ఎమ్మెల్యే ఫిర్యాదుతో రెండు చానెళ్లపై కేసులు నమోదు

By Raju VS Aug. 01, 2020, 09:00 am IST
ఎమ్మెల్యే ఫిర్యాదుతో రెండు చానెళ్లపై కేసులు నమోదు

ఓవైపు రాజధాని రగడ సాగుతుండగానే, మరోవైపు రాజధాని ప్రాంత ఎమ్మెల్యేపై నిరాధార కథనాలు ప్రసారం చేయడంతో ఇరు చానెళ్లు ఇరకాటంలో పడ్డాయి. పరువు నష్టం కేసుతో పాటుగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసుల్లో చిక్కుకున్నాయి. ఇటీవల చినకాకాని ప్రాంతంలో పేకాట శిబిరంపై జరిగిన దాడి కేసులో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాత్రపై కథనాలు ప్రసారం చేసినందుకు ఐ న్యూస్, ఎన్టీవీలపై కేసులు నమోదు చేసినట్టు తుళ్లూరు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి తనపై సాగుతున్న దుష్ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేయగా, మహిళా ఎమ్మెల్యేపై సాగుతున్న అబద్ధపు ప్రచారం అడ్డుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో తుళ్లూరు పీఎస్ లో రెండు చానెళ్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పేకాట క్లబ్ ఎమ్మెల్యే శ్రీదేవి సొంతమన్నట్టుగా ఆయా కథనాల్లో పేర్కొనడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. ఓ సందర్భంలో కంటనీరు పెట్టుకుని కలకలం రేపారు. తనపై అబద్ధాలు ప్రచారం చేస్తూ, తనను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తనపై నిరాధార కథనాలను ప్రసారం చేసే ప్రయత్నం విరమించాలని కోరారు. అయినప్పటికీ ఆ రెండు చానెళ్లలో కథనాలు ప్రసారం కావడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

గతంలో కూడా రాజధాని ప్రాంతంలో ఓ మహిళా కానిస్టేబుల్ బట్టలు మార్చుకుంటుండగా విజువల్స్ తీసుని నేపథ్యంలో కొందరు విలేకర్లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యింది. ఇప్పుడు తాజాగా ఓ ఎమ్మెల్యే అంశంలో రెండు చానెళ్లపై కేసులు పెట్టారు. దాంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయా చానెళ్లు ఈ అంశంలో ఎలా స్పందిస్తాయన్నది చర్చనీయాంశం అవుతోంది. కనీసం ఎమ్మెల్యే వివరణ లేకుండా ఏకపక్షంగా వార్తలు ఇవ్వడంతో ఆ చానెళ్లు ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp