అప్పుడు అభివృద్ధి..! ఇప్పుడు వైఫల్యం..!! అంతే కదా బాబుగారు..?

By Kotireddy Palukuri Sep. 20, 2020, 07:45 pm IST
అప్పుడు అభివృద్ధి..! ఇప్పుడు వైఫల్యం..!!  అంతే కదా బాబుగారు..?

స్వల్ప వ్యవధిలో ఒకే అంశంపై ఒక వ్యక్తి భిన్నంగా మాట్లాడే అవకాశం బహుసా రాజకీయాల్లో మాత్రమే సాధ్యం. అది ఎలాగో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు. పరిస్థితులకు తగినట్లుగా మాట్లాడడంలోను, రాజకీయం చేయడంలోనూ ప్రస్తుత కాలంలో చంద్రబాబుకు సరితూగగలిగిన రాజకీయ నేత దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదేమో.

ఈ విషయంలో చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నిన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసిన తర్వాత అర్థం అయింది. వాసుపల్లి వైసీపీ కండువా కప్పుకోలేదు. కానీ ఆయన ఇద్దరు కుమారులు మాత్రం వైసీపీలో చేరారు. పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్న షరతును సీఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెట్టారు. ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినా.. ఈ షరతును ముందుపెడుతున్నారు. ఫలితంగా వారు చేరకుండా.. వారి కుటుంబ సభ్యులను వైసీపీలోకి పంపిస్తున్నారు.

వాసుపల్లి సీఎం జగన్‌ను కలిసిన నేపథ్యంలో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ మారేవారిని ద్రోహులుగా అభివర్ణించిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రారంభంలో చెప్పుకున్నట్లు చంద్రబాబు రాజకీయం ఇక్కడే తెలుస్తోంది.

ఏడాదిన్నర క్రితం ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దఫదఫాలుగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు. వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు ఆర్థికపరమైన లబ్ధి, మంత్రిపదవులు.. ఇలా అనేక రకాలుగా ప్రలోభపెట్టారు. డబ్బు తీసుకున్నామని ఫిరాయించిన ఎమ్మెల్యేలలో కొంత మంది బహిరంగంగా చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం.. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని గొప్పగా ప్రకటనలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పి మరీ పార్టీలోకి చేర్చుకున్నారు. వారిలో నలుగురికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. రాజీనామా షరతు లేకుంటే ఈ పాటికే టీడీపీలో సింగిల్‌ డిజిట్‌ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారు. గంటా శ్రీనివాసరావు సహా పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్న విషయం చంద్రబాబుకు తెలియకపోయినా.. ఆ పార్టీ శ్రేణులకు తెలుసు. టీడీపీలో భవిష్యత్‌ లేదని కొంత మంది, మూడు రాజధానులను చంద్రబాబు వ్యతిరేకిస్తుండడంతో, తమ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు మరికొంత మంది వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. వారు పార్టీలో చేరకపోయినా.. కుటుంబ సభ్యులను పంపిస్తున్నారు.

ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి గల కారణాలు చంద్రబాబుకు తెలిసినా.. తెలియనట్లుగా సీఎం జగన్‌పై విమర్శలు చేసినా.. ప్రజలకు మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఎందుకు దూరం అవుతున్నారో బాగా తెలుసు. పైగా తాను చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అనే రీతిలో చంద్రబాబు నీతులు వల్లించడమే విడ్డూరంగా ఉందనే టాక్‌ నడుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp