పోలవరం బకాయిలు చెల్లించేందుకు కేంద్రం అంగీకారం

By Raju VS Sep. 16, 2020, 10:05 am IST
పోలవరం బకాయిలు చెల్లించేందుకు కేంద్రం అంగీకారం

జాతీయ ప్రాజెక్ట్ పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పక్ష నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చేసిన వ్యయం రీయంబెర్స్ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు త్వరలోనే జరుగుతుందని హామీ ఇచ్చారు.

జీరో అవర్ లో అంశాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. పోలవరం నిధులు వ్యయంపై కాగ్ నివేదికను రాష్ట్రం తమకు అందించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. వీలయినంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సంకల్పానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా లేఖ రాశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.8,614.70 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు నిధులు అందిస్తామన్నారు.

పోలవరం అంశంలో ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని విజయసాయిరెడ్డి రాజ్యసభలో గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలున్నాయని, దానికి అనుగుణంగా బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. కేంద్రం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించించిన నేపథ్యంలోదీని నిర్మాణానికి నిధులన్నింటినీ కేంద్రమే సమకూర్చాలన్నారు. ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌ 2021 నాటికల్లా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. కేంద్ర నిధుల కోసం నిరీక్షించకుండా ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్రమే సొంత నిధులను ఖర్చు చేస్తూ వస్తోందని గుర్తు చేశారు.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.3,805 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని వివరించారు. దాంతో ఆయన ప్రస్తావించిన అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో పోలవరం ప్రాజెక్ట్ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp