సినిమా వాళ్లు చ‌ట్టానికి అతీతులా?

By G.R Maharshi Nov. 25, 2021, 02:10 pm IST
సినిమా వాళ్లు చ‌ట్టానికి అతీతులా?

సినిమా టికెట్టు ధ‌ర‌లు , షోల‌పై నియంత్ర‌ణ జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం క‌రెక్టే. పెద్ద హీరోల సినిమా టికెట్లు ఇష్ట‌మొచ్చిన ధ‌ర‌ల‌కి అమ్మ‌డం, బెన్‌ఫిట్ షో పేరుతో అద‌న‌పు ఆట‌లు వేయ‌డం అంద‌రికీ తెలుసు. ఇదంతా నిర్మాత‌ల‌కి చేరే సొమ్ము త‌ప్ప‌, ప్ర‌భుత్వానికి వ‌చ్చేదేమీ లేదు. హీరోల విప‌రీత రెమ్యున‌రేష‌న్ వ‌ల్ల మొద‌టి వారంలో ఇలా చేయ‌క‌పోతే న‌ష్ట‌పోతామ‌ని నిర్మాత‌ల వాద‌న‌. అది వాళ్ల స‌మ‌స్య త‌ప్ప ప్ర‌జ‌ల‌ది, ప్ర‌భుత్వానికి కాదు. ఈ ప‌రిణామం వ‌ల్ల హీరోల రేట్లు త‌గ్గితే ప‌రిశ్ర‌మ‌కి మంచిదే.

జ‌నం సినిమా చూడ‌కుండా ఉండ‌లేరు. పెద్ద హీరోల సినిమాల‌కి ఎక్కువ డ‌బ్బులు బ్లాక్‌లో పెడ‌తారు. హీరోల అభిమానుల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు, ఆటో డ్రైవ‌ర్లు, హోట‌ల్ కార్మికులు ఇలా చిన్న‌చిన్న ఆదాయాల వాళ్లు. అంతే త‌ప్ప తొలిరోజు డ‌బ్బులు స‌మ‌ర్పించుకునే వాళ్ల‌లో సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్లు, డాక్ట‌ర్లు వుండ‌రు.

అభిమానులు త‌మ క‌ష్టార్జితాన్ని సినిమా కోసం ఖ‌ర్చు పెడ‌తారు. మ‌రి క‌రోనా వ‌ల్ల ఈ అభిమానులంతా క‌ష్టాల‌తో , ఆక‌లితో వున్న‌ప్పుడు తెర మీద క‌బుర్లు చెప్పే మ‌న హీరోలు ఎంత మంది ముందుకొచ్చి ఆదుకున్నారు? సోనూసూద్ చేసిందాంట్లో ప‌దో వంతు సాయ‌మైనా చేశారా? క‌నీసం సినిమా కార్మికుల‌నైనా బ‌తికించారా? ఇటీవ‌ల చ‌నిపోయిన పునిత్‌రాజ్‌కుమార్ పేద పిల్ల‌ల చ‌దువుల కోసం చేసిన ప‌నుల్లో ఐదు శాత‌మైనా మ‌న హీరోలు చేశారా? పోనీ జ‌గ‌న్ చేస్తున్న మంచి ప‌నుల‌కి ఎప్పుడైనా స‌హ‌కారం అందించారా? స్కూళ్ల రూపురేఖ‌లు మార్చే నాడు-నేడు కార్య‌క్ర‌మం కింద ఎవ‌రైనా 4 స్కూళ్లు ద‌త్త‌త తీసుకున్నారా?

ప్ర‌జ‌ల మీద ప్రేమ‌, స‌మాజంపైన కొంచెం కూడా అవ‌గాహ‌న లేని వీళ్ల సంప‌ద పెంచ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సొమ్ము దోచిపెట్టాలా? చూసీచూడ‌న‌ట్టు ఊరుకోవాలా?

దోపిడీ అరిక‌ట్ట‌డానికి పూనుకోవ‌డం క‌క్ష సాధింపా?

సినిమా వాళ్లు ప్ర‌భుత్వానికి దారుణంగా ప‌న్నులు ఎగ్గొడుతున్నార‌ని మొద‌ట ప‌సిగ‌ట్టింది ఎన్టీఆర్‌. ఆయ‌న అక్క‌డి నుంచి వ‌చ్చారు కాబ‌ట్టి అన్నీ తెలుసు. శ్లాబ్ సిస్టం పెట్టాడు. అప్పుడు క‌క్ష సాధింపు అని ఎవ‌రూ అన‌లేదు క‌దా!

సినిమా వాళ్లు తెర‌మీద దేవ‌త‌లు కావ‌చ్చు. జీవితంలో వాళ్లూ సాధార‌ణ ప్ర‌జ‌లే. వాళ్ల‌కోసం ప్ర‌త్యేక చ‌ట్టాలుండ‌వు. అన్ని నిబంధ‌న‌ల్ని పాటించాల్సిందే. జ‌గ‌న్ ఏం చేసినా గుండెలు బాదుకోవ‌డం మానేసి వాస్త‌వాల్ని వాస్త‌వాలుగా అంగీక‌రించండి.

Also Read : Ap Govt ,Online Tickets - ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. అందరికీ అందుబాటులో సినిమాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp