యథా యజమాని.. తథా ‘పనివాడు’

By Jaswanth.T May. 22, 2020, 09:52 pm IST
యథా యజమాని.. తథా ‘పనివాడు’

రాజు, ప్రజలతో పోల్చాల్సిన ఈ నానుడిని యజమాని పనివాడితో ఎందుకు పోల్చాల్సి వచ్చిందో చివరకు చెబుతాను. అధికారంలోకొచ్చిన కొత్త మోజులో, తానేం చేసినా చెల్లుబాటయ్యే సమయంలో.. తనకు తాను ఏపీకి సీఈవోగా ప్రకటించుకున్నాడు చంద్రబాబునాయుడు. దీంతో ప్రభుత్వ అధికారులతో పాటు, తమ పార్టీ పల్లకీని స్వచ్ఛంధంగా మోస్తున్న నాయకులు, కార్యకర్తలను కూడా జీతంలేని ఉద్యోగులుగానే చూసాడని ఇప్పటికీ పలువురు కీలక కార్యకర్తలు గుర్తు చేసుకుంటుంటారు.

పార్టీ పరంగా చేయాల్సిన పనులకు మార్కులు కేటాయిస్తూ, వాటిని బట్టి ర్యాంకులు తక్కువగా వచ్చిన వాళ్ళ కేడర్‌ తగ్గిస్తూ చేతనైనన్ని ప్రయోగాలే చేసి నాయకులు, కార్యకర్తలను మానసింగా అనేక ఇబ్బందులకు గురిచేసినట్లుగా చెప్పుకుంటుంటారు. అయితే ప్రకృతి సహజంగానే పీక్‌టైమ్‌ పూర్తవ్వగానే డౌన్‌ఫాల్‌ మొదలైంది. ఈ విషయాన్ని గుర్తించుకోలేక ఇప్పటికీ తాను సీఈవోనేనని, తన తరువాత చినబాబే కాబోయే సీఈవో అంటూ ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఆయన్ను జనం మీదికొదిలారు.

అయితే రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా ‘నిర్ణీత గడువుతేదీ’ అయిపోయినట్లు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తాను సీఈవోనేనన్న రీతిలో పక్కరాష్ట్రంలో కూర్చుని ఆర్డర్స్‌ వేస్తున్నారు. అయితే సహజంగానే సీఈవో ఎదురుగా లేకపోతే క్రింది స్థాయిలో ఉద్యోగుల పని నాణ్యత తగ్గుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే ఒకప్పుడు మైక్‌ కనబడితే ముందుకుదూసుకొచ్చి నానా హడావుడి చేసిన నేతలు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయనంతగా మార్పు వచ్చింది.

నిన్నమొన్నే చంద్రబాబు ఇచ్చిన విద్యుత్‌ బిల్లుల పోరాటం విషయంలో ఇది సుస్పష్టంగా తేలిపోయింది. గ్రామ స్థాయిలో అసలెవ్వరూ పట్టించుకోకపోగా, కనీసం మండల స్థాయిలోనైనా ఆందోళనల లక్షణాలు కన్పించలేదు. జిల్లాస్థాయిలో చూద్దామన్నాగానీ కీలకనాయకులెవరూ కనీస ప్రయత్నం కూడా చేయలేదు. సీఈవో పక్క రాష్ట్రం నుంచి పిలుపుఇస్తే ఉద్యోగులు కాసేపయినా పనిచేయినట్లు నటించే ప్రయత్నం కూడా చేయలేదాయె. దీంతో విద్యుత్‌ బిల్లులపై ఉద్యమం తేలిపోయింది. దీనిపై ఇప్పటికే సీఈవో సమీక్షలు ప్రారంభించినట్లు సమాచారం.

స్వచ్ఛంధంగా పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలను గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సింది పోయి ‘నేను సీఈవోను.. నేను చెప్పిందే చెయ్యాలి..’ లాంటి స్టేట్‌మెంట్‌లు పరిస్థితి బాగున్నపుడు ఇచ్చి, ఇప్పుడు పోరాడండి, దుమ్ము దులిపేయండి, చీల్చి చెండాడేయండి.. అంటే ఎవ్వరు మాత్రం ముందుకుకొస్తారు. అందుకే రాజు రాజే, ప్రజలు ప్రజలే.. సీఈవో సీఈవోనే.. ఉద్యోగులు ఉద్యోగులే.. ఈ లాజిక్‌ మిస్సయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. లేదా ఇంతకంటే దిగజారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp