పవర్ స్టార్ పయనంపై పెదవి విరుపు

By Kranti Nov. 28, 2020, 09:00 am IST
పవర్ స్టార్ పయనంపై పెదవి విరుపు

జనసేనాని గమ్యమేంటో జనాలకు అర్థంకాని స్థితి నెలకొంది. పూటకో మాటకో మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ పరిణతిగల రాజకీయనేత అనిపించుకోలేకపోయారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తుకు ప్రయత్నించి విఫలమైనా తమ మద్దతు మాత్రం కమలం పార్టీకే అని చెప్పి కేంద్రం ముందు విదేయతను చాటుకున్నారు. పార్టీ ప్రయోజనం కంటే జాతి హితమే ముఖ్యమని ప్రకటించారు. కానీ పవన్ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమైంది. సొంత పార్టీ కార్యకర్తలు అధినేత పట్ల ఆగ్రహాన్ని ప్రకటించకపోయినా... సినీ ప్రముఖులు మాత్రం పవన్ తీరును తప్పుబడుతున్నారు. రాజకీయాల్లో పవన్ నడక పట్ల పెదవి విరుస్తున్నారు. తాజాగా ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు.

జనసేన మొదటి నుంచీ తాను నిలదొక్కుకునేందుకు చేసిన ప్రయత్నాల కంటే సోదర పార్టీల సేవలోనే మునిగింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి అధికారాన్ని అప్పగించింది. 2019లో ఆంధ్రప్రదేశ్ పోటీచేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తారా అంటే అదీ కనిపించడం లేదు. బీజేపీని మెప్పించడంపై పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధపడకుండా బీజేపీని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునివ్వడంతో జనసేన పయనమెటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

హీరోగా మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ఇంకా తప్పటడుగులే వేస్తున్నాడని అనిపిస్తోంది. తాజాగా ప్రకాశ్ రాజ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌కు ఏమైందో అర్థం కావట్లేదంటూ వ్యాఖ్యానించారు. 'నువ్వొక లీడర్ మీకొక పార్టీ ఉంది. అయినా ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి?' అని ప్రశ్నించారు. 2014లో బీజేపీ వాళ్లు అద్భుతం అన్న ఆయనే 2019లో ద్రోహులంటూ విమర్శించారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు వాళ్లే నాయకులెలా అయ్యారని ప్రశ్నించారు. ఇలా పదే పదే రంగులు మార్చడం చూస్తుంటే ఊసరవిల్లిలా కనిపిస్తున్నాడని కామెంట్ చేశారు.

నిజానికి ప్రకాశ్ రాజ్ బహిరంగంగా ఈ మాట మాట్లాడినా.... చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖుల మనసులో మాట కూడా ఇదే. ఐతే... ప్రకాశ్ రాజ్ పవన్ వైఖరి పట్ల మాత్రమే కాదు, బీజేపీ మీద భవిష్యత్తుపై కూడా కామెంట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయని, అలాంటి పార్టీలను నమ్మొద్దని తెలంగాణ ప్రజలను కోరారు. నిజానికి ప్రకాశ్ రాజ్ ఒక సినీ నటుడుగా ఈ కామెంట్స్ చేయలేదు. తనకంటూ స్పష్టమైన రాజకీయాభిప్రాయాలు కలిగి ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరిచగలిగారు. బీజేపీతో జనసేన జోడి పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పవర్ స్టార్ వీటిని సీరియస్ గా తీసుకుంటాడో లేదో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp