దివంగత నేత కుమారుడికి ఎమ్మెల్సీ ఖరారు చేసిన జగన్

By Raju VS Aug. 11, 2020, 08:26 pm IST
దివంగత నేత కుమారుడికి ఎమ్మెల్సీ ఖరారు చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మార్క్ రాజకీయాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీ అయిన ఏకైక మండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో జగన్ నిర్ణయం ఆశ్చర్యంగా మారింది. సుదీర్ఘకాలంగా వైఎస్సార్ తోనూ, ఆ తర్వాత జగన్ తోనూ సన్నిహితంగా మెలిగిన కుటుంబానికి న్యాయం చేశారు. ముఖ్యంగా ఏపీలోనే అత్యధిక సార్లు (ఎనిమిదిసార్లు ) ఎమ్మెల్యేగా గెలిచి చరిత్రకెక్కిన పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి అవకాశం కల్పించడం ద్వారా అందరినీ ఆకర్షించారు. సాంబశివరాజు మరణించిన మరునాడే ఆయన తనయుడు పెన్మత్స సూర్యనారాయణ రాజు( సురేష్ )కి పదవీ అవకాశం జగన్ తీరు రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకునేలా చేసింది.

రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి అంటూ జగన్ పదే పదే చెబుతుంటారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు . మాట ఇచ్చాక ఇక వెనక్కి తగ్గేదేముంది... ఇది వైఎస్జగన్ నైజం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కానీ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇటీవల రాజ్యసభకు ఇద్దరు తన అనుంగు సహచరులను ఎంపిక చేయడం అందరికీ తెలిసిందే. మత్స్యకార, శెట్టిబలిజ సామాజికవర్గాలకు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎగువ సభకు ఎంపిక చేసి పిల్లి బోస్, మోపిదేవిని ఎంపీలుగా చేశారు. ఆ తర్వాత మండలికి గవర్నర్ కోటాలో రాయచోటికి చెందిన జకియా ఖానూమ్ కి అవకాశం ఇవ్వడం దానికి కొనసాగింపుగానే చెప్పాలి. తాను ఇచ్చిన మాట ప్రకారం, సామాన్య మైనార్టీ మహిళను మండలి సభ్యురాలిగా చేసిన జగన్ తీరుకి అందరూ హర్షం వ్యక్తం చేశారు.

మళ్లీ తాజాగా మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో అనేక మంది ఆశావాహులున్నప్పటికీ అందరినీ కాదని విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన డాక్టర్ పెన్మత్స సురేష్ కి ప్రాధాన్యతనిచ్చారు. సౌమ్యుడు , అందరివాడు అయిన సురేష్ బాబు వృత్తిరీత్యా దంతవైద్యుడు. విజయనగరంలో క్లినిక్ నడుపుతున్నారు. 2014లో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నెల్లిమర్లలో పోటీ చేసి పతివాడ నారాయణ స్వామి నాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పటికే అసెంబ్లీలో పలువురు వైద్యులకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన జగన్ మండలిలో కూడా విద్యావంతుడైన వ్యక్తిని ఎంపిక చేయడం గమనార్హం.

రాజకీయ వారసత్వంతో పెద్దల సభలో అడుగుపెడుతున్న సురేష్‌ కి మంచి భవిష్యత్ ఉండాలని అంతా ఆశిస్తున్నారు. వాస్తవానికి ఆయన తండ్రి సాంబశివరాజు ఏకంగా నాలుగున్నర దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో అనేక మందికి రాజకీయ పాఠాలు నేర్పిన దురందరుడిగా పేరుంది. అయినప్పటికీ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఆయనకు అవకాశం దక్కకపోయినా వైఎస్సార్ వెంట నిలిచారు. ఆ తర్వాత కూడా జగన్ కి తోడుగా సాగారు. జిల్లాలో పార్టీకి తొలి కార్యకర్త ఆయనే. ఓదార్పు యాత్రకు జగన్ తొలిసారిగా విజయనగరం వచ్చినపుడు మొట్టమొదట ఆహ్వానించింది, ఒక తండ్రి మాదిరిగా ఆహ్వానించి జిల్లాలో ఊరూరూ నడిపించి పార్టీకి ప్రాణం పోశారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరాజుకి కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. ఆ స్థాయిలో జగన్ పెద్దాయన పట్ల అభిమానాన్ని ప్రదర్శించిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ సాంబశివరాజు వయోభారంతో 87 ఏళ్ల వయసులో మరణించడంతో ఆయన తనయుడికి తగిన స్థానం కట్టబెట్టినట్టు విజయనగరం జిల్లా నేతలంతా భావిస్తున్నారు. మరోసారి జగన్ తన వెంట ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎంపిక చేసి న్యాయం చేస్తారనే అభిప్రాయాన్ని నిలబెట్టుకున్నారు. సాంబశివరాజు కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క రోజుల్లోనే మాటను నెరవేర్చారు. రాజకీయంగా తాను చెప్పే మాటలను ఆచరించి చూపడం ద్వారా అభిమానుల విశ్వాసం మరింత ధృఢపరిచినట్టుగా భావించవచ్చు.

ఇక వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్న సురేష్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. రాజ్యసభ బరిలో వర్ల రామయ్యను దింపి చేతులు కాల్చుకున్న తర్వాత టీడీపీ దూరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డాక్టర్ సురేష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇక లాంఛనంగానే చెప్పవచ్చు. 2023 మార్చి చివరి వరకు సురేష్ బాబు పదవిలో ఉంటారు. కాగా ఈనెల 24న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు 13 తేదీ లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లా నుంచి ఎమ్మెల్యేల కోటాలో కొత్తగా ఎమ్మెల్సీ రావడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp