Jamili elections -జమిలీ ఎన్నికలకు వచ్చే మే తర్వాతనే స్పష్టత, ఎందుకలా

By Raju VS Oct. 19, 2021, 03:00 pm IST
Jamili elections -జమిలీ ఎన్నికలకు వచ్చే మే తర్వాతనే స్పష్టత, ఎందుకలా

దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ మూడేళ్లుగా సాగుతోంది. మొదట్లో కొన్నాళ్ళ పాటు మోడీ అండ్ కో చాలా ఆసక్తి ప్రదర్శించినట్టు కనిపించింది. కానీ మళ్లీ ఎందుకో మౌనంగా ఉన్నారు. ఇటీవల జమిలీ ఎన్నికలు పెద్దగా చర్చల్లోకి రావడం లేదు. అయితే 2022లో జమిలీ ఎన్నికల నిర్వహణ విషయమై గతంలోనే కేంద్రం వివిధ పార్టీల అభిప్రాయాలు కోరింది. అత్యధికులు వాటిని బలపరిచారు. కొన్ని పార్టీలు అభ్యంంతరాలు పెట్టినా జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ మనసులో మాటకే మొగ్గు దక్కింది. దాంతో 2022లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, పార్లమెంట్ ఎన్నికలు కూడా అనివార్యమనే ప్రచారం జరిగింది. శాసనసభల కాలపరిమితి ముగియనప్పటికీ ముందస్తుగా ఎన్నికలు నిర్వహిస్తారని, ఆనాటికి గడువు ముగిసిన సభలను కూడా కలుపుకుని ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలకు వెళతారనే అభిప్రాయం బలపడింది.

కానీ తీరా చూస్తే గడిచిన రెండేళ్లుగా కేంద్రం పెద్దల్లో గానీ, అధికార బీజేపీలో గానీ జమిలీ మాట పెద్దగా వినిపించడం లేదు. దానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం దేశంలో పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. ఆర్థికంగానూ, సామాజికంగానూ , రాజకీయంగానూ అధికార పార్టీకి అననుకూల వాతావరణం ఏర్పడింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీకి ఆశాభంగం తప్పడం లేదు. బెంగాల్ వంటి రాష్ట్రాలపై భారీ ఆశలు పెట్టుకున్నా అవన్నీ అడియాశలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ నాయకత్వం మీద బీజేపీ నేతల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా సత్యపాల్ మాలిక్ వంటి వారు గవర్నర్ హోదాలో ఉండి కూడా మోడీ తీరు మీద పరోక్ష విమర్శలు గుప్పించడం చర్చనీయాంశం అవుతోంది. ఆయనకు ముందు ఎడ్యూరప్ప, హర్యానాకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు కూడా మోడీని నమ్ముకుంటే ఈసారి గట్టెక్కలేమనే రీతిలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read : 3 Capitals - Centrel Minister Ramdas -మూడు రాజధానులపై రాందాస్ వ్యాఖ్యలు టీడీపీ నేతలనెందుకు కలవరపరుస్తున్నాయి

ఇలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికల ఆలోచన కేంద్రం ఉపసంహరించుకున్నట్టేనా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు మోడీ నాయకత్వం పట్ల జనంలో ఆదరణ తగ్గుతుండడంతో ఎన్నికలు ఎదుర్కోవడం కష్టమేననే అంచనా ఉంది. అలాంటి సమయంలో ఎన్నికలకు మోడీ సిద్దమవుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కానీ బీజేపీ జాతీయ నేతలు మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రైతు ఉద్యమం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యల మూలంగా కొంత ప్రజాగ్రహం ఉందని గ్రహిస్తూనే భావోద్వేగాలు రగిలిస్తే జనంలో చర్చనీయాంశాలు మారిపోతాయని ఆశిస్తోంది. దానికి అనుగుణంగా త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఆసరగా చేసుకుంటోంది. ప్రధానంగా యూపీలో గెలవడం బీజేపీకి అత్యవసరం. మినీ పార్లమెంట్ ఎన్నికలుగా భావించే యూపీలో గెలిస్తేనే రాజ్యసభలో పట్టు దొరుకుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన వారికి అవకాశం వస్తుంది. కాబట్టి యూపీని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

యూపీలో బీజేపీ విజయం సాధిస్తే జమిలీ దిశగా అడుగులు వేగవంతం కావడం ఖాయమనేది ఢిల్లీ వర్గాల్లో సాగుతున్న చర్చ. యూపీ ఫలితాల ఆధారంగా తదుపరి పరిణామాలుంటాయనడంలో సందేహం లేదు. కానీ యూపీలో ఆశించిన విజయం దక్కితే బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో వ్యవహరిస్తుందని, దానికి అనుగుణంగా వేగంగా పావులు కదుపుతుందని అంచనా. దాంతో వచ్చే మే తర్వాత మాత్రమే దానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణాలో కేసీఆర్ వంటి ముందస్తు ఎన్నికలు లేవని చెబుతూనే నవంబర్ లో తన పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. భారీ జనసమీకరణతో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ ఎటువంటి ఎన్నికలు లేకపోయినా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం వెనుక ముందస్తు జాగ్రత్తలున్నట్టు కనిపిస్తోంది. ఇక ఏపీలో సీఎం జగన్ కూడా ఇప్పటికే క్యాబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కు సన్నద్ధం కావాలని కూడా చెప్పేశారు. దాంతో ప్రాంతీయ పార్టీల నేతలే అన్నీ సర్థుకుంటున్న తరుణంలో మోడీ- అమిత్ షా బృందం అడుగులు ఎటు ఉంటాయనేది ఆసక్తికరమే.

Also Read : Telangana 2023 Elections -తెలంగాణ‌లో ‘ముందస్తు’ యుద్ధం..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp