కవులలో సూపర్ స్టార్ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి

By Sannapareddy Krishna Reddy Aug. 08, 2020, 05:44 pm IST
కవులలో సూపర్ స్టార్ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి

చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి అంటే చాలామంది గుర్తు పట్టలేకపోవచ్చు కానీ తిరుపతి వెంకట కవులు అంటే సాహిత్య ప్రియులు ఇట్టే గుర్తు పడతారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో, ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో తన సహచరుడు దివాకర్ల తిరుపతి శాస్త్రితో కలిసి తెలుగు, సంస్కృత భాషల్లో అనేక కావ్యాలు, నాటకాలు రచించి, సంస్కృత కావ్యాలు తెలుగులోకి అనువాదం చేసి, తిరుపతి శాస్త్రి మరణం తరువాత వచన రచన కూడా చేశారు. అయితే ఆంధ్ర దేశమంతా తిరిగి వీరు చేసిన అనేక అవధానాలు కూడా ఉన్నాయి.

ఈ జంట కవులు నిల్చుని శతకం, కూర్చుని కావ్యం అల్లగలరని ప్రతీతి. అందుకు తగ్గట్టుగానే అవధాన సభల్లో ఏమాత్రం విరామం లేకుండా పృచ్ఛకులు అడిగిన సమస్యలకు అప్పటికప్పుడు గంగా ప్రవాహం లాగా ఆశువుగా పద్యాలు చెప్పేవారు.

బాల్యం, విద్యాభ్యాసం

ఆగస్టు 8,1870 న తూర్పు గోదావరి జిల్లా, కడియంలో జన్మించిన శాస్త్రిగారు యానాంలోనూ, తాడేపల్లిగూడెం వద్ద కడియద్ద గ్రామంలో బ్రహ్మయ్య శాస్త్రి వద్ద విద్య అభ్యసించి, ఆ తరువాత సంస్కృత వ్యాకరణం కాశీలో నేర్చుకుని తిరిగి వచ్చి అవధానాలు చేయాలని అనుకుంటుండగా గురువైన బ్రహ్మయ్య శాస్త్రి తన మరో శిష్యుడైన దివాకర్ల తిరుపతి శాస్త్రితో కలిసి జంటగా అవధానాలు చేయమని సూచించారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి తిరుపతి వెంకట కవులు అనే పేరుతో సాహితీ జైత్రయాత్ర మొదలుపెట్టారు.

అవధాన క్రీడ

తెలుగు వారికి ప్రత్యేకమైన అవధాన ప్రక్రియను అంతకుముందు కొందరు చేసి ఉన్నా దానిని పండితులకే అర్ధమయ్యే ప్రక్రియగా కాకుండా సామాన్యులు సైతం ఆస్వాదించగల క్రీడగా మార్చిన ఘనత మాత్రం తిరుపతి వెంకట కవులదే. 1891లో కాకినాడలో చేసిన శతావధానంతో మొదలుపెట్టి, తెలుగునేల నలుచెరగులా అనేక అష్టావధానాలు, శతావధానాలు చేసి, ఎందరో సంస్థానాధీశుల నుంచి బహుమతులు, సన్మానాలు పొందారు.

అంతకుముందు ఒక నిర్దిష్ట విధానం లేకుండా ఎవరికి నచ్చిన విధంగా వారు చేస్తూ ఉన్న అవధాన ప్రక్రియకు ఒక రూపం కల్పించి, అవధానం ఎలా ఉండాలో చూపించారు తిరుపతి వెంకట కవులు. అందులో సమస్యా పూరణం, దత్తపది లాంటి అంశాలను మెరుపు వేగంతో వీరు ఇద్దరూ చక్కని సమన్వయంతో పూరించడాన్ని పండిత పామరులు కూడా బాగా అస్వాదించారు.

అహం కూడా ఎక్కువే

పొట్టిగా, నల్లగా వినసొంపైన కంఠంతో వీనుల విందుగా పద్యం చదివే శాస్త్రి గారికి అహం కూడా కొంచెం ఎక్కువే. తమ పద్యాలలో ఎవరైనా తప్పులు చూపిస్తే శాస్త్రాలు, పురాణాల నుంచి ఉదాహరణలు ఉటంకించి తప్పు అన్నవారి చేతనే ఒప్పు అనిపించేవరకూ వదిలేవారు కాదు.

వీరికి సమకాలీనులు, జంటకవులుగా అవధానాలు చేస్తూ, గంటకు మూడు, నాలుగు వందల పద్యాలు చెప్పగలరు అని పేరు తెచ్చుకున్న కొప్పరపు కవులతో చాలా కాలం పోటీ నడిచింది. ఒకరినొకరు అధిక్షేపణ చేస్తూ, ఒకరి పద్యాలలో మరొకరు తప్పులు ఎత్తి చూపుతూ చాలా రోజులపాటు పోటీ పడ్డారు. అయితే స్పర్ధయా వర్ధతే విద్యా అన్నట్టు ఈ పోటీ వల్ల మంచి సాహిత్య సృష్టి జరిగింది.

కవులూ, బ్రాహ్మణులు అయి ఉండి మీసాలు ఉన్నందుకు చెళ్ళపిళ్ళ వారిని మొదట్లో అధిక్షేపణ చేసేవారు అందరూ. దానికి శాస్త్రి గారు పద్యరూపంలో సమాధానం చెప్పారు.

దోసమటంచు ఎరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీమీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగారోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీమీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.

మరో సందర్భంలో తమ వైభవం గురించి "ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము" అని చెప్పుకున్నారు.

పాండవ ఉద్యోగ విజయాలు

వీరి రచనలు అన్నిటిలో బాగా పేరు తెచ్చినవి "పాండవ ఉద్యోగము", "పాండవ విజయము" నాటకాలు. సినిమా, టీవీలు లేని రోజుల్లో తెలుగు నాట ప్రతి ఊరులోనూ ఈ నాటకాలు ప్రదర్శించారు. ఈ నాటకాలలోని పద్యాలు "జెండాపై కపిరాజు", "బావా ఎప్పుడు వచ్చితీవు", "అయినను పోయిరావలె హస్తినకు", "అలుగుటయే ఎరుగని మహామహితాత్ముడు", "చెల్లియో చెల్లకో" మొదలైన పద్యాలు నిరక్షరాస్యులు కూడా తప్పుల్లేకుండా పాడగలిగేవారు.

తన సహచరుడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు 1919లో మరణించాక చెళ్ళపిళ్ళ వారు అవధానం తగ్గించి, ప్రధానంగా వచన రచన వైపు తన దృష్టిని మరలించారు. తను ఒక్కడే చేసిన రచనలు కూడా తిరుపతి వెంకటీయం అని ఇద్దరి పేర్ల మీద ప్రచురించి, వచ్చిన పారితోషికంలో సగభాగం తిరుపతి శాస్త్రి గారి కుటుంబానికి అందజేశారు. అవిచ్ఛిన్నంగా సాహితీ సృష్టి చేస్తూ, విద్యార్థులకు తెలుగు బోధన చేస్తూ శేష జీవితం గడిపి 1950లో మరణించారు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు.

(చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి జయంతి సందర్భంగా)

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp