మోడీ వేస్ట్‌.. బాబును ఎక్కించాల్సిందే..

By Kotireddy Palukuri Sep. 19, 2020, 12:24 pm IST
మోడీ వేస్ట్‌.. బాబును ఎక్కించాల్సిందే..

సంపద సృష్టించకుండా, ఆదాయం పెంచకుండా అప్పలు చేస్తున్నారు. అప్పులు పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు... ఇదీ ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు. గత చరిత్రను పట్టించుకోకుండా, వర్తమానంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయంతో సంబంధం లేకుండా రాజకీయ విమర్శలే లక్ష్యంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని అందరికీ అర్థం అవుతోంది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. లోక్‌సభలోనూ ఆ పార్టీ ఎంపీలు అప్పులపై మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇటీవల టీడీపీ ఎంపీలు జగన్‌ సర్కార్‌ సంపద సృష్టించకుండా, ఆదాయం పెంచకుండా అప్పులు చేస్తోందని, రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంతోపాటు, దేశం గురించి కూడా టీడీపీ ఎంపీలు ఆవేదన, బాధను లోక్‌సభలో వ్యక్తం చేసే అవకాశం వచ్చింది. గడచిన ఏడాది కాలంలో అంటే.. 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ వరకూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా 13.12 లక్షల కోట్ల అప్పులు చేసింది. 2019 జూన్‌ నాటికి కేంద్ర ప్రభుత్వం అప్పులు 88.18 లక్షల కోట్లు కాగా.. 2020 జూన్‌ నాటికి ఆ మొత్తం 101.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2020 మార్చి నుంచి 2020 జూన్‌ నాటికి మూడు నెలల కాలంలోనే 6.70 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా అప్ప తేవాల్సి వచ్చింది.

కరోనా మహమ్మరి మనతోపాటు ప్రపంచం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందే. నవంబర్‌ – డిసెంబర్‌లోనే ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చినా.. మన దేశంలో మార్చి నెలలో వ్యాపించింది. లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అన్ని రంగాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ స్తంభించడంతో ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉద్దీపన చర్యలు, ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆ స్థాయిలో అప్పులు చేయాల్సి రావడంపై ఎలాంటి ఆశ్చర్యం లేదు.

కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలదీ అదే తీరు. అయితే ప్రధాని పదవి నుంచి మోడీని దించివేసి, సంపద సృష్టించే నేత, ఆదాయం పెంచే నాయకుడు అయిన చంద్రబాబును ఎక్కిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతారేమోనన్న ఆశ టీడీపీ నేతల మాటల ద్వారా కలుగుతోంది. 2014–2019 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆదాయాన్ని, సంపదన భారీ ఎత్తున పెంచారాయే. 2014లో 90 వేల కోట్ల రూపాయలు ఉన్న ఏపీ అప్పులను 3.50 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినా.. టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా దృష్టిలో చంద్రబాబు సంపద సృష్టించే నేతే, ఆదాయం పెంచే నాయకుడే. ఈ విషయం వారి కన్నా ముందే చంద్రబాబే తనకు తానుగా చెప్పుకున్నారు కాబట్టి ప్రస్తుతం కరోనా వల్ల దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించి, సంపద సృష్టించి, ఆదాయం పెంచే బాధ్యతను బాబుకు అప్పజెబితే సరి.

Read Also: స్వరం మార్చిన బాబు.. కేంద్రానికి లేఖ రాస్తారా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp