ఇప్పుడు చెప్పినవి.. అప్పుడు చెప్పలేదేమి బాబూ..?

By Kotireddy Palukuri Aug. 10, 2020, 07:20 pm IST
ఇప్పుడు చెప్పినవి.. అప్పుడు చెప్పలేదేమి బాబూ..?

ముందుగా చెప్పినట్లుగానే 48 గంటలకోసారి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జూమ్‌ యాప్‌ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ రోజు మళ్లీ వచ్చారు. మొన్న అమరావతి పై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు.. ఈ రోజు తన హాయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో చెప్పుకొచ్చారు.

రాయలసీమ నుంచి మొదలు పెట్టి ఉత్తరాంధ్రతో కొనసాగించి.. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తన ఐదేళ్ల పాలనా హయాంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగాలు ఏ స్థాయిలో కల్పించామో చెప్పుకొచ్చారు. గ్రామ స్థాయిలోనూ అభివృద్ధి చేశామని, ఆ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఏ జిల్లాలో ఏ ఏ అభివృద్ధి పనులు చేశామో డిటైల్‌గా వీడియో ప్రజెంటేషన్‌ కూడా ఇస్తూ.. ఒక చేత్తో అమరావతిని ప్రపంచ రాజధానిగా అభివృద్ధి చేస్తూనే... మరో పక్క 13 జిల్లాలను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేసేందుకు కావాల్సింది చిత్తశుద్ధి కానీ.. జిల్లాకో రాజధాని కాదని.. ఏ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలో చేసి అక్కడ ముగించారు.

దాదాపు గంట 10 నిమిషాల పాటు చంద్రబాబు చెప్పిన విషయాలు సావధానంగా విన్న వారిలో ఓ సందేహం వస్తోంది. ఇన్ని చేసిన చంద్రబాబు.. వీటిని 2019 ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు చెప్పలేదు..?. చేసిన అభివృద్ధి చెప్పుకుని ఎందుకు ఓట్లు అడగలేదనే ప్రశ్న ప్రస్తుతం బాబు జూమ్‌ ప్రశంగం చూసిన తమ్ముళ్లలోనూ మెదులుతోంది. ఎన్నికల సభల్లో 2014లో మాదిరిగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత విమర్శలనే చేశారు తప్పా.. ఈ రోజు జూమ్‌ చెప్పిన అంశాలను ప్రస్తావించలేదు. జగన్‌ లక్ష కోట్లు తిన్నాడు.. ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్‌ జగన్‌కు వెయి కోట్లు పంపాడు.. ఫ్యాక్షనిస్టులు, రౌడీలు.. అంటూ తాను చేసిన పని చెప్పడం పక్కనపెట్టిన బాబు.. ఈతరహాలో విమర్శలు చేశారు. ఇప్పుడు చెప్పిన విషయాలే ఎన్నికల ప్రచార సభల్లో చెప్పి ప్రజలను చైతన్యం చేసి ఉంటే శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య మరోలా ఉండేదనే అభిప్రాయం తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది.

Read Also : స్వర్ణ ప్యాలెస్‌ ఘటన బాధ్యులపై కొరడా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp