టార్గెట్ కుప్పం అసెంబ్లీ.. టీడీపీలో టెన్షన్ టెన్షన్...!

By Kalyan.S Sep. 21, 2021, 01:00 pm IST
టార్గెట్ కుప్పం అసెంబ్లీ.. టీడీపీలో టెన్షన్ టెన్షన్...!

"వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో ఘన విజయం సాధిస్తాం." జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గ‌తంలో కూడా వైసీపీ ప్ర‌ముఖులు ఈ విష‌యాన్ని చాలాసార్లు చెప్పారు. అయితే.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఇప్పుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం క‌ట్ట‌డంపై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు

సొంత నియోజకవర్గం కుప్పం కాదుకదా... సొంత ఊరు నారావారి పల్లెలోనూ టీడీపీకి పరాజయం తప్పలేదు. చంద్ర‌బాబు భార్య దత్తత తీసుకున్న నిమ్మకూరులోనూ పరాభవమే ఎదురైంది. మున్సిపాల్టీ ఎన్నిక‌ల్లోనూ చంద్రబాబు ఇలాకాలో వైసీపీ జెండా ఎగిరింది. స‌ర్పంచ్ ఎన్నిక‌ల నాటి నుంచే ఇక్క‌డ టీడీపీకి కౌంట్ డైన్ ప్రారంభ‌మైంది. ఈ ప‌రిణామాల‌న్నీ భ‌విష్య‌త్ లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎటువంటి ప్ర‌భావం చూపుతాయో అన్న టెన్ష‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీని ఇప్ప‌టి నుంచే వెంటాడుతోంది.

ప‌ద్నాలుగేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా చేసినా, ప్ర‌తిప‌క్ష నేత‌గా అంత‌కు మించిన అనుభ‌వం ఉన్నంత మాత్రాన ఓట‌మి ద‌రిచేర‌ద‌నే గ్యారంటీ అయితే లేదు క‌దా.. అనే అభిప్రాయాలూ వ్య‌క్తం అవుతున్నాయి. దీనికి తోడు 2024లో కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్ధి ఘన విజయం సాధించేలా పని చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్ప‌టి నుంచే కార్య‌క‌ర్త‌ల‌కు నూరి పోస్తున్నారు.

Also Read : కవరింగ్ టైం: బాబు వదిలేశాడు కాబట్టే ఆ పాప గెలిచిందంట ...!

చంద్ర‌బాబు ఇలాఖాలో జ‌గ‌న్ మార్క్

మ‌రోవైపు.. అభివృద్ధి జ‌గ‌న్ మార్క్ కుప్పంలో కూడా క‌నిపిస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి కూడా కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తున్నారు. నియోజకవర్గంలో వేలాది మందికి ఇళ్లపట్టాలు అందజేశారు. గత టీడీపీ హయాంలో కేవ‌లం ఐదు వేల మందికి ఇళ్లపట్టాలకు అనుమతి ఇచ్చి అందులో నాలుగు వేల మందికి మాత్రమే పంపిణీ చేశారు. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం కింద ఐదేళ్ల కాలంలో నాలుగు వేల మంది లబ్ధిపొందగా.. జ‌గ‌న్ స‌ర్కార్ రెండేళ్లలోనే అంత‌కు స‌రిస‌మానంగా స్థానికుల‌కు ల‌బ్ధి చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలోని సర్కారు, ఇతర యాజమాన్యాల బడుల్లో చదువుతున్న విద్యార్థులను అమ్మఒడి పథకం అదుకుంటోంది. ఇప్ప‌టికే 53,187 మంది తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.7978.05 లక్షలను జమచేసింది. స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మెరుగుప‌డ్డాయి.

వైసీపీ వైపు చూపు...

క‌రోనా పేరుతో స్థానిక ఎమ్మెల్యే చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం, మ‌రోవైపు జ‌గ‌న్ స‌ర్కారు అన్ని ర‌కాలుగానూ అదుకుంటుండ‌డంతో కుప్పంలో కూడా వైసీపీ బ‌ల‌ప‌డుతోంది. దీంతో చాలా మంది ఆ పార్టీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన 30 కుటుంబాలు ఇటీవ‌లే ఆ పార్టీని వీడి వైసీపీలో చేరాయి. ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ భరత్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ కుప్పం మండలం కంగుంది పంచాయతీ లోని కుటుంబాల సభ్యులు వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. దీనికి తోడు, సొంత పార్టీ నుంచే బాబుకు చుక్కెదుర‌వుతోంది. బాబును కాద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ రావాల‌న్నా నినాదాలు వినిపిస్తున్నాయి. ఇవ‌న్నీ కుప్పంలో టీడీపీ బల‌హీన‌మ‌వుతోంద‌న్న సంకేతాల‌ను ఇస్తున్నాయి.

Also Read : కుప్పం కోట మీద వైసీపీ జండా ఎగరేసిన హాసిని

ప‌ట్టుబిగిస్తున్న భ‌ర‌త్

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుప్పం నియోజకవర్గంపై ప్ర‌ధాన దృష్టి కేంద్రీక‌రించారు. ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగేలా ఎప్ప‌టిక‌ప్పుడు శ్రేణుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో వైసిపి ఇంచార్జ్ భరత్ పాదయాత్రల ద్వారా ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. స‌మ‌స్య‌లను తెలుసుకుని వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌త నెల‌లో కుప్పం మునిసిపాలిటీలో పాదయాత్ర ద్వారా క‌లియ తిరిగారు. దివంగత నేత చంద్రమౌళి తనయుడు భరత్. సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో చంద్రబాబుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మ‌రోవైపు వైసీపీ పుంజుకోవ‌డం స్థానిక రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది.

విజ‌యం ఎవ‌రి సొంత‌మూ కాదు..

హోరాహోరీగా జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ లో రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన మ‌మ‌తా బెన‌ర్జీ ఎమ్మెల్యేగా ఓట‌మి పాల‌య్యారు. అది కూడా రాష్ట్రం అంతా టీఎంసీ గెలిచిన‌ప్ప‌టికీ ఆమె పోటీ చేసిన నందిగ్రామ్ లో ఆ పార్టీ విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అలాగే.. 2018లో జ‌రిగిన‌ మిజోరాం ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి లాల్ తన్హవ్ల ఛాంపాయి సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జా రాజ్యం పార్టీ స్థాపించి అధికారంలో వ‌ద్దామ‌నుకున్న చిరంజీవి పాల‌కొల్లు నుంచి ఓట‌మి పాల‌య్యారు. యువ‌త లో మంచి క్రేజ్ ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే.. పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా ఓడిపోయారు. ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ నేప‌థ్యంలో ఎవ‌రు ఓడినా ఆశ్చ‌ర్యం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Also Read : పరిషత్ ఎన్నికల బహిష్కరణపై చంద్రబాబు కొత్త కారణం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp