తిరుపతిలో ఎగిసిపడే భోగి మంటలు

చిన్నప్పటి కంటే సంక్రాంతిని నేను బాగా ఎంజాయ్ చేసింది తిరుపతిలో జాబ్ చేస్తున్నప్పుడే. తెల్లారి పేపర్ చదవాలంటే జర్నలిస్టులు రాత్రంతా పనిచేయాల్సిందే. రాత్రి ఒంటి గంటకు ఆంధ్రజ్యోతిలో డ్యూటీ ముగించి తిరుపతిలోకి వచ్చేసరికి (ఆఫీస్ రేణిగుంటలో) నిలువెత్తు భోగి మంటలు స్వాగతం పలికేవి. తమిళ సంస్కృతితో అనుబంధం ఉన్న వూరు కాబట్టి అడుగడుగునా భోగి మంటలుండేవి. ఆ మంటల ముందు చలి కాచుకుంటూ మిత్రులంతా కబుర్లు చెప్పుకోవడం అదో అనుభవం.
నేను చిన్నప్పుడు కర్నాటక సమీపంలోని రాయదుర్గంలో పెరగడం వల్ల అక్కడ సంక్రాంతి కంటే ఉగాది , దసరాలే పెద్ద పండుగలు. అయితే సంక్రాంతి అంటే సంబరం ఎందుకంటే దసరా తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే పండుగ ఇదే కాబట్టి అక్కడ భోగి రోజు సద్ద రొట్టెలు, నువ్వుల పొడి చేసేవాళ్లు. రాయలసీమలో భోగిరోజు నాన్ వెజ్ తినరు. అయితే చిత్తూరు జిల్లా వేరు. భోగిరోజు ఊరంతా మసాలా వాసనే. టిఫెన్‌కే ఇడ్లీ, వడ, దోసెల్లోకి మటన్. తెల్లారగానే నాన్‌వెజ్ తినడం అక్కడే అలవాటేంది. భోగి తర్వాత అలవాటు కొద్ది కనుమ రోజు కూడా నాన్వెజ్జే.
రాయదుర్గంలో ఎక్కడో తప్ప భోగి మంటలు వేసేవాళ్లు కాదు. భోగి ముందు రోజు పేడకి భలే డిమాండ్. అప్పట్లో కొన్ని వందల పశువులు ప్రతిరోజూ మేతకి అడవికి వెళ్లేవి. సాయంత్రం అవి ఇంటికి వస్తున్నప్పుడు పేడ కోసం పిల్లలు గంపలు పట్టుకుని వెంటపడేవాళ్లు. పేడనీళ్లతో ఇంటి ముందర అలికి గొబ్బెమ్మలు పెట్టేవాళ్లు. డబ్బులున్న వాళ్లు రంగుల ముగ్గులు పెట్టేవాళ్లు కానీ, మిగతా అందరూ మామూలు ముగ్గులే. ఇప్పుడు కూడా గొబ్బెమ్మలు, ముగ్గులు నడుస్తున్నాయి కానీ, పశువులు మాయమైపోయాయి.
సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ. రైతులు మెల్లిగా మాయమై అగ్రి ఫామ్స్, యంత్రాలు, కూలి వాళ్లు మాత్రమే మిగులుతారు. ఇదే ప్యూచర్. రైతుని నడిరోడ్డు మీద చలిలో కూచోపెట్టాం. కడుపు మంటకి భోగి మంటకి మించిన వేడి , రైతుని చల్లబరచకపోతే అన్నం పుట్టదు.
సంక్రాంతిని మా పల్లెలో జరుపుకున్న సందర్భాలు తక్కువ. దీపావళికి మాకు నోములు కాబట్టి, చాలా ఏళ్లు అప్పట్లో అక్కడ జరుపుకున్నాం. ఒకసారి (1971) అక్కడ జరుపుకున్నాం. మా తాత ఎద్దుల్ని శుభ్రంగా కడిగి మెడలో గంటలు వేసాడు. వూళ్లో అందరి పశువులు కళకళలాడుతూ కనిపించాయి.
ఈ మధ్య ఐదేళ్ల క్రితం ఊరెళితే పాల ప్యాకెట్లు తాడిపత్రి నుంచి కొని తీసుకుపోవాల్సి వచ్చింది. ఊళ్లో ఉన్న కాసిన్ని పాలు డెయిరీకి పోస్తారు. ముందుగా చెప్పక పోతే పాలు దొరకవు. ఊరంతా కలిపితే రెండు జతల ఎద్దులు, ఒక టైరు బండి ఉంది. బండిలో మా తాత ఒళ్లో కూచుని ఎద్దుల్ని అదిలించిన రోజులు అయిపోయాయి. కొత్త జనరేషన్‌కి వాటిని మ్యూజియంలో చూపాల్సిందే.
చిన్నప్పుడు శివరాత్రి, దీపావళి తప్ప మిగతావన్నీ మామూలు పండుగలే. సంక్రాంతికి కొత్త బట్టలు కుట్టించేవాళ్లు. టైలర్ చుట్టూ వందసార్లు తిరిగితే దయతో ఇచ్చేవాడు. సంక్రాంతి రోజు కుడుములు, ఓళిగలు, చిత్రాన్నం, వడియాలుండేవి. సాయంత్రం కొత్త సినిమా. రష్ ఎక్కువ ఉంటుందని 7 గంటల సినిమాకి 5 నుంచే రెడీ అయ్యేవాళ్లం. అందరూ ఓళిగలు ఫుల్‌గా వేసుంటారు కాబట్టి బాంబింగ్ తీవ్రంగా ఉండేది. ఒక చేత్తో ముక్కు మూసుకుని, సినిమా చూసేవాళ్లం.
కనుమ రోజు కోడి కోసేవాళ్లు. చికెన్ సెంటర్లు లేని కాలంలో కోడి చాలా లగ్జరీ. ఊరి బయట తోటల్లోకి వెళ్లి ముందుగానే తెచ్చి కట్టేసేవాళ్లు. మూడు నాలుగు రోజుల్లో దానితో అనుబంధం ఏర్పడేది. మసీదు దగ్గర సాయుబు కోస్తున్నప్పుడు దుక్కంగా ఉండేది. తిన్నప్పుడు రుచిగానే ఉండేది. ఆకలికి, మానవత్వానికి పొసగదని చిన్నప్పుడే అర్థమైంది.
సంక్రాంతికి బస్సులు, రైళ్లు ఎక్కి ఊరు చేరుకోవడం అప్పుడు లేదు. ఎందుకంటే అందరూ ఊళ్లలోనే ఉండేవాళ్లు. ఊరు ఇంకా బతికే ఉండేది. 1975 తర్వాత వలసలు తీవ్రమయ్యాయి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, పిల్లల చదువులు, నగరాల్లో అధిక కూలీలు, పట్టణీకరణ విశ్వరూపం అన్నీ కలిసి పల్లెని బక్కచిక్కేలా చేశాయి. సంక్రాంతికి పల్లెలోకి జీవం పరకాయ ప్రవేశం చేస్తుంది. పండుగ తర్వాత పల్లె ముసలిదై పోతుంది. శకలాలు శకలాలుగా నగరంలో కలిసిపోతుంది. రోజూ ఉండే కష్టాలు బాధల్ని మరిచిపోవడానికే పండగలు సృష్టించారు.
2020 సంక్రాంతి పండగకి రెండు సినిమాలు చూశాను. ఈ లోగా కరోనా వచ్చి జైళ్లోకి తోసింది. కొంచెం ఊపిరి పీల్చుకుని ఇక రాదులే అనుకున్నపుడు వచ్చి నరకం చూపించింది. మిత్రుడు డాక్టర్ మనోహర్ (కడప) చావకుండా బతికిచ్చాడు.
నిరాశలోంచి ఆశ పుడుతుంది. అమెరికా వచ్చాను. ఇక్కడ గొబ్బెమ్మలు లేవు. పశువులే కనపడవు. అవి మారువేషాల్లో ఉండి ఈ మధ్య కాపిటల్ భవనంపై దాడి చేశాయి. అన్ని దేశాల్ని తన ముగ్గులోకి దించే దేశంలో ముగ్గులుండవు. అమెరికా ముందు ఎవడైనా గంగిరెద్దులా తల ఊపాల్సిందే, హరిదాసులా కీర్తనలు పాడాల్సిందే. పండుగ రోజు వెళ్లడానికి టెంపుల్ ఉంది. అక్కడ మంత్రాలు తెలుగులోనే చదివినా దక్షిణ మాత్రం డాలర్లే. మనూళ్లో కోడి పందేలు ఆడుతారు. అమెరికా రెండు దేశాల మధ్య కోడి పందెం పెడుతుంది. సంక్రాంతి బాగా జరుపుకునేది మనం కాదు, అమెరికానే!


Click Here and join us to get our latest updates through WhatsApp