కో ఆప్షన్ లోనూ క్యాంప్ లు.. ఉద్రిక్త‌త‌లు!

By Kalyan.S Aug. 06, 2020, 08:39 pm IST
కో ఆప్షన్ లోనూ క్యాంప్ లు.. ఉద్రిక్త‌త‌లు!

తెలంగాణ‌లో జ‌రుగుతున్న కో ఆప్ష‌న్ ఎన్నిక‌ల ప్ర‌క్రియను ప‌రిశీలిస్తే మినీ సంగ్రామాన్నిత‌ల‌పిస్తోంది. ఒక్కో కార్పొరేష‌న్‌, లేదా మున్సిపాల్టీల‌లో 2 నుంచి అత్య‌ధికంగా సుమారు 6 కో ఆప్ష‌న్ స్థానాల కంటే ఎక్కువ‌గా లేవు. వాటి కోసం నాయ‌కుల పోటీ తీరును ప‌రిశీలిస్తే ప‌ద‌వుల కోసం ఎంత‌లా ఆరాట‌ప‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. రానున్న నాలుగేళ్ల వ‌ర‌కూ ఎన్నిక‌లేవీ లేక‌పోవ‌డం.. ఇత‌ర‌ ప‌ద‌వులు వచ్చే చాన్స్ త‌క్క‌వ‌గా ఉండ‌డంతో స్థానికంగా ఓ స్థాయి ఉన్న నాయ‌కులంద‌రూ కో ఆప్ష‌న్ కోసం విస్తృతంగా ప్ర‌య‌త్నాలు చేశారు. కొన్ని చోట్ల అయితే క్యాంప్ రాజ‌కీయాలు న‌డిచాయి. మ‌రికొన్ని చోట్ల ఉద్రిక్త‌త‌ల‌కు కూడా దారి తీసింది. ప్ర‌ధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన నేత‌లు ఆయా స్థానాల‌ను ప్రెస్టేజీగా తీసుకుని నామినేష‌న్లు వేశారు.

మాజీ చైర్మ‌న్ పై దాడి

యాదాద్రి జిల్లా భువ‌న‌గిరి మునిసిప‌ల్ కో ఆప్ష‌న్ స‌భ్యుల ఎన్నికైతే ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఎన్నిక కోసం జ‌రిగిన స‌మావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు వాదోప‌వాదాల‌కు దిగారు. త‌మ పార్టీకి చెందిన 11వ వార్డు కౌన్సిల‌ర్ ను టీఆర్ఎస్ లో చేర్చుకోవ‌డంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక కోసం కార్పొరేష‌న్ కార్యాల‌యానికి వ‌చ్చిన భువ‌న‌గిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్ రెడ్డిని గేటు వ‌ద్దే అడ్డుకోవ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ స‌భ్యులు ఒక‌రికొక‌రు నెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఓ టీర్ఎస్ కౌన్సిల‌ర్ చొక్కా చిరిగింది. దీనికి నిర‌స‌న‌గా కాంగ్రెస్ కు చెందిన మునిసిప‌ల్ మాజీ చైర్మ‌న్ పై టీఆర్ఎస్ నాయ‌కులు మూకుమ్మ‌డిగా దాడికి దిగారు. ఇక్క‌డ 4 స్థానాల‌లోనూ టీఆర్ఎస్ విజ‌యం సాధించ‌డం ఈ ఉద్రిక్త‌త‌కు కార‌ణం.

టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్య‌ర్థుల విజ‌యం

భూదాన్ పోచంప‌ల్లి మునిసిప‌ల్ కో ఆప్ష‌న్ స‌భ్యుల ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. మునిసిప‌ల్ ప‌రిధిలో 13 మంది కౌన్సిల‌ర్ లు ఉన్నారు. 4 కో ఆప్ష‌న్ స్థానాల‌కు గాను మైనారిటీ మ‌హిళ‌, మైనారిటీ జ‌న‌ర‌ల్ స్థానాల‌కు ఒక్కో నామినేష‌న్ రావ‌డంతో ఏక‌గ్రీవం అయిన‌ట్లు ఎన్నిక‌ల అధికారి బాల‌శంక‌ర్ ప్ర‌క‌టించారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని నార్సింగ్ మున్సిప‌ల్ కో ఆప్ష‌న్‌లోనూ టీఆర్ఎస్ కు విచిత్ర ప‌రిస్థితి ఎదురైంది. ఇక్క‌డ ఒక స్థానానికి ముగ్గురు అభ్య‌ర్థులు నామినేష‌న్ వేశారు. ఆ త‌ర్వాత ఒక‌రు విత్ డ్రా చేసుకోగా ఇద్ద‌రు పోటీలో నిలిచారు. పోటీ తీవ్రంగా ఉండ‌డంతో ఓ అభ్య‌ర్థి క్యాంప్ రాజ‌కీయాల‌కు తెర తీశారు. ఎమ్మెల్యే రంగంలోకి దిగ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న హామీ ఇచ్చిన వ్య‌క్తికే ఆ ప‌ద‌వి ద‌క్కింది.

మీర్ పేట‌లో టీఆర్ఎస్.. పెద్ద అంబ‌ర్ పేట‌లో కాంగ్రెస్

గ్రేట‌ర్ ప‌రిధిలోని పెద్ద అంబ‌ర్ పేట్ మున్సిపాల్టీలోని 4 కో ఆప్ష‌న్ స్థానాల‌ను కాంగ్రెస్ త‌న ఖాతాలో వేసుకుంది. ఇక్క‌డ మొత్తం 24 మంది కౌన్సిల‌ర్లు ఉండ‌గా.. టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్ కు 13, బీజేపీ 1, సీపీఐ 1, ఒక‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఉన్నారు. 4 స్థానాల‌కు మొత్తం 16 మంది నామినేష‌న్ లు వేశారు. అందులో ఒక‌టి తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. మిగిలిన 15 మందిలో కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌కే పూర్తి మ‌ద్ద‌తు ల‌భించింది. అలాగే మీర్ పేట కార్పొరేష‌న్ లోని 5 కో ఆప్ష‌న్ స్థానాలు ఉండ‌గా అన్నింటిలోనూ టీఆర్ఎస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. ఈ కార్పొరేష‌న్ లో బీజేపీ కార్పొరేట‌ర్ లు 16 మంది ఉన్నారు. వారిలో ముగ్గురికి క‌రోనా వ‌చ్చింది. మిగిలిన 13 మందిలో ఒక్క‌రు కూడా స‌మావేశానికి రాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp