అరుణ భాస్కరుడు అస్తమించిన రోజు

By Sannapareddy Krishna Reddy Oct. 09, 2021, 09:00 pm IST
అరుణ భాస్కరుడు అస్తమించిన రోజు

అక్టోబర్ 9,1967న బొలీవియా దేశంలో లా హిగేరా అని ఒక మారుమూల పల్లెలోని, పాడుబడిన పాఠశాలలో అంతకుముందు రోజు, అమెరికా సిఐఎ దళాలతో కలిసి బొలీవియా సైన్యం చేసిన దాడిలో పట్టుబఢి బందీగా ఉన్న చే గెవారా తన దగ్గరకి తుపాకీ పట్టుకుని వచ్చిన బొలీవియా సైనికుడు సార్జెంట్ మేరియో టెరాన్ కళ్ళలోకి సూటిగా చూసి, పైకి లేచి నిలబడి , "నన్ను చంపడానికే నువ్వు వచ్చావని నాకు తెలుసు. కాల్చరా పిరికిపందా! ఇప్పుడు మీరు చంపుతున్నది ఒక మనిషిని మాత్రమే" అన్నాడు ఎటువంటి భయమూ లేకుండా.

బంధించి కాల్చినట్టు కాకుండా ఎదురు కాల్పుల్లో మరణించినట్లు కనిపించాలి అని బొలీవియా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో, తల మీద కాల్చొద్దని టెరాన్ కి అతని పై అధికారులు చెప్పారు. దాంతో టెరాన్ చే చేతులు, కాళ్ల మీద కాల్పులు జరిపాడు. బాధను అణచుకోవడానికి అరచేతిని పళ్ళమధ్య పెట్టుకుని కూలిపోయిన చే కడుపు, ఛాతీలో మరోసారి కాల్పులు జరిపి, చే మరణించిన విషయం ధృవీకరణ చేసుకుని ఆ సంగతి తన పై అధికారులకు తెలియజేయడానికి ఆ గుడిసె నుంచి బమటకు వెళ్ళాడు టెరాన్.

అర్ధరాత్రి దాటాక స్థానిక కాలమానం ప్రకారం ఒంటి గంటా పది నిమిషాలకు, తొమ్మిది బుల్లెట్ గాయాలతో చే మరణ వార్త బొలీవియా ప్రభుత్వ అధినేతలకు చేరింది. చే మరణం విషయంలో అనుమానాలకు తావులేకుండా ఉండాలని సాక్ష్యంగా అతని రెండు చేతులు నరికి, ప్రభుత్వ అధ్యక్షుడు రెనే బారియెంటోస్ కి పంపి, చే శరీరాన్ని రహస్యంగా ఖననం చేశారు.

విద్యార్థి దశలో వామపక్ష భావజాలంతో పరిచయం

1928లో దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా దేశంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించిన చే పూర్తి పేరు ఎర్నెస్ట్ రాఫేల్ గెవారా డి లా సెర్నా. వైద్య విద్యార్దిగా ఉండగా ఒకసారి సెలవుల్లో మోటారు సైకిల్ మీద దక్షిణ అమెరికా మొత్తం విస్తృతంగా పర్యటించిన చేకి ఎక్కడ చూసినా పేదరికం, ఆకలి, అవిద్య, అణగారిన వర్గాల మీద అణచివేత కనిపించాయి. అమెరికా చేతిలో కీలుబొమ్మల్లాంటి నియంతల పాలన ఇందుకు కారణమని అతనికి అర్ధమైంది.

1953లో వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత లాటిన్ అమెరికాలో తన పర్యటనలు కొనసాగించాడు చే. ఈ క్రమంలోనే మెక్సికోలో క్యూబా విప్లవ వీరులు ఫిడెల్ కాస్ట్రో, రాల్ కాస్ట్రో సోదరులతో పరిచయమైంది. క్యూబా నియంత బటిస్టాకి వ్యతిరేకంగా కాస్ట్రో సోదరులు చేస్తున్న పోరాటంలో భాగమయ్యాడు చే. 1959లో అమెరికా చేతిలో కీలుబొమ్మ ఫుల్జెన్షియో బటిస్టాని కూలదోసిన తర్వాత ఏర్పడిన ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వంలో పరిశ్రమల శాఖా మంత్రిగా, కాస్ట్రో కుడిభుజం లాగా కొన్ని రోజులు గడిపాడు.


కాంగో, బొలీవియా దేశాల్లో గెరిల్లా పోరాటం

ఫిడెల్ కాస్ట్రో అనుసరిస్తున్న కొన్ని విధినాలు నచ్చక ఏప్రిల్ 1965లో రాజీనామా చేశాడు చే. ఆ తర్వాత కొన్ని రోజులు ఎవరికి కనిపించకుండా మాయమైన చే 1965 నవంబరులో ఆఫ్రికా దేశమైన కాంగోలో ప్రత్యక్షమయ్యాడు. మావోయిస్టు సిద్ధాంతాలను అనుసరిస్తూ అధికారం కోసం పోరాడుతున్న పక్షంతో చేతులు కలిపాడు. అయితే ఒక సంవత్సరం అక్కడ గడిపాక "సింబా"అని తమని తాము పిలుచుకునే ఆ మావోయిస్టు గ్రూపులో క్రమశిక్షణ ఏమాత్రం లేకపోవడం, తాను ఎంత ప్రయత్నించినా వారి పద్ధతిలో మార్పు రాకపోవడంతో కాంగోని వదిలిపెట్టి కొంతకాలం యూరోపులో గడిపాడు. ఈ సమయంలో స్పెయిన్ దేశంలో ప్రవాస జీవితం గడుపుతున్న అర్జెంటీనా మాజీ అధ్యక్షుడు జువాన్ పెరోన్ ని కలిశాడు. సాయుధ పోరాటం ద్వారా లాటిన్ అమెరికా దేశాలు అన్నింటినీ సోషలిస్టు పాలన కిందకు తీసుకు రావాలన్న తన ప్రణాళిక గురించి అతనితో చర్చించాడు. అయితే ఇది సాధ్యం కాదని, అమెరికా ప్రభుత్వం దీనిని కచ్చితంగా అడ్డుకుంటుందనీ హెచ్చరించాడు పెరోన్.

పెరోన్ హెచ్చరికలను పట్టించుకోని చే తన వేషం, పేరు మార్చుకుని నవంబర్, 1966లో బొలీవియా చేరుకున్నాడు. రాజధాని నగరం లా పాజ్ ని వదిలి పెట్టి, గ్రామీణ ప్రాంతాల్లో యాభై మంది అనుచరులతో 'బొలీవియా జాతీయ విమోచన సైన్యం' పేరిట ఒక దళాన్ని ఏర్పాటు చేశాడు. తనకి ఉన్న పరిచయాలతో ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుని గెరిల్లా ఎత్తుగడలతో 1967వ సంవత్సరం ప్రారంభంలో బొలీవియా సైన్యం మీద విజయాలు సాధించాడు. అప్పుడు బొలీవియా ప్రభుత్వానికి అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏ తోడయింది. అప్పటికే పక్కలో బల్లెంలాగా క్యుబాలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వానికి తోడు లాటిన్ అమెరికాలో మరొక కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం ఇష్టంలేని అమెరికా ప్రభుత్వం చేని ఓడించడానికి బొలీవియా ప్రభుత్వానికి అన్ని రకాల సహాయం అందజేసింది.


సిఐఏ స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్ అధ్యక్షుడు ఫెలిక్స్ రోడ్రిగ్వెజ్ బొలీవియాలో తిష్ట వేసి చేని ఓడించే పనిలో పడ్డాడు. 1969 నవంబర్ 7న చే యూరో అనే పర్వత ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందుకున్న బొలీవియా సైన్యం మరుసటి రోజు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, కాసేపు ఎదురు కాల్పులు తర్వాత చేని బంధించింది. కోర్టు విచారణ, జైలు శిక్ష లాంటివి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా చేకి ప్రచారం వస్తుందని భావించిన ప్రభుత్వం ఆ మరుసటి రోజు చేని కాల్చి చంపి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టింది.

సాయుధ పోరాటానికి ప్రతిరూపం

"మీరు చంపేది ఒక మనిషినే. అతని సిద్ధాంతాన్ని చంపలేరు" అన్న చే గెవారా చివరి మాటలు ఆ తర్వాత నిజమయ్యాయి. బెరెట్ తరహా టోపీలో, తీక్షణమైన చూపుతో ఉన్న చే ఫోటో ఆ తర్వాత సాయుధ పోరాటానికి ప్రతిరూపం అయింది. ప్రపంచం నలుమూలలా ఎందరో శరీరం మీద పచ్చబొట్టులా, టీ షర్టుల మీద బొమ్మలా, వాహనాల మీద స్టిక్కరులా, గది గోడల మీద ఫోటోలా మారింది.

మహాత్మాగాంధీ అహింస మార్గంలో దక్షిణాఫ్రికాకి స్వాతంత్య్ర తెచ్చిన నెల్సన్ మండేలా "చే గెవారా స్వేచ్ఛని కాంక్షించే ప్రతి వ్యక్తికి స్ఫూర్తి" అన్నాడు. ఐర్లాండ్ స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటం చేసిన గెర్రీ ఆడమ్స్ టేబుల్ మీద చే ఫోటో ఉంటుంది. అమెరికాలో నల్లజాతీయులకు సమాన హక్కుల కోసం పోరాటం చేసే వారికి చే సిద్దాంతాలు కరదీపికలు అయ్యాయి.

పెట్టుబడిదారీ విధానం దెబ్బకు ప్రపంచంలో సోషలిస్టు మార్గంలో నడిచే అనేక ప్రభుత్వాలు కూలిపోతున్నా ఫిడెల్ కాస్ట్రోతో కలిసి చే వెలిగించిన సోషలిస్టు కాగడా క్యూబా రూపంలో నేటికీ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. దోపిడీ, అణచివేత కొనసాగినంత కాలం చే గెవారా మార్గంలో పోరాటం చేసేవారు పుడుతూనే ఉంటారు.

1997లో చే శవాన్ని ఖననం చేసిన ప్రాంతం కోసం విస్తృతంగా గాలించి, ఆ చోటు కనిపెట్టారు. రెండు చేతులు లేకుండా ఉన్న శవాన్ని గుర్తించి, క్యూబా ప్రభుత్వం దగ్గర ఉన్న చే దంత నమూనాలతో పోల్చి చే శవాన్ని గుర్తించారు. పూర్తి అధికార లాంఛనాలతో అక్టోబర్ 17,1997న క్యుబాలోని శాంటా క్లారా నగరంలో, అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఖననం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp