చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చిందా..?!

By Voleti Divakar Sep. 22, 2020, 03:41 pm IST
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చిందా..?!

కొన్నాళ్ల క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడించిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ దోపిడీలకు తెగబడిందా?. ఆవుననే అంటున్నారు పోలీసులు, స్థానిక ప్రజలు. రాజమహేంద్రవరం నగరంలో సోమవారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఈ మేరకు చెడ్డి గ్యాంగ్ కదలికలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స్థానిక వెంకటేశ్వరనగర్ లోని రెండు ఇళ్లల్లో చోరీకి ఈ గ్యాంగ్ విఫలయత్నం చేసింది. ఇందులో ఒకటి అదనపు ఎస్పీ ఇల్లు కావడం గమనార్హం.

హైదరాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ ముఠా దోపిడీకి ప్రయత్నించిన సంఘటన అక్కడి ప్రజలను నిద్ర లేకుండా చేసింది. అలాగే రాజనుహేంద్రవరం నగరంలోని వెంకటేశ్వరనగర్ లో ఏడాది క్రితం చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి ప్రయత్నించింది. విధుల్లో ఉన్న వాచ్ మెన్ తీరగబడి రాడ్ తో దాడి చేయడంతో గ్యాంగ్ సభ్యులు రాళ్ల రువ్వి పరారయ్యారు.

గామన్ వంతెనకు ఆనుకుని ఉన్న ఇళ్లల్లో కూడా చెడ్డీ గ్యాంగ్ దోపిడీ చేసేందుకు ప్రయత్నించింది. కుక్కలు మొరగడంతో దొంగలు పరారయ్యారు. ఏడాది తరువాత మళ్లీ ఈ ముఠా ప్రవేశించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు జాతీయ రహదారుల పక్కన ఉన్న ఇళ్లు, నిర్మానుష్యంగా ఉన్న కాలనీలను దోపిడీకి ఎంచుకుంటారు. ఇలాంటి ప్రాంతాల్లో దోపిడీ చేసి తప్పించుకోవడం సులువుకావడమే ఇందుకు కారణం. కేవలం నిక్కర్లు, డ్రాయర్లు ధరించి, ఒంటికి నూనె పూసుకుని అర్ధరాత్రి దాటిన తరువాత దోపిడీలకు బయలుదేరుతారు. దోపిడీకి అడ్డం వచ్చిన ఇంటి యజమానులు, వాచ్ మెన్లను వీరు ఏమాత్రం క్షమించరు. వారిపై విచక్షణారహితంగా దాడి చేస్తారు. కిరాతక చెడ్డీ గ్యాంగ్ ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చెడ్డీ గ్యాంగ్ ఆటకట్టించాల్సిన అవసరం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp