కేంద్రం తేల్చేసింది... మ‌రి చంద్ర‌బాబు..?

By Kalyan.S Aug. 06, 2020, 06:51 pm IST
కేంద్రం తేల్చేసింది... మ‌రి చంద్ర‌బాబు..?

అమరావతిని మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. మూడు ముక్కలాట ఆడుతూ అమరావతిని నాశనం చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కాపాడాలి. రాజధాని అమరావతిని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అది కేంద్రం పరిధిలోని అంశం కాదని కొందరు బీజేపీ నేతలు చెప్పడం సరికాదు. కేంద్రం జోక్యం చేసుకోవాలి"... ఇదీ 48 గంట‌ల డెడ్ లైన్ అనంత‌రం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన స్టేట్ మెంట్ లోని కొన్ని అంశాలు.

అయితే చంద్ర‌బాబుకే కాదు.. రాజ‌ధానిపై రాద్ధాంతం చేస్తున్న చాలా మందికి తెలిసేలా సూటిగా, స్ప‌ష్టంగా కేంద్ర ప్ర‌భుత్వం తేల్చేసింది. తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు దీంతో ఖంగుతిన్నాయి. రెండు రోజుల‌కు ఒక‌సారి అమ‌రావ‌తిపై నివేదిక‌లిస్తాన‌న్న చంద్ర‌బాబు ఇప్పుడు ఏం మాట్లాడ‌తారో అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని, చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్ప‌డం ద్వారా కేంద్రం త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పింది. రాజ‌ధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరు ప్ర‌స్తావ‌న‌

రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని చెబుతూ.. అందుకే నాడు తెలుగుదేశం ప్ర‌భుత్వం కూడా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించుకుంద‌ని కేంద్రం పేర్కొంది. విభజన చట్టంలోనిగా సెక్షన్‌ 6 ప్రకారం 2014లో కేంద్ర ప్ర‌భుత్వం శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తే.. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింద‌ని, రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు కాబ‌ట్టి నాడు కూడా జోక్యం చేసుకోలేద‌నే విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఒక గెజిట్‌ను విడుదల చేసింది. గెజిట్‌ ప్రకారం ఏపీలో మూడు పాలనా కేంద్రాలుంటాయి. గెజిట్‌ ప్రకారం శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నార’ని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.

24 గంట‌లు కాక‌ముందే ఇలా..

అమ‌రావ‌తిపై కేంద్రం జోక్యం చేసుకుని మూడు రాజ‌ధానుల‌పై స్పందించాల‌ని చంద్ర‌బాబు నాయుడు కోరి 24 గంట‌లు కాక‌ముందే ఇలా కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి త‌గ్గ‌ట్టు వ్యూహం మార్చే ప‌నిలో తెలుగుదేశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వంపై కూడా చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తారా.. లేదా చూడాలి. ఆయ‌న‌కు ఆ అవ‌కాశం లేకుండా అఫిడ‌విట్ లో శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ట్లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి ఆయ‌న ఇప్పుడేం మాట్లాడతారో చూద్దాం..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp