విశాఖ టీడీపీ త్వ‌ర‌లో ఖాళీ..?

By Kalyan.S Aug. 04, 2020, 08:15 pm IST
విశాఖ టీడీపీ త్వ‌ర‌లో ఖాళీ..?

అమ‌రావతి నినాదం ఎత్తుకున్న తెలుగుదేశం పార్టీకి రాజ‌ధాని విశాఖ‌లో గ‌ట్టి దెబ్బ త‌ప్ప‌దా..? ఎమ్మెల్యేల స‌హా మొత్తం మాజీలు, సీనియ‌ర్ నాయ‌కులు ‌టీడీపీకి రాం రాం చెప్ప‌నున్నారా..? అంటే అవున‌నే సంకేతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఏపీలో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. రాజ‌ధానిలో వైసీపీకి ఇక తిరుగుండ‌ద‌ని భావిస్తున్న నేత‌లంతా ఆ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా వైసీపీ గూటికి చేరేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. త‌మ‌కు తెలిసిన రాజ‌కీయ, ఇత‌ర ప్ర‌ముఖుల ద్వారా మంత్రాంగాలు న‌డుపుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌ను రాజ‌ధానిగా వ్య‌తిరేకిస్తుండ‌డంతో కొద్ది నెల‌ల క్రిత‌మే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. గ‌తంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్ర‌క‌ట‌న‌కు ముందే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటుగా పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. విశాఖ నగర అధ్యక్షుడిగా కొన‌సాగిన పార్టీ సీనియర్ నేత రెహమాన్ కూడా గ‌తంలోనే రాజీనామా చేశారు. ఎన్‌ఆర్సీతో పాటూ రాజధాని అంశాల్లో టీడీపీ వైఖరిని నిర‌సిస్తూ ఆయ‌న రాజీనామా చేశారు.

డేట్ ఫిక్స్ చేసుకున్న గంటా..?

తెలుగుదేశం పార్టీలో ఎప్ప‌టి నుంచో క‌ల‌క‌లం సృష్టిస్తున్నవార్త గంటా శ్రీ‌నివాస‌రావు రాజీనామా చేస్తార‌ని.. చాన్న‌ళ్లుగా దీనిపై ప్ర‌చారం జ‌రుగుతూనే వ‌స్తోంది. తాజాగా ఆయ‌న వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా పార్టీ మార్పుపై క్లారిటీ వ‌చ్చి‌నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముందుగా ఆగస్ట్ 15 అన్నారు. ఆ తర్వాత 9న అన్న ప్రచారం కూడా జరిగింది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఈ నెల 16వ తేదీన వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వైసీపీ మద్దతుదారుడిగా గంటా కొనసాగగా, ఆయన వర్గానికి చెందిన నేతలు మాత్రం వైసీపీ కండువాలు కప్పుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి.

గంటా వెనుక మెగాస్టార్..?

గంటా శ్రీ‌నివాస‌రావు వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్ర‌ముఖంగా మెగాస్టార్ చిరంజీవి బాట‌లు వేసిన‌ట్లు మ‌రో వార్త ప్ర‌చారంలో ఉంది. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీ‌నివాస్ కు నాటి పార్టీ ఆధినేత చిరంజీవితో మంచి సంబంధాలు ఉండేవి. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌డం వెనుక గంటా హ‌స్తం ఉంద‌ని కూడా చెబుతారు. ఆ త‌ర్వాత చిరంజీవి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా గంటా మాత్రం టీడీపీలో చేరారు. అయిన‌ప్ప‌టికీ చిరంజీవికి చెందిన సినీ కార్య‌క్ర‌మాల‌కు గంటా వెళ్లేవారు. అలా చిరంజీవితో స‌త్సంబంధాలు ఉన్న‌ గంటా వైసీపీలో చేరేందుకు చిరంజీవి కూడా త‌న‌వంతు పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ తో చిరంజీవి భేటీ సంద‌ర్భంగా ఆయ‌న గంటా ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఒక్కొక్క‌రుగా వైసీపీలోకి..

గంటా వైసీపీలో చేర‌గానే ఇక విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన టీడీపీ నేత‌లంతా వ‌ర‌స క‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే టీడీపీకి రాజీనామా చేసిన పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు, చింత‌ల‌పూడి వెంక‌ట్రామ‌య్య వంటి త‌దిత‌ర నేత‌లు వైసీపీ అవ‌కాశం ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ల‌డం క‌న్‌ఫార్మ్. ఇక‌పోతే జిల్లా మొత్తంలో 15 సీట్లు ఉండ‌గా.. తెలుగుదేశం పార్టీకి గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం విశాఖ న‌గ‌రంలో మాత్ర‌మే నాలుగు సీట్లు ల‌భించాయి. గంటా శ్రీ‌నివాస‌రావుతో పాటు, పీవీజీఆర్ నాయుడు, వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరు కూడా వైసీపీలోకి వెళ్లేందుకు సుముఖత చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ పై త‌గిన భ‌రోసా ల‌భిస్తే వైసీపీలోకి వెళ్ల‌డ‌మే ఖాయ‌మే. అదే జ‌రిగితే రాజ‌ధానిలో టీడీపీ ఇక ఖాళీ అయిన‌ట్లే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp