13 ఏళ్ల పోరాటం.. జగన్ చొరవతో శుభం

By Ramana.Damara Singh Jun. 10, 2021, 06:00 pm IST
13 ఏళ్ల పోరాటం.. జగన్ చొరవతో శుభం

ఎన్నో ఆశలతో వారంతా పోటీ పరీక్షలు రాశారు. ఎంపికయ్యారు కూడా. రేపో మాపో ఉద్యోగాల్లో చేరిపోతాం.. ఇక తమ జీవితాలు గాడినపడినట్లేనని భావించిన వారి ఆశలు వివాదాల ఉచ్చులో చిక్కుకున్నాయి. దాంతో ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన వారు.. ఏళ్ల తరబడి దానికోసం పోరాడాల్సి వచ్చింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంతమంది పాలకులకు విన్నవించుకున్నా కంఠశోషగానే మిగిలింది. చివరికి ఆ సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపించారు. దాంతో తమ 13 ఏళ్ల పోరాటం ఫలించిందని 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.

సుదీర్ఘ పోరాటం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి 2008లో జిల్లా ఎంపిక కమిటీల(డీఎస్సీ) ద్వారా నియామక ప్రక్రియ చేపట్టారు. రాత పరీక్షలు కూడా నిర్వహించి.. అర్హుల జాబితాలు ప్రకటించారు. ఈ తరుణంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మారుస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుల్లో బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు 70, 30 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించారు. దాంతో వివాదం మొదలైంది. రిజర్వేషన్లకు అంగీకరించని బీఈడీ, డిఈడీ అభ్యర్థులు ఎవరికి వారు తమకే మొత్తం పోస్టులు కేటాయించాలని కోరుతూ కోర్టుకెక్కారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచన మేరకు వివాదం ఉన్న 30 శాతం పోస్టులను పక్కన పెట్టి.. 70 శాతం పోస్టులు భర్తీ చేసింది. దాంతో 2193 మంది త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎంతమంది ముఖ్యమంత్రులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.

ప్రజాసంకల్ప యాత్రలో హామీ

కాగా ఎన్నికల ముందు ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన సమయంలో డీఎస్సీ 2008 అభ్యర్థులు జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య పరిష్కరిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చిన జగన్ దాన్ని నెరవేర్చారు. ఎన్జీవో సంఘ నేత వెంకట్రామిరెడ్డితో కలిసి డీఎస్సీ 2008 అభ్యర్థుల ప్రతినిధులు సీఎం జగన్ను కలవగా.. ఆయన వెంటనే స్పందించి మొదట మినిమం టైం స్కేలుతో తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తామని.. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పారు. ఆ మేరకు 21,230 రూపాయల టైం స్కేల్ ఇస్తామని కూడా చెప్పడంతో డీఎస్సీ2008 క్వాలిఫైడ్ అభ్యర్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. తమ సుదీర్ఘ నిరీక్షణ, పోరాటానికి సీఎం జగన్ ముగింపునిచ్చి.. తమ జీవితాలను మలుపు తిప్పారన్నారు.

Also Read : నేదురుమల్లి వారసులు ఏం చేస్తున్నారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp