శాశ్వతంగా నిలిచిపోనున్న జగన్ ‘రాజ’ముద్ర

By Kiran.G Aug. 01, 2020, 07:00 am IST
శాశ్వతంగా నిలిచిపోనున్న జగన్ ‘రాజ’ముద్ర

లక్ష్యానికి గురిపెట్టి బాణాన్ని సంధించినవాడే విజేతగా నిలుస్తాడు. సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ అభివృద్దే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా తొలి విజయం సాధించారు. తద్వారా ఏపీ రాజకీయాలపైన, పరిపాలన మీద ఆయన తనదైన, శాశ్వత ముద్ర వేయనున్నారు.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటం గవర్నమెంట్ కి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పునర్నియమించే విషయంలో జగన్ కు తప్పనిసరి పరిస్థితులు, ఎదురుదెబ్బలు తగిలాయంటూ ప్రతిపక్షాలు తెల్లవారుజాము నుంచి ఒకటే ప్రచారం చేస్తున్నాయి. ఇది సర్కారుకు కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. అయితే అంతకన్నా పెద్ద అంశమైన రాజధాని మార్పుకు సంబంధించి గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయాన్ని పొందటం ద్వారా జగన్ ప్రభుత్వం అపొజిషన్ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చింది.

అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట

అభివృద్ధి అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకూడదని, రాష్ట్రం మొత్తం విస్తరించాలని వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ చెబుతూనే ఉంది. పవర్ లోకి రాగానే దానికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. కానీ మెయిన్ అపొజిషన్ పార్టీ అయిన తెలుగుదేశం అడ్డుపుల్లలు వేసింది. రాజధానిని అమరావతిలో నిర్మించటం ద్వారా దాన్ని కేవలం రెండు (కృష్ణా, గుంటూరు) జిల్లాలకే పరిమితం చేయాలని విశ్వప్రయత్నం చేసింది. జగన్ ప్రభుత్వం శాసన సభలో ఆమోదించి పంపిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను శాసన మండలిలో పాస్ కాకుండా టీడీపీ అడ్డుకుంది. పైగా రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందంటూ అడ్డగోలుగా వాదిస్తూ వస్తోంది. దానికి సుజనా చౌదరి వంటివారు వంత పాడటం గమనార్హం. టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఆయన బీజేపీ అభిప్రాయానికి విరుద్ధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం తన స్టాండ్ ను మార్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది. దీంతో తెలుగుదేశం పార్టీ కుట్రలు పటాపంచలయ్యాయి.

ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు

ఇప్పటికే గ్రామ వాలంటీర్ల వంటి డైనమిక్ వ్యవస్థను రూపొందించి, విజయవంతంగా అమలుచేస్తూ జగన్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోంది. గవర్నమెంట్ ను గ్రౌండ్ లెవల్ కి తీసుకెళ్లింది. ఇక మూడు రాజధానులను నిర్మించటం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో విజయం సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ పాలనలోనూ అంతే వేగంగా దూసుకుపోతోంది. మూడు రాజధానుల ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఆ ప్రకటనను కార్యరూపంలోకి తీసుకురావటానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయనుంది. ఇలాంటి వినూత్న నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రను జగన్ తిరగరాయనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ పార్టీలకు నూకలు చెల్లినట్లేనా?

మూడు రాజధానుల ఆలోచనను టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రజల మద్దతు లేని ఈ ప్రతిపక్షాలు ఈ విషయంలో గుడ్డిగా ముందుకెళుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కేవలం ఒక ప్రాంతమే డెవలప్ కావాలని జనం కూడా కోరుకోరు. కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా అపొజిషన్ పార్టీలు వ్యవహరిస్తుండటం వల్ల భవిష్యత్ లో వాటి ఉనికి ప్రశ్నార్థకం కానుందనే అంచనాలు నెలకొన్నాయి. ఒక సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడేందుకే ఆ పార్టీలన్నీ టీడీపీ దారిలో నడుస్తున్నాయి. బీజేపీ మాత్రం కాస్త ఆలోచించి ముందడుగు వేస్తోంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు న్యాయం జరిగేలా పోరాడతామంటోంది. కాబట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లభించొచ్చని అంటున్నారు.

ప్రజలకు లబ్ధి కోసమే సీఎం తాపత్రయం

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనైనా, మూడు రాజధానుల నిర్మాణం పట్ల అయినా ముఖ్యమంత్రి జగన్ తాపత్రయం అంతా ప్రజలకు లబ్ధిచేకూర్చటంపైనేనని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసి, కేంద్రం నుంచి నిధులు రాకుండా చేశారనే సీఎం నిమ్మగడ్డపై ఆగ్రహం వ్యక్తం చేశారు తప్ప మరొకటి కాదని గుర్తుచేస్తున్నారు. చివరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ ఆయన్నే నియమించటం ద్వారా జగన్ తన నిజాయితీని నిరూపించుకున్నారని వివరిస్తున్నారు. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల పేదలకు ఆర్థికంగా అండగా నిలవటంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తమ పార్టీ అధినాయకుడు పట్టించుకోకుండా ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని అంటున్నారు. మెజారిటీ మీడియా, అపొజిషన్ పార్టీలు అదే పనిగా అబద్ధాలు ప్రచారం చేసినా నిజానిజాలేంటో జనానికి తెలుసని చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp