చంద్ర‌బాబుదే చారిత్ర‌క త‌ప్పిదం : ఈ నివేదికే నిద‌ర్శ‌నం..!

By Kalyan.S Aug. 03, 2020, 06:30 pm IST
చంద్ర‌బాబుదే చారిత్ర‌క త‌ప్పిదం : ఈ నివేదికే నిద‌ర్శ‌నం..!

మూడు రాజ‌ధానుల బిల్లుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషన్‌ హరిచందన్ ఆమోద ముద్ర వేయ‌డం చారిత్ర‌క త‌ప్పిదం అంటూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తెగ బాధ‌ప‌డిపోతున్నారు. రైతులకు అన్యాయం జ‌రుగుతుందంటూ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అస‌లు చంద్ర‌బాబు నాయుడు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడే స‌రైన నిర్ణ‌యం తీసుకోని ఉంటే స‌మ‌స్య ఇంత వ‌ర‌కూ వ‌చ్చేది కాదు. అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాలు రాజ‌ధానికి త‌గ‌వ‌ని కేంద్రం ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ఆనాడే నివేదిక ఇచ్చింది. అందులో బ‌హుళ రాజ‌ధానులు అంశాన్ని కూడా ప్ర‌తిపాదించింది. చంద్ర‌బాబు దాన్నిబుట్ట‌దాఖ‌లు చేశారు. సొంత మంత్రుల‌తో క‌మిటీ వేయించి.. వాటి ఆధారంగా అమ‌రావ‌తే రాజ‌ధాని అంటూ ప్ర‌క‌టించేశారు.

శివరామకృషన్ కమిటీ నివేదిక‌ను కాద‌న‌గ‌ల‌రా..!

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో.. ఎక్క‌డ ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునేందుకు కేంద్రం ప్ర‌భుత్వం శివరామకృషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 6ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చి చైర్మన్‌గా పనిచేసిన కె. శివరామకృష్ణన్ అధ్యక్షుడిగా ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. కేంద్రం ఆదేశాల ప్ర‌కారం... ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి జూన్ 2న ఏర్పడిన నూతన ప్రభుత్వ అభిప్రాయాలను కూడా తీసుకొని కేంద్రానికి నివేదిక అందజేసింది. 31 ఆగస్టు 2014న తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో బహుళ రాజధానుల ఏర్పాటుపై ప్రతిపాదనలు చేసింది. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని సూచించింది. రాజధాని కోసం కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిస్తూ.. వాటికున్న లోటుపాట్లను ప్రస్తావించింది. నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ నివేదిక రాకముందే పాలనను విజయవాడ నుంచి మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసింది. శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ రాజధానిగా ఏర్పాటు చేసే అంశంపై విముఖత వ్యక్తం చేసింది.

శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ సూచ‌న‌ల‌ను తోసిపుచ్చిన నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 2014 డిసెంబ‌ర్లో అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌ధాని నిర్మించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆ వెంట‌నే ఆరు నెల‌లకు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌ని వీడి పాల‌న‌ను అమ‌రావ‌తి ప్రాంతానికి త‌ర‌లించారు. దానికి త‌గ్గ‌ట్టుగా స‌చివాల‌యం, అసెంబ్లీ వంటివి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న నిర్మించారు. అదే స‌మ‌యంలో రాజ‌ధాని కోసం ల్యాండ్ ఫూలింగ్ విధానంలో 30వేల ఎక‌రాల‌ను రైతుల నుంచి సేక‌రించారు. ఒక ఉన్న‌త స్థాయిలో ఏర్ప‌డ్డ క‌మిటీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌స‌రాల‌ను, ప్రాంతాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి నివేదిక ఇచ్చినా చంద్ర‌బాబు దాన్ని ప‌ట్టించుకోలేదు. రాజ‌ధాని నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మ‌ని నాడు పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ద‌ని న్యాయ నిపుణులు సైతం మ‌ద్ద‌తు ప‌లికారు. అందుకే గ‌వ‌ర్న‌ర్ మూడు రాజ‌ధానుల బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ విష‌యాల‌న్నీ చంద్ర‌బాబుకు తెలియ‌న‌వి కావు.. మ‌రి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే తెలియాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp