అయినా.. విన‌రేమి..?

By Kalyan.S Oct. 17, 2020, 02:30 pm IST
అయినా.. విన‌రేమి..?

వ‌ర్షాల‌కు అక్ర‌మ నిర్మాణ క‌ట్ట‌డాలున్న ప్రాంతాలు మ‌రింత ముంపున‌కు గుర‌య్యాయి. క‌ర‌క‌ట్టలో కూడా అదే ప‌రిస్థితి. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటికి.. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కట్టలేరు, మున్నేరు, కొండవాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద మరింత వ‌చ్చి చేరింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు, వ‌ర‌ద నీరు వెళ్లే అవ‌కాశం లేకుండా నిర్మాణా‌లు చేప‌ట్టిన ప్రాంతాలు నిండా మునిగాయి.

చంద్ర‌బాబు నివాసం చుట్టూ...

ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్‌ కన్జర్వేటరీలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ల చుట్టూ వరదనీరు చేరింది. కొన్ని గెస్ట్‌హౌస్‌లు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్‌ సగం వరకు మునిగిపోయింది. గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, చందన బ్రదర్స్‌ గెస్ట్‌హౌస్‌ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్‌లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి. ఇసుక ర్యాంప్‌ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్‌హౌస్‌ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు.

ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా...

వ‌ర‌ద ప్ర‌భావంతో కృష్ణా నది కరకట్టపై ఉండే నివాసాలకు అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కూడా నోటీసులు పంపారు. చంద్రబాబుతో పాటు మరో 36 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. భారీ వరద వస్తుండటంతో కరకట్ట దగ్గర ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు. ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. కరకట్ట ప్రాంతంలోని నివాసాల్లోకి ఏ సమయంలోనైనా వరదనీరు చేరవచ్చని అధికారులు హెచ్చరించారు.ఇదిలా ఉంటే, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. సెప్టెంబర్‌లో కూడా చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. గతేడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. అప్పుడు కూడా చంద్రబాబుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయంగా దుమారం రేగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసేసి వరద పెరిగేలా చేసి.. చంద్రబాబు నివాసం ఉండే ఇల్లు మునిగేలా చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆప‌ద‌కాలంలో కూడా ఆరోప‌ణ‌లు చేస్తున్నారే త‌ప్పా.. నోటీసుల‌కు స్పందించిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

అది స‌రైన‌ది కాదు...

కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. అక్రమంగా కరకట మీద ఇళ్ళు కట్టుకుని, ప్రభుత్వం ఏలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించడం సరైనది కాదని అన్నారు. వరదలు, వర్షాలపై ఈ ప్రభుత్వంలో అప్రమత్తంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. లోకేష్, చంద్రబాబు, పర్యాటకుల మాదిరిగా రాష్ట్రానికి వస్తూ పోతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడు కూడా వర్షాలు కురవలేదని, ఆయన పాలనలో కరువు తాండవించిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp