యాప్ లు నిషేధం: వివరణ ఇవ్వడానికి టిక్‌టాక్‌ను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం

By Jagadish J Rao Jun. 30, 2020, 02:04 pm IST
యాప్ లు నిషేధం: వివరణ ఇవ్వడానికి టిక్‌టాక్‌ను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం

నిషేధం తరువాత వివరణ ఇవ్వడానికి టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. చైనాతో సహా ఏ విదేశీ ప్రభుత్వంతో భారతీయ వినియోగదారులపై సమాచారాన్ని పంచుకోలేదని టిక్‌టాక్ స్పష్టం చేసింది. దేశంలో టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన కొన్ని గంటల తరువాత వీడియో షేరింగ్ అప్లికేషన్ సంబంధిత ప్రభుత్వ అధికారులను కలవడానికి, వివరణలను సమర్పించడానికి టిక్‌టాక్ కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిచ్చింది. టిక్‌టాక్ భారత ప్రభుత్వ ఉత్తర్వులను పాటించే ప్రక్రియలో ఉందని పేర్కొంటూ డేటా గోప్యతకు సంబంధించిన అన్ని భారతీయ చట్టాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వంతో సహా ఏ విదేశీ ప్రభుత్వాలతో ఏ భారతీయ వినియోగదారుడి సమాచారాన్ని పంచుకోలేదని కంపెనీ తెలిపింది.

ఈ మేరకు టిక్‌టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. "టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లను బ్లాక్ చేస్తూ భారత ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మేము దానిని అనుసరించే ప్రక్రియలో ఉన్నాం. దీనిపై స్పందించి‌ వివరణలు సమర్పించే అవకాశం కోసం సంబంధిత ప్రభుత్వ స్టేక్ హోల్డర్లతో కలవడానికి మమ్మల్ని భారత ప్రభుత్వం ఆహ్వానించింది” అని నిఖిల్ గాంధీ అన్నారు.

"టిక్‌టాక్ ఇంటర్నెట్‌ను ప్రజాస్వామ్యయుతం చేసింది. ఇది 14 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. టిక్‌టాక్ వందల మిలియన్ల వినియోగదారులు, కళాకారులు, కథ చెప్పేవారు, విద్యావేత్తలు, ప్రదర్శించేవారి జీవనోపాధి కోసం ఉంది. వీరిలో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ వినియోగదారులు" అని గాంధీ తెలిపారు.

"టిక్‌టాక్ భారత చట్టాల ప్రకారం అన్ని డేటా గోప్యత, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోంది. భారతదేశంలోని టిక్‌టాక్ వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోవటం లేదు. భవిష్యత్తులో కూడా పంచుకోము. వినియోగదారుల గోప్యత, సమగ్రతకు మేము అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాము”అని ఆయన అన్నారు.

జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు ఉందని పేర్కొంటూ భారత ప్రభుత్వం 59 యాప్ లను నిషేధించినట్లు సోమవారం రాత్రి ప్రకటించింది. వీటిలో చాలా వరకు చైనాకు చెందిన యాప్ లే ఉన్నాయి. ప్రసిద్ధ టిక్‌టాక్, షేరిట్, మి వీడియో కాల్, క్లబ్ ఫ్యాక్టరీ, కామ్ స్కానర్ మొదలైనవి అందులో ఉన్నాయి. ఇండియా-చైనా మధ్య సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల‌ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. కేంద్రం తీసుకునే ఈ చర్య ఇ-కామర్స్, గేమింగ్, సోషల్ మీడియా, బ్రౌజర్లు, ఫైల్-షేరింగ్ వరకు వివిధ రకాల యాప్ ల ఉపయోగించడాన్ని పరిమితం చేస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp