బీజేపీ నాయకులకే అసూయ పుట్టేలా.. చంద్రన్న

By Jaswanth.T Sep. 24, 2020, 09:44 pm IST
బీజేపీ నాయకులకే అసూయ పుట్టేలా.. చంద్రన్న

సాధారణంగా ఏ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీ అధినాయకులపై ఈగ వాలినా ఊరుకోరు. రాజకీయ పరంగా వచ్చే ఎటువంటి విమర్శలనైనా వెనువెంటనే తిప్పకొట్టేస్తుంటారు. అయితే ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కన్పిస్తోందంటున్నారు విశ్లేషకులు. ప్రధాని నరేంద్రమోదీపై కనీసం ఈగ కూడా వాలనీయకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చూసుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో అధికార వైఎస్సార్‌సీపీ నుంచి పలువురు నాయకులు రాజకీయంగా వాగ్భాణాలు విసురుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి కొడాలి నాని నరేంద్రమోదీని ఉదహరిస్తూ మీడియా ముందు మాట్లాడారు. దీనిపై బీజేపీ నాయకులు స్పందించిన దానికంటే చంద్రబాబు స్పందించిందే ఎక్కువ అన్నట్టుగా చంద్రబాబు మీడియా ఫోకస్‌ కూడా చేస్తోంది. తద్వార మోదీ దృష్టిని ఆకర్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది.

నాని వ్యాఖ్యలపై చంద్రబాబు కలుగజేసుకుని నంద్యాల నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖండించేసారు. మిమ్మల్ని కామెంట్‌చేస్తే ప్రధానిని ఇందులోకి లాగుతారా? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేసారు. తద్వారా తనకుతాను కేంద్రంలోని బీజేపీకి, నరేంద్ర మోదీకి ఏపీలో నేనూ అంగరక్షకుడినే అని నిరూపించుకునే ప్రయత్నానికి పాల్పడ్డారు. అయితే ఇటువంటి విధానాలు సాధారణంగా ఆయా పార్టీల మధ్య పొత్తులు, స్నేహ సంబంధాలు ఉన్నప్పుడు సహజంగా జరుగుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ.. వద్దు బాబూ.. అంటూ వెనక్కెనక్కి వెళుతుండగా, నేను.. నేను.. అంటూ చంద్రబాబు మాత్రం అర్రులు చాస్తుండడాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు.వాస్తవానికి అది చంద్రబాబు మనస్సులోని భావనే అయ్యుండొచ్చు. కానీ మోడీ సొంత పార్టీ అయిన బీజేపీ నాయకులకే అసూయపుట్టేలా వ్యవహరించడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్న ఛలోక్తులు విన్పిస్తున్నాయి.

ప్రస్తుత సోషల్‌ మీడియా కాలంలో ఎప్పుడే నాయకుడు ఎలా మాట్లాడాడు? అన్నది ఎప్పటికప్పుడు ‘అప్పుడు–ఇప్పుడు’ పేరిట వెంటనే నెట్టుకెక్కేస్తోంది. ఇటువంటి సౌలభ్యం ఉండబట్టే నారా వారి లీలలు ప్రస్తుత ప్రపంచం ముందుకు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు, అందుకు పూర్తి భిన్నంగా ఆయన్ను ఇప్పుడు వెనకేసు వస్తుండడం జనం ఆక్షేపణలు గురికావాల్సి వస్తోంది. ఏపీకి వస్తే మీ సంగత తేల్చాస్తాను అంటూ చూపుడువేలు చూపిస్తూ.. మోడీకి హెచ్చరికలు జారీ చేస్తున్న ఫోజులో చంద్రబాబు మోరవిచ్చుకుని మాట్లాడడం ఇప్పటిక్కూడా ఇంటర్నెట్‌లో ఎవర్‌గ్రీన్‌గానే ట్రోల్‌అవుతోందన్నది మర్చిపోతే ఎలా అన్నది విమర్శకులంటున్న మాట.

తనను తాను కాపాడుకోవడానికి మోడీయే దిక్కు అన్న స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని, ఈ నేపథ్యంలో ఇటువంటి ‘అనుభవ’ ప్రదర్శనలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల నుంచి విన్పిస్తున్న మాట. అయితే ఎవరేమైపోయినా గానీ అంతిమంగా తను, తన లక్ష్యం తనను మాత్రమే కాపాడుకోవడమేనన్నది చంద్రబాబు అజెండా ఉంటుందన్నది ప్రత్యర్ధులు చెప్పే మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రదర్శనను మోడీ గుర్తిస్తారో? లేదో? వేచి చూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp