"చిప్కో" సుందర్ లాల్ బహుగుణ మృతి

By Rishi K May. 22, 2021, 07:24 am IST
"చిప్కో" సుందర్ లాల్ బహుగుణ మృతి

పర్యావరణ వేత్త చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కరోనాతో కన్ను మూశారు ఆయన వయస్సు 93 సంవత్సరాలు. ఆయనకు కరోనా నిర్దారణ కావడంతో ఈ నెల 8న రిషికేశ్ లో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 12న ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలడంతో వైద్యులు చికిత్స అందించి సుందర్లాల్ బహుగుణను కాపాడేందుకు చికిత్స అందించారు. కాగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

ఎవరీ సుందర్లాల్ బహుగుణ?

పర్యావరణ వేత్తగా గుర్తింపు పొందిన సుందర్ లాల్ బహుగుణ 1927 జనవరి 9న ఉత్తరాఖండ్లోని లోని తెహ్రిలో జన్మించారు. 13 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయ ప్రవేశం చేసిన ఆయన 1956లో వివాహం తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. వివాహం అనంతరం 1960 నుంచి పర్యావరణ సంరక్షణ పై దృష్టి సారించారు. 1973 లో ఉత్తరాఖండ్ లో ఆయన ముందుకు నడిపిన చిప్కో ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

చిప్కో ఉద్యమం

చిప్కో అనే పదానికి అర్థం హత్తుకోవడం ఆలింగనం చేసుకోవడం అని అర్థం.. ఈ ఉద్యమం ఊపిరిపోసుకోవడానికి ప్రధాన కారణం అప్పటి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 300 చెట్లను నరకడానికి అనుమతులు ఇవ్వడమే.. అప్పటికే విచ్చలవిడిగా చెట్లను నరుకుతుండడంతో ప్రకృతి సమతౌల్యం లోపించి అలకనంద నదికి వరదలు రావడం వల్ల ఆ నదీ పరివాహక ప్రాంతంలో చాలా నష్టం జరిగేది. దీంతో ప్రజల్లో ప్రకృతిని రక్షించాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో చెమోలి జిల్లాలోని గోపేశ్వర్ ప్రాంతంలో చెట్లను 300 చెట్లను నరికేందుకు సైమన్ అనే బ్యాడ్మింటన్ రాకెట్లు తయారు చేసే కంపెనీ ఆనాటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

చెట్లను నరకడానికి అధికారులు వస్తున్నారన్న వార్త రావడంతో అక్కడి మహిళాసంఘం నాయకురాలు గౌరవ్ దేవి చెట్లను నరకడాన్ని అడ్డుకున్నారు. అధికారులు ఎంత ప్రయత్నం చేసినా గౌరవ్ దేవి వెనకడుగు వేయలేదు. దీంతో బలవంతంగా చెట్లను నరికేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకోవడానికి గౌరవ్ దేవి ఆధ్వర్యంలో స్త్రీలంతా చెట్లను కౌగలించుకొని చెట్లతో పాటు మమ్మల్ని కూడా నరకమని ఉద్యమించడంతో అధికారులు వెనకడుగు వేయక తప్పలేదు. ఈ వార్త దానావలంలా వ్యాపించింది.

అనంతరం సుందర్ లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చిప్కో ఉద్యమం పూర్తి స్థాయిలో ఊపందుకుంది. చెట్లను ప్రకృతిని కాపాడేందుకు చిప్కో ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునివ్వడంతో పాటు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 1981-83 మధ్యకాలంలో సుందర్ లాల్ బహుగుణ హిమాలయాల్లో 5000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చిప్కో ఉద్యమం విజయవంతం కావడానికి తీవ్రస్థాయిలో కృషి చేసారు. ఆయన ఆధ్వర్యంలోనే చిప్కో ఉద్యమానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. ప్రకృతిని చెట్లను కాపాడాలన్న ఆయన కృషి పట్టుదల ముందు ప్రభుత్వమే దిగి వచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చెట్ల నరికివేతను 15 సంవత్సరాలపాటు నిషేధిస్తూ చట్టం చేసిందంటే ఆయన ఉద్యమాన్ని నడిపించిన తీరు అర్థం చేసుకోవచ్చు..

Anti Their Dam ఉద్యమం..

భగీరధి నదిపై తెహ్రి డ్యామ్ నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సుందర్ లాల్ బహుగుణ anti tehri dam movement కి పిలుపునివ్వడంతో పాటు 1995 లో 45 రోజుల పాటు నిరాహారదీక్షకు దిగడంతో ప్రధాని పివి నరసింహారావు తెహ్రి డ్యామ్ నిర్మాణం వల్ల ప్రకృతికి కలిగే నష్టాలను ప్రభుత్వానికి తెలిపేందుకు రివ్యూ కమిటీని నియమించారు. దీంతో ఆయన నిరాహారదీక్ష విరమించారు. అనంతరం తెహ్రి డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 74 రోజుల పాటు మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద మరోసారి దీక్షకు దిగారు. కానీ డ్యామ్ నిర్మాణాన్ని ఆపలేక పోయారు. 2001 లో డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న ఆయనను ప్రభుత్వం అరెస్టు చేసింది.

అవార్డులు:-

పర్యావరణ వేత్తగా ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సుందర్ లాల్ బహుగుణను అనేక అవార్డులు వరించాయి. భారతదేశ ప్రభుత్వం 1981లో పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. 1986 లో జమ్నాలాల్ బజాజ్ అవార్డ్ దక్కగా 1987 లో చిప్కో ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు రైట్ లైవ్లీ హుడ్ అవార్డు ఆయనను వరించింది. 2009 లో పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలకు గాను భారత ప్రభుత్వం భారతదేశ రెండో అతిపెద్ద పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

కాగా సుందర్ లాల్ బహుగుణ మృతి భారత దేశానికి తీరని లోటని భారత ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. పర్యావరణ సంరక్షణ కు ఆయన చేసిన కృషిని కొనియాడిన ప్రధాని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుందర్ లాల్ బహుగుణ పర్యావరణ సంరక్షణకు ప్రకృతికి చేసిన సేవలు మరువలేనివి. చిప్కో ఉద్యమాన్ని నడిపించి విజయవంతం చేసిన తీరు ప్రజలందరికీ ఆదర్శనీయం అని చెప్పవచ్చు. ప్రకృతి సమతౌల్యంతో ఉంటేనే భావి తరాలు బాగుంటాయని నమ్మిన ఒక ఔత్సాహికుడు పర్యావరణ వేత్త కరోనాతో కన్నుమూయడం మనకే కాదు ప్రకృతికి కూడా తీరని లోటు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp