మరో బృహత్తర కార్యక్రమానికి రంగం సిద్ధం

By Karthik P Jan. 17, 2021, 09:50 am IST
మరో బృహత్తర కార్యక్రమానికి రంగం సిద్ధం

సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలతో పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులు.. తమ ఇంటి వదనే చౌకదుకాణాల సరుకులు అందుకోబోతున్నారు. ఈ మేరకు రేషన్‌ సరుకులు సరఫరా చేసే వాహనాలను సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 21వ తేదీన ప్రారంభించబోతున్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి వాహనాలను ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను రేషన్‌ పంపిణీ కార్యక్రమం కోసం ఇప్పటికే సేకరించారు. ఇందులో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,503 వాహనాలను బెంజ్‌ సర్కిల్‌ నుంచి ఆయా ప్రాంతాలకు పంపనున్నారు.

బడుగులకు ఉపాధి..

ఇప్పటి వరకు రేషన్‌ డీలర్ల ద్వారా చౌకదుకాణాల నుంచి సరుకులు పంపిణీ చేస్తున్నారు. వాహనాల ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ కార్యక్రమం ద్వారా కొత్తగా 9,260 మందికి ఉపాధి లభిస్తోంది. నూతన విధానంలో డీలర్లు కొనసాగడంతోపాటు.. అదనంగా వాహనాల డ్రైవర్లు ఉంటారు. ఈ వాహనాలను సబ్సిడీపై ప్రభుత్వం అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల యువతకు రాయితీపై వాహనాలను అందించారు. పది శాతం లబ్ధిదారుడు వాటా, 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం ప్రభుత్వమే అందిస్తోంది. ప్రతి నెలా వాహనదారులకు నిర్ణీత మొత్తాన్ని అందించనుంది. వాహన రుణాన్ని సులభ వాయిదాల్లో చెల్లించేలా నిర్ణయించారు. ఫలితంగా వాహనం పొందిన వారికి ఉపాధి లభించడంతోపాటు.. కొద్ది కాలానికి వాహనం కూడా సదరు వ్యక్తి సొంతం కానుంది.

అందరి భాగస్వామ్యం..

రేషన్‌ డోర్‌ డెలివరీని గత ఏడాది ఏప్రిల్‌ నుంచే ప్రారంభించాలని జగన్‌ ప్రభుత్వం భావించింది. ఇందు కోసం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమం అమలు ఆగిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. వాహనాల కేటాయింపు ఆలస్యం కావడంతో ఫిబ్రవరికి వాయిదా పడింది. రేషన్‌ డోర్‌ డెలివరీలో రేషన్‌ డీలర్, వాహన డ్రైవర్‌తోపాటు వలంటీర్‌ పాల్గొననున్నారు. తమకు కేటాయించిన ఇళ్లకు వలంటీర్లు వెళ్లి రేషన్‌ సరుకులు అందించబోతున్నారు. ప్రస్తుతం చౌక దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు, చక్కెర సబ్సిడీ ధరలకు అందిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp