలో నష్టపోయిన బాధితులకు పరిహారంతో పాటు , రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి కావాలంటే అధికార పార్టీని గెలిపించుకోక తప్పదు అనే విధంగా ప్రచారం ప్రారంభించింది . దానితో పాటు నంద్యాల ఎన్నికల్లో గెలిపిస్తే 200 కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని , అలాగే రాబోయే మూడేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తామని చంద్రబాబు , భూమా అఖిలతో పాటు పలువురు టీడీపీ నేతలు హామీల వర్షం కురిపించారు .

నేను వేసిన రోడ్ల పై నడుస్తూ , నేను ఇచ్చే పెన్షన్లు తీసుకొంటూ నాకు ఎందుకు ఓటు వేయరు అలా వేయని వారు నేను వేసిన రోడ్ల పై నడవొద్దు , నేనిచ్చే పెన్షన్లు తీసుకోవద్దు అంటూ ప్రచారంలో వ్యాఖ్యానించిన చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మారెడ్డిని గెలిపిస్తే నంద్యాలని వైజాక్ లాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వగా, ఆయన తనయుడు , నాటి కేబినెట్ మినిస్టర్ నారా లోకేష్ మరో ముందడుగు వేసి నంద్యాలని మినీ అమరావతిగా తీర్చిదిద్దుతామని వరాల జల్లు కురిపించారు .

విచ్చలవిడి డబ్బు పంపిణీలో సరికొత్త రికార్డులు...

ఇవన్నీ ఒక ఎత్తు అయితే డబ్బు పంపిణీలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది నంద్యాల ఉప ఎన్నిక . గెలుపే ధ్యేయంగా సాగిన ఈ పోరులో వెల్లువెత్తిన డబ్బు ప్రవాహం చూసి దేశం యావత్తూ నివ్వెరపోయింది అని చెప్పవచ్చు . అధికార టీడీపీ పార్టీ దాదాపు 150 కోట్ల రూపాయలు డబ్బు వెదజల్లిందని జాతీయ , అంతర్జాతీయ మీడియా వెల్లడించింది అంటే ఆ ఎన్నికల్లో డబ్బుతో ఎంతగా ప్రభావితం చేశారో అర్ధం చేసుకోవచ్చు . పోల్ మేనేజ్మెంట్ లో అపార అనుభవం ఉన్న నిపుణుడుగా పేరున్న బాబు దాదాపు తన మంత్రి వర్గ సహచరులందరితో పాటు , పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను నంద్యాల ఉప ఎన్నికల్లో వార్డుల వారీగా ఇంచార్జ్ లుగా నియమించి పటిష్ట ఏర్పాట్లతో డబ్బు పంపిణీ చేసి సాగించిన నంద్యాల ఉప ఎన్నికల గురించి ఇప్పటికీ చెప్పుకొంటారు . తర్వాతి రోజుల్లో జరిగిన కొన్ని ఉప ఎన్నికలని నంద్యాల ఎన్నికలతో పోల్చి నంద్యాల తరహా ఉప ఎన్నికగా వ్యవహరించడం రివాజుగా మారింది .

Also Read : జ‌నంపై జ‌గ‌న్ ప్రేమ‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..!

సత్సాంప్రదాయాలకు నాంది పలికిన తిరుపతి ఉప ఎన్నిక .....

ప్రస్తుతం జరిగిన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి ఉప ఎన్నిక ఇందుకు పూర్తి భిన్నంగా డబ్బు , మద్యం ప్రభావం లేకుండా సాగటం విశేషం . వైసీపీ తరుపున పార్లమెంట్ అభ్యర్థిగా సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని ఎంపిక చేసిన వైసీపీ అధినేత జగన్ ఈ ఉప ఎన్నికలని తన రెండేళ్ల పాలన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకోవడానికి నిర్వహించారు అనుకోవచ్చు . ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే వెసులుబాట్లు వినియోగించుకోకుండా , ఎన్నికల వేళ ఇతర పార్టీల్లాగా ప్రాంతీయంగా ప్రత్యేక హామీలు ఇవ్వకుండా నిర్వహించడం ఒకెత్తు కాగా , దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న డబ్బు , మద్యం పంపిణీ ఊసు లేకుండా తన పాలన పట్ల నమ్మకంతో , సంక్షేమ , అభివృద్ధి పధకాలే ప్రచారాస్త్రంగా పారదర్శకంగా ఎన్నికల్లో పాల్గొనడం విశేషం .

అధికార పార్టీ చివరి రోజు వరకూ డబ్బు , మద్యం పంచకపోవడంతో ఇతర పక్షాలు డబ్బు పంచి దోషిగా నిలబడలేక తన మార్గాన్ని అనుసరించాల్సిన పరిస్థితి కల్పించాడు జగన్ . ఈ సందర్భంగా విపక్షాలైన టీడీపీ , జనసేన , బీజేపీలు వైసీపీ పై పలు రకాల ఆరోపణలు చేయడంతో పాటు , కుల , మత రాజకీయాలకు తెరతీస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సంయమనం కోల్పోకుండా వ్యవహరించిన జగన్ మోహన్ రెడ్డి కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా తన వలన ప్రజలు గుమిగూడి ఇబ్బందుల పాలు కాకూడదని తిరుపతిలో ప్రచార సభ సైతం కాన్సిల్ చేసుకోవడం మంచి పరిణామంగా చెప్పవచ్చు .

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి , జగన్ ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడానికి దుష్ప్రచారానికి వేదికగా వాడుకోవడం గమనార్హం . ఇటీవల స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం నిర్ణయించిన వేల అందుకు వ్యతిరేకంగా ఎన్నికలు జరపాల్సిందే అని టీడీపీ పార్టీ , వివాదాస్పద ఎస్ఈసీ నిమ్మగడ్డ పలు కోర్టులు తిరిగి స్థానిక పంచాయితీ , నగర పాలక ఎన్నికలు నిర్వహించగా ఆయా ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలు కాగా ఎన్నిక నిర్వహణా సమయంలోనే కరెంట్ ఆపేసి మీరే గుద్దుకోండి అంటూ ఆక్రోశం వెలగక్కడం విశేషం . 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత బీజేపీతో కుమ్మక్కై ఈవియమ్ లు మేనేజ్ చేసి గెలిచారు అంటూ గగ్గోలు పెట్టిన బాబు తర్వాత బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఈవీఎంలు మాట ఎత్తడం మానేశారు .

వరుస ఘోర పరాజయాల నేపథ్యంలో ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలని బహిష్కరిస్తున్నాం అంటూ తప్పుకున్న టీడీపీ నేతలు , తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ పై , జగన్ పై దుష్ప్రచారమే పరమావధిగా పనిచేసినా ప్రజలు విశ్వసించలేదని చెప్పొచ్చు . టీడీపీ నుండి పలువురు ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలతో పాటు నారా లోకేష్ , చంద్రబాబు సహా పార్టీ నాయకులు అందరూ మోహరించి చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోగా పనబాకకి ఓట్లేస్తే పెట్రోల్ , డీజిల్ రేట్లు తగ్గుతాయి లాంటి విచిత్ర వ్యాఖ్యలు చేసిన లోకేష్ తిరుపతి ప్రజలకు వినోదం పంచాడు అని చెప్పొచ్చు . ఎంత ప్రయత్నించినా గెలుపు సంగతి పక్కన బెట్టి వైసీపీ మెజారిటీ తగ్గించే ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయని గ్రహించిన చంద్రబాబు చివరిగా తన పై రాళ్ళ దాడి అంటూ ఓ కార్యకర్త అందించిన చిన్న గులకరాయిని చూపిస్తూ రభస చేసే యత్నం చేయడం టీడీపీ దుస్థితిని కళ్ళకు కట్టింది .

ఇవేవీ ఫలించని స్థితిలో ఎప్పుడూ ఎన్నికల తర్వాత పోలింగ్ సరళిని బట్టి ఓటమి గ్రహించి ఓటమి బాధ్యతను తన భుజం పై వేసుకోకుండా సాకులు చెప్పే బాబు ఈ సారి మాత్రం ముందే కాడి పడేసి ఎన్నికల నిర్వహణ సమయంలోనే సాధారణ ప్రజల్ని , తీర్థ యాత్రీకులని దొంగ ఓటర్లు అని చూపుతూ అనుకూల మీడియా వేదికగా ఓటమికి ముందే సాకుల్ని వెతుక్కున్నారు బాబు .

మరో వైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం డబ్బు , మద్యం ప్రభావం లేకుండా అరచేతిలో వైకుంఠం లాంటి ప్రలోభాలకు గురి చేయకుండా తన పాలనే గీటురాయిగా ఎన్నికలను ఎదుర్కొని ఇతర రాజకీయ పక్షాలు కూడా తన దారిలో నడవాల్సిన పరిస్థితులు కల్పించి సత్సాంప్రదాయానికి తెరతీయడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం అని చెప్పొచ్చు.

Also Read : ఆ సీట్ ఏకగ్రీవం వెనుక ఆసక్తికర రాజకీయాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp